అక్రమ వలసదారులను వెనక్కి పంపే ..చట్టంపై ట్రంప్​ సంతకం

అక్రమ వలసదారులను వెనక్కి పంపే ..చట్టంపై ట్రంప్​ సంతకం

వాషింగ్టన్  డీసీ: అక్రమ వలసదారులను అమెరికా నుంచి వెనక్కి పంపే మొదటి చట్టం అమల్లోకి వచ్చింది. లేకెన్  రిలే యాక్ట్ పై అధ్యక్షుడు డొనాల్డ్  ట్రంప్  బుధవారం (అమెరికా కాలమానం ప్రకారం) సంతకం చేశారు. 

అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్న వలసదారులను ముఖ్యంగా నేరాలకు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకుని, వెనక్కి పంపేందుకు ఫెడరల్  ఆఫీసర్లకు ఈ చట్టం మరిన్ని అధికారాలు కల్పిస్తుంది. లేకెన్  రిలే చట్టంపై సంతకం చేసిన తర్వాత వైట్ హౌస్ లో ట్రంప్  మాట్లాడారు. 

నేరాలకు పాల్పడిన అక్రమ వలసదారులను క్యూబాలోని గ్వాంటనామో బేకు తరలిస్తామని చెప్పారు. ‘‘లేకెన్  రిలే చట్టంపై సంతకం చేసిన రోజు మనకు అత్యంత ముఖ్యమైన రోజు. ఈ చట్టం అమలుతో లెక్కలేనన్ని అమాయక అమెరికన్ల జీవితాలకు రక్షణ కలుగుతుంది. 

ఈ చట్టం అమలుతో రిలే కుటుంబ సభ్యులకు నిజమైన నివాళి అర్పించినట్లైంది. అక్రమ వలసదారుల్లో కొంతమంది వారి దేశంలోనూ ఉండేందుకు అనర్హులు. అక్కడా వారిని నమ్మలేం. కాబట్టి, అలాంటి వారిని క్యూబాలోని గ్వాంటనామో బేకు తరలించాలని నిర్ణయించాం. 

ఆ క్రిమినల్స్ ను రిసీవ్  చేసుకునేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించాం” అని ట్రంప్  పేర్కొన్నారు. జార్జియాకు చెందిన నర్సింగ్  స్టూడెంట్  లేకెన్  రిలే (22) నిరుడు వెనిజులాకు చెందిన ఓ అక్రమ వలసదారుడి చేతిలో హత్యకు గురైంది. ఆమె పేరుతోనే ఈ చట్టం చేశారు. 

ఆమె తల్లిదండ్రులు, సోదరి సమక్షంలో లేకెన్  రిలే చట్టంపై ట్రంప్  సంతకం చేశారు. ఇక, ఈ చట్టం రెండు ఉభయ సభల్లోనూ ఆమోదం పొందింది.