
న్యూఢిల్లీ: కొత్త ఏడాదిలో ఇంకా రెండు నెలలు కూడా పూర్తి కాలేదు అప్పుడే రూ.లక్ష కోట్ల విలువైన షేర్లను విదేశీ ఇన్వెస్టర్లు మార్కెట్‌లో అమ్మేశారు. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్‌ఎస్‌డీఎల్) డేటా ప్రకారం, ఫారిన్ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) ఈ ఏడాదిలో ఇప్పటివరకు నికరంగా రూ.99,299 కోట్లను మార్కెట్ నుంచి విత్‌డ్రా చేసుకున్నారు.
ఎఫ్‌పీఐల అమ్మకాల ఒత్తిడి ఈ నెలలో కూడా కొనసాగింది. ఈ నెల 10 నుంచి 14 మధ్య నికరంగా రూ.13,930 కోట్ల విలువైన షేర్లను అమ్మారు. దీంతో కలిపి ఈ నెలలో ఇప్పటివరకు రూ.21,272 కోట్లను మార్కెట్ నుంచి ఎఫ్‌పీఐలు విత్‌డ్రా చేసుకున్నారు. ఈ ఏడాది జనవరిలో నికరంగా రూ.78,027 కోట్ల విలువైన షేర్లను అమ్మారు. కిందటేడాది డిసెంబర్‌లో నికరంగా రూ.15,446 కోట్లను ఇన్వెస్ట్ చేసిన విదేశీ ఇన్వెస్టర్లు, కొత్త ఏడాదిలో మాత్రం నికర అమ్మకందారులుగా మారారు.
ట్రంప్ టారిఫ్ వార్‌కు తెరలేపడం, యూఎస్ బాండ్ ఈల్డ్‌లు పెరగడం, జియో పొలిటికల్ టెన్షన్లు, డాలర్ బలపడడం వంటి కారణాలతో ఇండియన్ మార్కెట్ నుంచి ఎఫ్‌పీఐలు వెళ్లిపోతున్నారు.