- కుడిచెవిని చీలుస్తూ దూసుకెళ్లిన బుల్లెట్.. తప్పిన ప్రాణాపాయం
- వేదికకు దగ్గర్లోని షెడ్డుపై నుంచే ఫైరింగ్
- బుల్లెట్లు తగిలి ఒకరి మృతి.. ఇద్దరికి తీవ్రగాయాలు
- దుండగుడిని కాల్చి చంపిన భద్రతాబలగాలు
- ట్రంప్‌పై దాడిని ఖండించిన బైడెన్, మోదీ, రాహుల్, ప్రపంచ దేశాల నేతలు
- నమ్మలేకపోతున్నా.. దేవుడే కాపాడాడు: ట్రంప్
బట్లర్ టౌన్(పెన్సిల్వేనియా) : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(78)పై తూటా పేలింది. ఓ ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతుండగా ఆయనపై హత్యాయత్నం జరిగింది. ఓ దుండగుడు సమీపంలోని షెడ్డుపై నుంచే కాల్పులు జరపగా.. అదే సమయంలో ట్రంప్ తన తలను కాస్త పక్కకు తిప్పడంతో త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. అమెరికాలోని పెన్ సిల్వేనియా స్టేట్ లోని బట్లర్ టౌన్ లో స్థానిక కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దుండగుడి గన్ నుంచి దూసుకొచ్చిన ఓ బుల్లెట్ ట్రంప్ కుడి చెవిని చీల్చుకుంటూ వెళ్లింది. ట్రంప్ వెనక వైపున కూర్చున్న ఆడియెన్స్‌లో ఒకరికి తాకింది. వరుసగా దూసుకొచ్చిన బుల్లెట్లు తగిలి మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బుల్లెట్ తగలగానే ట్రంప్ తన చేతితో చెవిని తాకడం, ఆ వెంటనే రక్తం కారడాన్ని గుర్తించి అలర్ట్ కావడం వీడియోల్లో కనిపించింది. గన్ షాట్స్ సౌండ్ వినపడటం, ట్రంప్ వెనక ఆడియెన్స్‌లో ఒకరు కుప్పకూలిపోగానే.. కొందరు ‘గెట్ డౌన్’ ‘గెట్ డౌన్’ అని అరుస్తూ మిగతా వారిని అలర్ట్ చేశారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది.
ఆ వెంటనే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ట్రంప్ చుట్టూ కవచంగా ఏర్పడి ఆయనకు బుల్లెట్లు తగలకుండా కాపాడారు. తర్వాత ట్రంప్‌ను తీసుకెళ్లి కారులోకి ఎక్కించారు. చెవి నుంచి రక్తం కారుతున్నా.. ట్రంప్ పిడికిలి బిగించి ‘ఫైట్’ ‘ఫైట్’ అంటూ తన మద్దతుదారులను ఉద్దేశించి అరుస్తూ కారు వద్దకు వెళ్లారు. జనం కేకలు వేస్తూ ఎంట్రీ గేట్ల వైపుగా పరుగులు తీశారు. ట్రంప్‌ను వెంటనే పిట్స్ బర్గ్ ఏరియా హాస్పిటల్‌కు తరలించారని, ఆయన సేఫ్‌గా ఉన్నారని అధికారులు ప్రకటించారు.
ముందే బిల్డింగ్ ఎక్కి దాక్కుని..
బట్లర్ టౌన్‌లోని ఓ పార్కులో ట్రంప్ మీటింగ్ జరగగా.. దుండగుడు పక్కా ప్లాన్ ప్రకారం వేదికకు కేవలం 150 మీటర్ల దూరంలోనే ఉన్న షెడ్డులాంటి ఓ బిల్డింగ్ రూఫ్‌పైకి ముందే నిచ్చెన ద్వారా చేరుకుని దాక్కున్నాడు. ట్రంప్ వేదికపైకి వచ్చి మాట్లాడుతుండగా సెమీ ఆటోమేటిక్ రైఫిల్‌తో కాల్పులు జరిపాడు. అక్కడికి కొద్ది దూరంలోని ఎత్తైన ప్రాంతంలో ఉన్న ఓ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ వెంటనే దుండగుడిని గుర్తించి కాల్చి చంపాడు. కాల్పులకు తెగబడ్డ యువకుడిని స్థానిక బెథెల్ పార్క్ ఏరియాకు చెందిన థామస్ మాథ్యూ క్రూక్స్(20)గా గుర్తించారు. ఘటనా స్థలానికి దగ్గర్లో పార్క్ చేసిన థామస్ కారులో పేలుడు పదార్థాలను గుర్తించామని పోలీసులు తెలిపారు. ఈ ఘటను హత్యాయత్నంగా నమోదు
చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ట్రంప్‌ను టార్గెట్‌గా చేసుకుని దుండగుడు అనేక రౌండ్లు బుల్లెట్లు షూట్ చేయగలగడం ఆశ్చర్యంగా ఉందని ఎఫ్‌బీఐ స్పెషల్ ఏజెంట్ కెవిన్ అన్నారు.
నిందితుడు మ్యాథ్స్‌లో టాప్.. స్టార్ అవార్డ్ విజేత
ట్రంప్‌పై కాల్పులకు తెగబడ్డ క్రూక్స్ రిపబ్లికన్ పార్టీ మద్దతుదారుగా రిజిస్టర్ చేసుకున్నాడు. నవంబర్ లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేయడానికి ఫస్ట్ టైం ఓటర్ గా నమోదయ్యాడు. అయితే, క్రూక్స్ అదే అడ్రస్ ను పేర్కొంటూ 2021లో డెమోక్రటిక్ పార్టీకి 15 డాలర్ల విరాళం ఇచ్చినట్టుగా కూడా గుర్తించారు. కాగా, పిట్స్ బర్గ్ శివార్లలోని బెథెల్ పార్క్ ఏరియాకు చెందిన క్రూక్స్ 2022లో హైస్కూల్ విద్య పూర్తి చేశాడు. గణితంపై బాగా పట్టు ఉన్న అతడు నేషనల్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఇనీషియేటివ్ నిర్వహించిన పోటీలో 500 డాలర్ల ‘స్టార్ అవార్డు’ను కూడా అందుకున్నాడు.
గంటల వ్యవధిలో చైనాలో టీషర్టుల అమ్మకం
బీజింగ్: డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులకు సంబంధించిన టీ షర్టులు అమెరికాతో పాటు చైనా వీధుల్లో వైరల్ అవుతున్నాయి. కాల్పులు జరిగిన తర్వాత భద్రతా సిబ్బంది ట్రంప్‌ను తీసుకెళ్తున్న ఫొటో ఆ టీషర్ట్స్‌పై ప్రింట్ చేశారు. ఫైరింగ్ ఘటన జరిగిన రెండు గంటల్లోనే కొన్ని వేల టీ షర్టులను చైనీస్ ఆన్లైన్ రిటైలర్లు ‘సావనీర్ టీ షర్ట్’ పేరుతో విక్రయించారు. ఆ టీషర్ట్‌పై ‘‘కాల్పులు నన్ను మరింత స్ట్రాంగ్ చేస్తాయి’’అని రాసి ఉంది. చైనాలోని పలు స్టోర్లలో కూడా ఈ టీషర్టులను హ్యాంగ్ చేశారు. చైనీస్ ఆన్లైన్ షాపింగ్ పోర్టల్ టావోబావోకు చెందిన లి జిన్వీ మాట్లాడుతూ.. ట్రంప్‌పై కాల్పులు జరిగిన వెంటనే టావోబావో టీ షర్టులను ప్రింట్ చేయడం ప్రారంభించిందన్నారు.
భారీగా పెరిగిన ట్రంప్ విజయ అవకాశాలు
వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పుల ఘటన తర్వాత అమెరికాలో రాజకీయం మరింత హీటెక్కింది. ట్రంప్ విజయ అవకాశాలు మరింత పెరిగాయని అక్కడి పొలిటికల్ అనలిస్టులు అభిప్రాయపడ్తున్నారు. అమెరికా ప్రజల్లో ట్రంప్ పట్ల సానుభూతితో పాటు విన్నింగ్ చాన్స్ కూడా పెరిగిందని పోల్‌స్టర్ అనే సంస్థ తన తాజా నివేదికలో వెల్లడించింది. ట్రంప్‌కు ప్రజల్లో మద్దతు ఒక్కసారిగా 8 శాతం పెరిగినట్లు పేర్కొంది. శనివారం వరకు ట్రంప్ గెలిచే అవకాశాలు 65.2% ఉండగా.. దాడి తర్వాత ఒక్కసారిగా 73.3 శాతానికి పెరిగినట్టు విలియం హిల్ బెట్టింగ్ సంస్థ తన నివేదికలో తెలిపింది. అదేవిధంగా, రిపబ్లిక్ పార్టీకి విరాళాలు కూడా పెరిగాయని పలు అమెరికన్ మీడియా సంస్థలు ప్రకటించాయి.
అమెరికాలో హింసకు తావులేదు: బైడెన్
ట్రంప్ పై హత్యాయత్నాన్ని ప్రెసిడెంట్ జో బైడెన్ తీవ్రంగా ఖండించారు. అమెరికా గడ్డపై ఇలాంటి హింసకు తావు లేదన్నారు. దీనిని ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరారు. దేశంలో ఇలాంటి ఘటనలను జరగనివ్వకుండా అమెరికన్లంతా ఒక్కటవ్వాలని పిలుపునిచ్చారు. శనివారం రాత్రి ట్రంప్ తో ఆయన ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనపై ఏం చెప్పాలో తెలియక మాటలు రావడంలేదని వైట్ హౌస్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. బైడెన్ వీకెండ్ లో భాగంగా డెలావర్ లోని ఓ చర్చిలో ఉండగా.. ట్రంప్ పై కాల్పుల విషయం తెలియగానే వైట్ హౌస్ కు తిరిగి వచ్చారని వెల్లడించారు. కాగా, వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్, మాజీ ప్రెసిడెంట్లు ఒబామా, జార్జి బుష్, బిల్ క్లింటన్ కూడా ఈ అటాక్ ను ఖండించారు. కాల్పులు జరిపిన దుండగుడు ఒక రాక్షసుడని ట్రంప్ భార్య మెలానియా అన్నారు. తన భర్తను కాపాడిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు, పోలీసులకు మెలానియా, ఆమె కూతురు ఇవాంకా ట్రంప్ ధన్యవాదాలు తెలిపారు.
దేవుడే కాపాడాడు..
ఈ దాడి నుంచి దేవుడే నన్ను కాపాడాడు. ఈ క్షణం మనమంతా ఐక్యంగా ఉండాలి. అమెరికన్లుగా మన నిజమైన వ్యక్తిత్వాన్ని చాటి చెప్పాలి. మనం ధైర్యంగా పోరాడాలి. చెడును గెలవనివ్వకూడదు. అమెరికాలో ఇలాంటి ఘటన జరగడాన్ని నమ్మలేకపోతున్నా. నా కుడిచెవిని చీలుస్తూ ఓ బుల్లెట్ దూసుకుపోయింది. ముందుగా బుల్లెట్ పేలిన శబ్దం, ఆ తర్వాత చెవి వద్ద జువ్వుమంటూ ఏదో దూసుకెళ్లిన శబ్దం వినగానే ఏదో జరిగిందని అర్థమైంది. అంతలోనే నా చెవిని చీల్చుకుంటూ బుల్లెట్ వెళ్లిపోయింది. వెంటనే రక్తం కారిపోయింది. అప్పుడుగానీ నాపై కాల్పులు జరిగిన విషయం పూర్తిగా అర్థంకాలేదు. దేవుడా అమెరికాను కాపాడు!
‑ డొనాల్డ్ ట్రంప్ (హత్యాయత్నం జరిగిన కొద్దిసేపటికి ‘ట్రూత్ సోషల్’లో పెట్టిన పోస్టు)