అమెరికాలో ఉంటున్న నాలుగు దేశాల వలసదారులకు ట్రంప్ షాక్

అమెరికాలో ఉంటున్న నాలుగు దేశాల వలసదారులకు ట్రంప్ షాక్
  • 5 లక్షల మైగ్రెంట్ల హోదా రద్దు
  • త్వరలో వారిని సొంత దేశాలకు పంపుతామని ప్రకటన 
  • క్యూబా, హైతీ, నికరాగ్వా, వెనెజులా దేశాలపై ఎఫెక్ట్​
  • సర్కారు నిర్ణయంపై ఫెడరల్ కోర్టుల్లో దావాలు   
  • అమెరికా చట్టాలకు కట్టుబడి ఉండండి: కేంద్రం 

మయామీ:  అమెరికాలో ఉంటున్న లక్షలాది మంది మైగ్రెంట్లకు టెంపరరీ హోదాను రద్దు చేస్తున్నట్టు హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ ప్రకటించింది. మరో నెల రోజుల్లో క్యూబా, హైతీ, నికరాగ్వా, వెనెజులా దేశాలకు చెందిన సుమారు 5.32 లక్షల మందిని వారి వారి దేశాలకు డిపోర్ట్ చేయనున్నట్టు స్పష్టం చేసింది. యుద్ధాలు, సంక్షోభాలు నెలకొన్న క్యూబా, హైతీ, నికరాగ్వా, వెనెజులా దేశాల పౌరులకు గత అధ్యక్షుడు జో బైడెన్ హయాంలో హ్యూమనిటేరియన్ పెరోల్ కింద అమెరికా ఆశ్రయం కల్పించింది. ఈ నాలుగు దేశాల నుంచి నెలకు 30 వేల మందికి టెంపరరీ హోదాతో అమెరికా వచ్చి రెండేండ్లు పని చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. దీంతో అక్టోబర్ 2022లో లక్షలాది మంది అమెరికాకు వలస వచ్చారు.

 అయితే, వీరందరూ ఈ ఏడాది ఏప్రిల్ 24న లేదా ఫెడరల్ రిజిస్టర్ లో నోటీస్ పబ్లిష్ చేసిన 30 రోజుల తర్వాత లీగల్ స్టేటస్ ను కోల్పోతారని శుక్రవారం యూఎస్ హోంల్యాండ్ సెక్యూరిటీ మంత్రి క్రిస్టీ నోయెమ్ వెల్లడించారు. అమెరికా గత అధ్యక్షులు సంక్షోభాల్లో ఉన్న ఆయా దేశాల బాధిత పౌరులకు ఆశ్రయం కల్పించేందుకు అమలు చేస్తున్న హ్యూమనిటేరియన్ పెరోల్ దుర్వినియోగం అవుతోందని, అందుకే తాము ఈ పాలసీని రద్దు చేస్తామని ప్రెసిడెంట్ ట్రంప్ ఇదివరకే ప్రకటించారు. ట్రంప్ ఆదేశాల నేపథ్యంలో తాజాగా ఈ పాలసీ కింద వచ్చిన మైగ్రెంట్లకు టెంపరరీ హోదాను రద్దు చేయనున్నారు. అమెరికాలో ఉండేందుకు చట్టబద్ధమైన హక్కు లేనివాళ్లంతా పెరోల్ టర్మినేషన్ డేట్​లోగా తప్పకుండా డిపోర్ట్ కావాల్సిందేనని హోంల్యాండ్ సెక్యూరిటీ తేల్చిచెప్పింది. 

ఫెడరల్ కోర్టులో దావాలు.. 

ట్రంప్ సర్కారు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అమెరికన్ పౌరులు, ఇమిగ్రెంట్ల గ్రూపు ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాల్లోని ఫెడరల్ కోర్టుల్లో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. ఈ నాలుగు దేశాల పౌరులకు హ్యూమనిటేరియన్ పెరోల్ ను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశాయి. 

అమెరికా చట్టాలకు కట్టుబడి ఉండండి: కేంద్రం
 
అమెరికాలో ఉంటున్న ఇండియన్ స్టూడెంట్లు అక్కడి చట్టాలు, నిబంధనలకు కట్టుబడి ఉండాలని భారత ప్రభుత్వం సూచించింది. హమాస్ టెర్రరిస్ట్ సంస్థ ప్రాపగండాను వ్యాప్తి చేస్తున్నాడంటూ ఇటీవల జార్జిటౌన్ వర్సిటీలో పోస్ట్ డాక్టోరల్ రీసెర్చర్ గా ఉన్న బాదర్ ఖాన్ సూరిని యూఎస్ పోలీసులు అరెస్ట్  చేశారు. పాలస్తీనా అనుకూల నిరసనల్లో పాల్గొన్న కారణంగా కొలంబియా వర్సిటీ స్టూడెంట్ రంజిని శ్రీనివాసన్ వీసా రద్దు కావడంతో ఆమె అరెస్ట్ కు ముందే కెనడాకు సెల్ఫ్ డిపోర్ట్ అయింది. ఖాన్ సూరి డిపోర్టేషన్​కు అమెరికా అధికారులు సిద్ధం కాగా, కోర్టు స్టే ఇచ్చింది. ప్రస్తుతం అతను డిటెన్షన్ సెంటర్​లోనే ఉన్నాడు. యూనివర్సిటీల్లో పాలస్తీనా, హమాస్ అనుకూల నిరసనల్లో పాల్గొనేవారిని టెర్రరిస్ట్ సింపథైజర్లుగా ప్రకటించిన ప్రెసిడెంట్ ట్రంప్.. వారిని సొంత దేశాలకు తిప్పిపంపుతామని హెచ్చరించారు. దీనిపై తాజాగా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందించా రు. ‘‘ఇమిగ్రేషన్ వ్యవహారాలు ఆయా దేశాల సార్వభౌమ అధికారాల ప్రకారం కొనసాగుతా యి. ఇండియాకు వచ్చే విదేశీయులు ఇక్కడి చట్టాలకు కట్టుబడి ఉండాలని కోరుకున్నట్లే..అమెరికాలోని ఇండియన్లు అక్కడి చట్టాలకు కట్టుబడి ఉండాలి” అని స్పష్టం చేశారు.