
- వాపస్ తీస్కోకుంటే మరో 50% టారిఫ్‌లు.. చైనాకు ట్రంప్ హెచ్చరిక
- చైనాకు అమెరికా ప్రెసిడెంట్డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
వాషింగ్టన్: అమెరికా, చైనా మధ్య టారిఫ్ వార్ మరింత ముదురుతున్నది. ఇటీవలే చైనాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 34 శాతం అదనపు టారిఫ్ వేశారు. దీనికి కౌంటర్ గా చైనా కూడా అమెరికాపై 34 శాతం ప్రతీకార సుంకాలు విధించింది. తాజాగా చైనా నిర్ణయంపై ట్రంప్ స్పందించారు. తమపై విధించిన 34 శాతం టారిఫ్ ను వెనక్కి తీసుకోవాలని, లేకపోతే అదనంగా 50 శాతం టారిఫ్‌లు వేస్తానని, ఈనెల 9 నుంచే కొత్త టారిఫ్ లు అమల్లోకి వస్తాయని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు తన ట్రూత్ సోషల్ లో ఆయన ప్రకటించారు.
‘‘అమెరికాపై ఏదైనా దేశం అదనపు టారిఫ్ లు వేస్తే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని హెచ్చరించినా చైనా లెక్కచేయలేదు. చైనాకు ఈనెల 8 వరకు గడువు ఇస్తున్నా. అమెరికాపై విధించిన 34 శాతం టారిఫ్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. లేదా ఈనెల 9 నుంచి అదనంగా మరో 50 శాతం టారిఫ్‌లను భరించాల్సి ఉంటుంది” అని ట్రంప్ స్పష్టం చేశారు. కాగా, ఇదివరకే చైనాపై ఆయన 34 శాతం అదనపు టారిఫ్ వేశారు. అంతకుముందు 20 శాతం సుంకం ఉంది. దీంతో మొత్తం టారిఫ్ లు 54 శాతానికి చేరాయి. అదనంగా మరో 50 శాతం టారిఫ్ వేస్తే చైనాపై అమెరికా మొత్తం సుంకాలు 104 శాతానికి పెరుగుతాయి. అలాగే, ఈ నెల 5న వివిధ దేశాలపై టారిఫ్‌లు వేస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా భారత్‌పై 26 శాతం రెసిప్రోకల్ టారిఫ్‌లు వేశారు.