నిమిషాల్లోనే రూ.5 లక్షల కోట్ల సంపద ఆవిరి.. ట్రంప్ టారిఫ్ భయాలతో స్టాక్ మార్కెట్ ఢమాల్..

నిమిషాల్లోనే రూ.5 లక్షల కోట్ల సంపద ఆవిరి.. ట్రంప్ టారిఫ్ భయాలతో స్టాక్ మార్కెట్ ఢమాల్..

స్టాక్ మార్కెట్లు సోమవారం (ఫిబ్రవరి 3) నష్టాలతో మొదలయ్యాయి. ట్రంప్ టారిఫ్ వార్ ప్రభావం ఇండియన్ మార్కెట్లపై పడింది. దీంతో సెన్సెక్స్ 730 పాయింట్లు పడిపోయి 76,774 వద్దకు చేరుకుంది. అదే విధంగా నిఫ్టీ 243 పాయింట్లు కోల్పోయి ప్రారంభ సెషన్లలో 23,239 వరకు పడిపోయింది. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్ లు దాదాపు 2 శాతం పడిపోయి తీవ్ర నష్టాలను చవిచూశాయి. దీంతో సోమవారం 5 కోట్ల రూపాయల సంపద ఆవిరై పోయింది. ఇండియా విక్స్ 5 పాయింట్లు పెరిగి 14.76 లెవల్స్ కు చేరుకుంది. 

మార్కెట్లపై ఆశలు పెంచిన బడ్జెట్:

శనివారం (ఫిబ్రవరి 1) కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టడంతో మార్కెట్లు కాస్త పెరిగినట్లు కనిపించాయి. మిడిల్ క్లాస్ కు అనుకూలమైన బడ్జెట్ ప్రవేశ పెట్టారని, దీనివలన కన్జంప్షన్ పెరుగుతుందనే ఊహాగానాలతో మార్కెట్లు పెరిగాయి. అదే సమయంలో ఇండియా విక్స్ పడిపోయింది. దీన్ని మార్కెట్లు పాజిటివ్ సైన్ గా తీసుకున్నాయి. కానీ ఆ లాభం రెండు రోజులు కూడా నిలబడలేదు. 

ట్రంప్ టారిఫ్ వార్.. కెనడా, మెక్సికో, చైనా ప్రతిఘటన.. మార్కెట్లపై ప్రభావం:

 కెనడా, మెక్సికో, చైనా దేశాలపై యూఎస్ ప్రసిడెంట్ ట్రంప్ టారిఫ్ లు విధించడం ప్రపంచ మార్కెట్లతో పాటు ఇండియా మార్కెట్ పై వ్యతిరేక ప్రభావం చూపింది. కెనడా, మెక్సికో దేశాలపై 25 శాతం, చైనాపై 10 శాతం సుంకాలను విధిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై ఆయా దేశాలు అంతే స్థాయిలో స్పందించాయి. కెనడా, మెక్సికో దేశాలు అమెరికాపై అదే స్థాయిలో పన్నులు విధిస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో ట్రేడ్ వార్ మొదలయ్యింది. 

ఈ ప్రభావం ప్రంపంచ మార్కెట్లతో పాటు ఏసియన్ మార్కెట్లపై పడింది. ‘‘భారత్ లో మంచి బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశ పెట్టినప్పటికీ.. మొదటి దశ టారిఫ్ వార్ మొదలవ్వడంతో మార్కెట్లలో అనిశ్చితి ఏర్పడింది. మరో దశలో ట్రంప్ ఇతర దేశాలపై కూడా సుంకాలు విధించే అవకాశం ఉంది. ఈ భయాలతో మార్కెట్లు నష్టాలకు లోనవుతున్నాయి’’ అని జియో జిత్ ఫైనాన్షియల్ చీఫ్ ఇన్వెస్ట్ మెంట్ స్ట్రాటజిస్ట్ వి.కె.విజయ్ కుమార్ తెలిపారు. 

అయితే ఈ టారిఫ్ లు మన దేశంపై విధించలేదు. ఈ టారిఫ్ వార్ ప్రస్తుతం మన దేశంపై ప్రస్తుతం ఎక్కవ కాలం ప్రభావం చూపదు. కానీ డాలర్ ఇండెక్స్ 109.6 కు చేరుకుంది. దీంతో ఫారెన్ ఇన్వెస్టర్లు మరింత అమ్మకాలు జరిపే అవకాశం ఉంది. ఇది మార్కెట్లపై మరింత ఒత్తడి చూపిస్తుంది’’ అని విజయ్ కుమార్ తెలిపారు.