వాషింగ్టన్: జోర్డాన్‌లోని తమ దేశ సైనిక స్థావరంపై డ్రోన్ దాడుల్లో ముగ్గురు సైనికులు ప్రాణాలు కోల్పోవడాన్ని అమెరికా తీవ్రంగా పరిగణించింది. వీటిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇప్పటికే స్పందించారు. ఈ పరిణామాలపై స్పందించిన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు ఇదో భయంకరమైన రోజని అన్నారు. బైడెన్ విదేశీ విధానంపై తీవ్ర విమర్శలు గుప్పించిన ఆయన.. అమెరికా బలహీనంగా మారిపోయిందని, మనం మూడో ప్రపంచ యుద్ధం అంచున ఉన్నామని హెచ్చరించారు. తాను అధ్యక్షుడిగా ఉంటే ఇలాంటి ఘటనలు చోటుచేసుకునేవి కాదన్నారు. ‘బైడెన్ ప్రభుత్వ బలహీనత కారణంగా ఈ విషాదం చోటుచేసుకుంది. నేను అధ్యక్షుడిగా ఉంటే ఇలాంటిది సంభవించే అవకాశమే లేకపోయేది.
ఉక్రెయిన్ యుద్ధం కూడా జరిగేది కాదు. ప్రపంచవ్యాప్తంగా శాంతి నెలకొనేది. దీనికి విరుద్ధంగా.. ప్రస్తుతం మనం మూడో ప్రపంచ యుద్ధం అంచున ఉన్నాం’’ అని సొంత సోషల్‌మీడియా ‘ట్రూత్’లో ట్రంప్ పేర్కొన్నారు. తాను పదవి నుంచి దిగిపోయే సమయానికి ఇరాన్ చాలా బలహీనంగా ఉండేదన్నారు. కానీ, బైడెన్ వచ్చిన తర్వాత ఆ దేశానికి వేలకోట్ల డాలర్లు వెళ్తున్నాయని, తద్వారా మధ్యప్రాచ్యంలో రక్తపాతానికి కారణమవుతోందని ఆరోపించారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యలను బైడెన్ ప్రభుత్వం తిప్పికొట్టింది. జాతీయ భద్రతను రాజకీయం చేయాలని ప్రయత్నిస్తున్న ట్రంప్ మాటలు అశాస్త్రీయంగా ఉన్నాయని పేర్కొంది.
రష్యా తీరుతో వరల్డ్ వార్: జెలెన్‌స్కీ
రష్యా, ఉక్రెయిన్ ఘర్షణలు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ హెచ్చరించారు. అమెరికా, జర్మనీ సహా అనేక దేశాలు తమకు మద్దతిస్తున్నందున ఏమైనా జరగొచ్చన్నారు. జర్మనీ పర్యటనలో ఉన్న ఆయన ఆదివారం ఓ వార్తా సంస్థ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.