టారిఫ్​ల యుద్ధం..ట్రంప్​పై చైనా దూకుడు.!

టారిఫ్​ల యుద్ధం..ట్రంప్​పై చైనా దూకుడు.!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రారంభించిన వాణిజ్య సుంకాల యుద్ధం.. తుపాకులు లేదా బాంబులు ఉపయోగించని టారిఫ్​ల యుద్ధంగా మారింది. ప్రపంచ దేశాలపై జరుగుతున్న ఈ సుంకాల యుద్ధం స్వల్పకాలికంగా ఉంటుందని భావిస్తున్నారు. కానీ, అన్ని యుద్ధాల మాదిరిగానే,  ట్రంప్​ టారిఫ్​ల యుద్ధం ఊహించని దిశల్లోకి వెళుతోంది. చాలా దేశాలు డొనాల్డ్ ట్రంప్ ఊహించిన విధంగా స్పందించాయి. కానీ,  ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా, అమెరికాపై  దూకుడుగా దాడిచేసే మోడ్‌లోకి వెళ్లింది. ఇది పూర్తిగా ట్రంప్​ ఊహించని పరిణామం.  చైనా అమెరికాపై ఎదురుతిరిగి పోరాడుతోంది.  అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌కు ఇది పెద్ద షాక్.   ట్రంప్, డ్రాగన్​ మధ్య జరుగుతున్న సుంకాల యుద్ధంలో  చైనాదే ఒకింత పైచేయిగా కనిపిస్తోంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా తెలివైన వ్యక్తి. ఆయన  ఎప్పుడూ తను  యుద్ధాలను ప్రారంభించనని పదే పదే చెపుతాడు. కానీ,  ఇప్పుడు  ట్రంప్ చాలా పెద్ద యుద్ధం మధ్యలో ఉన్నాడు.  దీని  ముగింపు ఎవరూ ఊహించలేరు. ఉక్రెయిన్​పై  యుద్ధం కేవలం 15 రోజుల్లో  ముగిసిపోతుందని భావించిన రష్యా  ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్ యుద్ధాన్ని ప్రారంభించిందని మనం ఇక్కడ గుర్తించుకోవాలి.  మూడేళ్లు దాటినా రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతోంది.  ఇరుదేశాల మధ్య జరుగుతున్న యుద్ధంలో  రష్యా ఇంకా  గెలవలేదు. అదేవిధంగా  చైనా కూడా ఈ వాణిజ్య యుద్ధంలో గెలవకపోవచ్చు. కానీ, చైనా కూడా దాని పట్టును కోల్పోదు. 

ట్రంప్ అండ్​ టారిఫ్స్​

సుంకాలు అమెరికన్ తయారీ రంగంలో  క్షీణత సమస్యను పరిష్కరిస్తాయని అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ భావించారు.  సుమారు యాభై సంవత్సరాల క్రితం..  ప్రపంచవ్యాప్తంగా ఉక్కు,  కార్లు,  నౌకలు, బొగ్గు, చమురు ఉత్పత్తిలో  అమెరికా అగ్రస్థానంలో ఉంది.  అయితే, ఇప్పుడు అమెరికాలో  అటువంటి వస్తువుల ఉత్పత్తి చాలా తక్కువ స్థాయిలో ఉంది.  ఈ నేపథ్యంలో  ట్రంప్ అధిక సుంకాల ద్వారా  ఉక్కు, కార్ల తయారీ ఫ్యాక్టరీలతోపాటు ఇతర కర్మాగారాలు అమెరికాకి తిరిగి వస్తాయని భావించారు.  అమెరికా నుంచి ఇతర దేశాలకు  తరలిపోయిన కర్మాగారాలు సుంకాల ధాటికి తిరిగి అమెరికా వస్తే  ఆదాయంతోపాటు  ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని ఆయన ఊహించారు. ఈక్రమంలో ప్రపంచంలోని దాదాపు  అన్ని దేశాలపై డొనాల్డ్ ట్రంప్  సుంకాలను ప్రకటించారు.  చాలా దేశాలు సానుకూలంగా స్పందించి ట్రంప్‌ను సంతృప్తి పరిచేవిధంగా అమెరికాకి హామీ ఇచ్చాయి. భారత ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ కూడా  అమెరికా ప్రెసిడెంట్​ డొనాల్డ్ ట్రంప్‌ను కలిసి ఒప్పందం కుదుర్చుకుంటామని హామీ ఇచ్చారు. అమెరికాకి  చైనా అతిపెద్ద ఎగుమతిదారుగా ఉన్నందున.. డొనాల్డ్ ట్రంప్  చైనాపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. అమెరికా ధాటికి చైనా భయపడుతుందని భావించిన ట్రంప్ చైనాపై అదనపు సుంకాలను ప్రకటించారు. దీనిని యుద్ధంలో 'షాక్ అండ్ అవ్' సిద్ధాంతం అంటారు. కానీ, ట్రంప్​ ఊహించనివిధంగా  చైనా అమెరికాపై  ప్రతీకార సుంకాలను ప్రకటించడం ప్రారంభించింది. ఈ పరిణామం ట్రంప్‌ను చాలా తీవ్రంగా దెబ్బతీసింది. 

చైనాపట్ల  ట్రంప్ తప్పుడు లెక్కలు

డొనాల్డ్​ ట్రంప్  చైనాను చాలా తక్కువ అంచనా వేశారు.  ఇతర దేశాల మాదిరిగానే చైనా కూడా తమను వాణిజ్య సుంకాలపై అభ్యర్థిస్తుందని భావించారు. కానీ, చైనా  అమెరికాకు దీటుగా స్పందించింది.  ట్రంప్​తో  చర్చించేందుకు నిరాకరించింది. అమెరికాపై తీవ్రంగా ప్రతీకారం తీర్చుకుంది. ఇది ట్రంప్ పూర్తిగా ఊహించనిది.
 చైనాను చర్చలకు ఆహ్వానిస్తే  తాను లొంగిపోయానని చైనా అర్థం చేసుకుంటుందని  ట్రంప్​కు తెలుసు.  చైనా అమెరికా నుంచి చాలా డిమాండ్ చేస్తుంది.  అంతేకాకుండా మరోవైపు  ట్రంప్ మిగతా ప్రపంచం ముందు వైఫల్యంలాగ కనిపిస్తాడు.  ట్రంప్ ఒకవేళ చైనా డిమాండ్లకు తలొగ్గితే ప్రపంచం కూడా చులకనగా చూస్తుంది.  ట్రంప్​తో చర్చలు జరపాలని ట్రంప్ అధికారులు చైనాను కోరుతూ వస్తున్నారు. కానీ ట్రంప్ ఇప్పుడు చిక్కుకున్నారని, చైనా డిమాండ్​ చేసే దేనినైనా అంగీకరించాల్సిన పరిస్థితిలో అమెరికా ఉందని  గ్రహించిన  చైనా  తనంతట తానుగా టారిఫ్​ వార్​పై చర్చించేందుకు తిరస్కరిస్తోంది. ట్రంప్ వ్యూహం వికటించి ఇప్పుడు ఆయన ఓడిపోయేలా కనిపిస్తోంది.  ఇప్పటికే  చైనా సోషల్ మీడియా ట్రంప్ ఓడిపోయినట్లుగా ఎగతాళి చేస్తోంది.

అమెరికాపై చైనా పైచేయి

గత కొన్ని వారాలుగా  ట్రంప్ దూకుడు సుంకాలకు చైనా సిద్ధమవుతోంది. అయితే, చైనా లొంగిపోవడానికి సిద్ధంగా లేదు. ప్రతి-చర్యలకు సిద్ధంగా ఉంది. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్  ట్రంప్​కు తమ  కఠినమైన ప్రతిస్పందనను తెలపాలని నిర్ణయించుకున్నారు.  అమెరికా సుంకాలను ప్రపంచ ఆర్థిక చరిత్రలో అతిపెద్ద జోక్ అని అధికారికంగా పేర్కొనడం ద్వారా చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ అమెరికా,  ట్రంప్​లను అవమానించింది. చైనా ఇతర దేశాలను సంప్రదించి, అంతర్జాతీయ వ్యవస్థలను విచ్ఛిన్నం చేస్తున్న అమెరికాకు దీటుగా వారి ప్రతిస్పందనలను  తమతో సమన్వయం చేసుకోవాలని చెప్పింది. 1953లో చైనా,  అమెరికా వాస్తవ యుద్ధానికి దగ్గరగా ఉన్నప్పుడు చైనా వ్యవస్థాపకుడు మావో  చేసిన పాత ప్రసంగాన్ని కూడా చైనా అధికారికంగా సోషల్ మీడియాలో ప్రచురించింది.  ‘ఈ యుద్ధం ఎంతకాలం కొనసాగినా మేం ఎప్పటికీ లొంగం. మనం పూర్తిగా గెలిచే వరకు పోరాడుదాం’ అని మావో ఆ ప్రసంగంలో పేర్కొన్నాడు. అయితే, ఇక్కడ మనం గమనించాల్సిన విషయంలో ఏమిటంటే  చైనా, అమెరికా  రెండూ  ఒక ఒప్పందానికి రావాలని లేదా ఇరుదేశాలు ఓడిపోతాయని గ్రహించాయి. కానీ,  ప్రస్తుతానికి చైనా పైచేయి సాధించింది. 

ఎప్పటికైనా  ట్రంప్  చైనాతో చర్చలు జరపడానికి ప్రయత్నిస్తాడు, చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​ తన ప్రాణ స్నేహితుడు అని చెపుతాడు.  కానీ, ట్రంప్ తన గౌరవాన్ని కాపాడుకునే మార్గం కోసం చూస్తున్నాడు. అమెరికాలో ప్రస్తుతం పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. ఎందుకంటే ధరలు పెరుగుతున్నాయి.  స్టాక్ మార్కెట్ పడిపోతోంది.  బిలియనీర్లు కోపంగా ఉన్నారు. ట్రంప్‌కు చైనాతో వెంటనే ఒప్పందం అవసరం.  గొప్ప ఫ్రెంచ్ ఆర్థికవేత్త ప్రౌధాన్ 200 సంవత్సరాల క్రితం చెప్పినట్లుగా భవిష్యత్తు పూర్తిగా అనూహ్యమైనది.  ప్రస్తుతం చైనా, అమెరికా మధ్య జరుగుతున్న టారిఫ్​ల పోరాటాన్ని ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనిస్తోంది. యూరప్, ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా, రష్యా, ఉక్రెయిన్ తదితర దేశాలు - ఈ పోరాటాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాయి.

ప్రతీకార దిశగా చైనా

చైనా కూడా ఇతర దేశాల మాదిరిగానే  తాను చెప్పినట్టుగానే ఆడుతుందని, అమెరికాతో చర్చలు జరిపేందుకు అభ్యర్థిస్తుందని ట్రంప్ భావించారు. కానీ,  చైనాతీరు ట్రంప్‌ను ఆశ్చర్యపరిచింది.  చైనా ప్రతీకారం తీర్చుకుంటుందని,  అవమానాలను భరించదని.. చివరివరకు పోరాడుతుందని తేల్చిచెప్పింది. అందరి విధేయతకు అలవాటుపడిన ట్రంప్‌ను ఈ భాష  దిగ్భ్రాంతికి గురిచేసింది. అమెరికాకు ‘అరుదైన ఖనిజాల’ ఎగుమతిని పరిమితం చేస్తున్నట్టు  చైనా ప్రకటించినప్పుడు అధ్యక్షుడు  ట్రంప్ షాక్ అయ్యారు.  ప్రపంచంలోని అరుదైన ఖనిజాలలో 90%  చైనానే ఉత్పత్తి చేస్తోంది. ఇవి ల్యాప్‌టాప్‌లు, ఆయుధాలు, అంతరిక్ష నౌకలు, దాదాపు ఆధునిక వస్తు సామగ్రి అన్నింటికీ అవసరం.  ‘రేర్ ​మినరల్స్’  లేకపోతే​ అమెరికా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. ట్రంప్ ఊహించని విధంగా చైనా, అమెరికా ఇప్పుడు తీవ్రమైన పోరాటంలో చిక్కుకున్నాయి. చైనా వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదు.  చైనా కూడా అమెరికా తమతో  చర్చలను అభ్యర్థించాలని సంకేతాలు పంపుతోంది. 

- డా. పెంటపాటి పుల్లారావు,
పొలిటికల్​ ఎనలిస్ట్