
Trump Tariffs: చైనాపై అమెరికా ఇటీవల టారిఫ్స్ రోజురోజుకూ పెంచుతూ విరుచుకుపడటంతో పరిస్థితులు దిగజారుతున్నాయి. పైకి చైనా తమకు నష్టమేమీ లేదంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు దీనికి పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. దీంతో చైనాలోని వ్యాపారులు ఆందోళన చెందుతూ పొరుగున ఉన్న భారతదేశానికి డిస్కౌంట్స్ ఆఫర్ చేస్తున్నారు. చైనా అమెరికా మధ్య కొనసాగుతున్న ఇగో వార్ కారణంగా చైనా ఉత్పత్తుల దిగుమతులపై ప్రస్తుతం 145 శాతం టారిఫ్స్ అమెరికా అమలులోకి తీసుకొచ్చింది.
దీంతో ప్రస్తుతం చైనా పోర్టుల్లో వింత పరిస్థితులు కనిపిస్తున్నాయి. చాలా యూఎస్ దిగుమతిదారులు తమ షిప్మెంట్స్ క్యాన్సిల్ చేసుకుంటున్నారు, కొన్ని కంటైనర్లను ఇతర మార్గాల గుండా తరలించటానికి రీరూట్ చేస్తున్నారు. దీంతో చైనాలోని గ్వాంగ్‌డాంగ్, జెజియాంగ్, జియాంగ్సు వంటి పారిశ్రామిక కేంద్రాల్లోని వ్యాపారుల్లో ఆందోళనలు పెరిగిపోతున్నాయి. దీంతో ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ ప్యానెల్స్, హెవీ మిషినరీ వంటి రంగాలకు చెందిన ఎగుమతులు నిలిచిపోయి కార్గో పోర్టుల్లో ఆగిపోయింది. చాలా మంది యూఎస్ క్లయింట్లు ఉత్పత్తులు సముద్ర మధ్యలో తరలింపులో ఉన్నప్పటికీ వాటిని వదిలేస్తున్న పరిస్థితులు కొనసాగుతున్నాయి.
దీంతో అమెరికాకు రోజూ తరలించే కంటైనర్ల సంఖ్య పోర్టుల్లో 40-50 మధ్య స్థాయి నుంచి ప్రస్తుతం రోజుకు 3-6 మధ్యకు పడిపోయింది. ప్రస్తుతం పరిస్థితులు కరోనా కాలంలో కంటే చాలా దారుణంగా మారాయని అక్కడి వ్యాపారులు చెబుతున్నారు. దీంతో అనేక ఎగుమతి ఆధారిత చైనా కంపెనీలు ఆర్డర్స్ లేక కుప్పకూలుతున్నాయి. కొన్ని చిన్న సంస్థలు తమ సామాన్లు, మెషినరీ కూడా విక్రయించేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో చైనా అమెరికాతో కాళ్ల బేరారిని వస్తుందా అనే విషయం వేచి చూడాల్సిందే.
ఇదే క్రమంలో చైనా సంస్థలు వియత్నాం, ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్ నుంచి ఎగుమతి ప్రణాళికలను కూడా రద్దు చేసుకుంటున్నారు. సముద్ర మధ్యలో ఉన్న కార్గోను క్లయింట్లు క్యాన్సిల్ చేసుకోవటం వల్ల తిరిగి వెనక్కి తెప్పించుకునే పనిలో చాలా మంది వ్యాపారులు ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు వ్యాపారులు వాటిని షిప్పింగ్ కంపెనీలకే అమ్మేస్తున్నారు. ముఖ్యమైన మినరల్స్ విషయంలో కూడా ఇదే తరహా పరిస్థితులు కొనసాగుతున్నాయని వారు చెబుతున్నారు.
ట్రంప్ ప్రస్తుత టారిఫ్స్ దెబ్బతో సెమీకండక్టర్లు, టెలికాం పరికరాలు, తదుపరి తరం బ్యాటరీలు వంటి ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం పడింది. అలాగే మేడ్ ఇన్ చైనా 2025 పారిశ్రామిక బ్లూప్రింట్‌లో భాగంగా బిలియన్ల కొద్దీ పెట్టుబడి పెట్టిన చైనా టెక్ ఎకోసిస్టమ్ కూడా ప్రస్తుత పరిణామాలతో ఆందోళనలకు గురవుతోంది. హువాయి, బీవైడీ, జియోమీ వంటి కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి తగ్గుతున్న డిమాండ్ కారణంగా తీవ్ర ప్రభావాన్ని చూస్తున్నాయని వెల్లడైంది. ఈ పరిస్థితుల్లో పెట్టుబడిదారులు చైనాకు చెందిన కంపెనీల్లో ఈక్విటీ పెట్టుబడులను సైతం విక్రయిస్తున్నారు. ప్రస్తుతానికి చైనా ఎగుమతి ఆధారిత పరిశ్రమలు నష్ట నియంత్రణ మోడ్‌లో ఉన్నాయి