చైనా కోరలు పీకిన ట్రంప్ టారిఫ్స్ : ఇండియా ఎగుమతిదారుల ఖుషీ ఖుషీ..

చైనా కోరలు పీకిన ట్రంప్ టారిఫ్స్ : ఇండియా ఎగుమతిదారుల ఖుషీ ఖుషీ..

Trump Tariffs: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై టారిఫ్స్ విధించే నిర్ణయం అమలులోకి వచ్చాయి. ఈ క్రమంలో అమెరికాతో భారత్ సంబంధాలు ఎంత బలంగా ఉన్నాయనే విషయం నేడు మరో సారి రుజువైంది. అందరితో పాటు టారిఫ్స్ విషయంలో ఇండియా కూడా ప్రభావితం అయినప్పటికీ అది చైనా లాంటి ప్రత్యర్థులపై గెలుపుకు మార్గం సుగమం చేసింది. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారాలనే భారత లక్ష్యాన్ని చేరుకోవటానికి ఇదొక సదవకాశాన్ని కల్పించిందని చెప్పుకోవచ్చు. 

అమెరికాలోకి దిగుమతి అయ్యే భారతీయ ఉత్పత్తులలై ట్రంప్ కొత్త టారిఫ్స్ కింద 26 శాతం పన్ను విధించబడనుంది. కానీ ఈ తీవ్రత ట్రంప్ చైనాపై విధించిన 34 శాతం కంటే తక్కువగా ఉండటమే కలిసొస్తోన్న విషయం. ట్రంప్ అధిక టారిఫ్స్ కారణంగా డ్రాగన్ దేశం అమెరికా మార్కెట్లలో తన వస్తువులను గతంలో కంటే ఎక్కువగా విక్రయించాల్సి ఉంటుంది. అంటే ఒక విధంగా ఇండియా ఉత్పత్తుల కంటే కూడా ఈ ధరలు అధికంగా ఉంటాయి. ఈ పరిస్థితులు అమెరికా మార్కెట్లలో భారతీయ ఉత్పత్తులకు చవక రేట్లకు ఆఫర్ చేయటానికి దోహదపడుతుంది.

చైనాపై అధిక పరస్పర పన్నులను అమెరికా ప్రకటించటం వల్ల.. భారత వస్త్ర పరిశ్రమ, ఫుట్‌వేర్, ఫ్యాషన్, టెక్స్ టైల్ రంగాల ఉత్పత్తులు ఎక్కువగా అమెరికాకు షిప్మెంట్ చేసేందుకు అవకాశాలు పెరిగాయని భారత ప్రభుత్వ వర్గాలు ప్రస్తుత పరిస్థితుల అధ్యయనం ద్వారా వెల్లడించాయి. ఇదే క్రమంలో ఇండియా తన ఐరన్ అండ్ స్టీల్ ఉత్పత్తులను చైనా కంటే తక్కువ రేట్లకు అమెరికాకు ఎగుమతి చేయటానికి వీలుంటుందని నిపుణులు చెబుతున్నారు. 

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫిబ్రవరిలోనే భారత ప్రధాని మోదీ యూఎస్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ట్రంప్ ఈసారి అధిక పన్నుల దిశగా వెళ్లాలని నిర్ణయించినందున ముందుగానే చర్చల్లో పాల్గొనటం ప్రస్తుతం పరస్పర సుంకాల్లో కొంత తక్కువ రేట్ల ప్రకటనకు దారితీసిందనే వాదనలు కూడా ఉన్నాయి. మిత్రదేశంగా ఉన్న భారత్ పై ట్రంప్ సుంకాలు కొత్త వ్యాపార అవకాశాలను కూడా తీసుకురావటం గమనార్హం. భారత్ అమెరికా ఉత్పత్తులపై కొనసాగిస్తున్న భారీ సుంకాలు.. అమెరికన్ కంపెనీలు తమ ఉత్పత్తులను భారతదేశంలో విక్రయించడాన్ని కష్టతరంగా, ఖరీదైనదిగా మార్చుతోందని వైట్ హౌస్ అప్పట్లో చేసిన ప్రకటనలో పేర్కొంది.

ALSO READ : Trump 26% Tariff: కలిసొచ్చిన ట్రంప్ టారిఫ్స్.. ఇండియాలో ఆ 2 రంగాలకు గెయిన్..

ప్రస్తుత చర్యల తర్వాత ఇండియాలోకి దిగుమతి చేయబడుతున్న 23 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా వస్తువులపై సుంకాలను గణనీయంగా తగ్గించడానికి మోదీ సర్కార్ ఎలాంటి చర్యలతో ముందుకొస్తుందో వేచి చూడాల్సి ఉంది.