
- ఖనిజాలు, లోహాల ఎగుమతిని నిలిపేయడంపై రగిలిపోతున్న అమెరికా
- ఇది అమెరికా ప్రారంభించిన టారిఫ్ యుద్ధమన్న చైనా
- తమ దేశంపై ఎంత సుంకం వేశారో యూఎస్‌నే అడగాలని కౌంటర్
న్యూయార్క్: ప్రపంచంలోనే కీలక దేశాలైన అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం ముదురుతున్నది. తమ దేశంలోని అరుదైన ఖనిజాలు, కీలకమైన లోహాలు, అయస్కాంతాలను యూఎస్‌కు ఎగుమతిని నిలిపేయడం, బోయింగ్విమానాల డీల్‌ను చైనా రద్దు చేసుకోవాలని ఆదేశాలు జారీచేయడంతో రగిలిపోతున్న అమెరికా.. ప్రతీకార సుంకాలతో విరుచుకుపడుతున్నది. ఈ నేపథ్యంలోనే చైనాకు చెందిన కొన్ని ఉత్పత్తులపై యూఎస్ టారిఫ్‌లను 245 శాతానికి పెంచే అవకాశాలున్నట్టు వార్తలు వస్తున్నాయి.
చైనా ఈ మధ్య తీసుకుంటున్న నిర్ణయాలతో ఆ స్థాయి వరకు ప్రతీకార సుంకాన్ని ఎదుర్కోవచ్చని వైట్ హౌస్ ఫ్యాక్ట్ షీట్ వెల్లడించింది. ఈ ట్యాక్స్‌లు ‘‘అమెరికా ఫస్ట్ ట్రేడ్ పాలసీ’’లో భాగంగా, దేశీయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి, వాణిజ్య ఒప్పందాలలో సమానత్వాన్ని పునరుద్ధరించడానికి వేసినట్టు పేర్కొన్నది. టారిఫ్ లపై నెలకొన్న ప్రతిష్టంభనను ముగించడం అనే బంతి బీజింగ్ కోర్టులోనే ఉందని అధ్యక్షుడు ట్రంప్ చెప్పిన కొద్దిసేపటికే వైట్‌హౌస్‌నుంచి ఈ ప్రకటన వెలువడింది.
సుంకం ఎంతో యూఎస్‌నే అడగండి: చైనా
కొత్త వాణిజ్య ఒప్పందాల కోసం అమెరికాతో 75కి పైగా దేశాలు చర్చలు ప్రారంభించాయి. కానీ చైనా మాత్రం ప్రతీకార సుంకాలతో స్పందించింది. దీంతో దానిపై యూఎస్ అదనపు సుంకాలతో విరుచుకుపడుతున్నది. కాగా, వైట్‌హౌస్ నుంచి వెలువడిన టారిఫ్ ప్రకటనపై చైనా స్పందించింది. అసలు తమ మీద ఎంత సుంకం వేశారనేది అమెరికానే అడగాలని ఆ దేశ విదేశాంగ శాఖ కౌంటర్ ఇచ్చింది. ఇది‘‘అమెరికా ప్రారంభించిన టారిఫ్ యుద్ధం” అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ పేర్కొన్నారు. చైనా ఈ యుద్ధాన్ని కోరుకోదని, అదే సమయంలో యూఎస్‌కు భయపడబోదని చెప్పారు. తమ చట్టబద్ధమైన హక్కులను కాపాడుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.