ఇక్కడా ఉన్నయ్​ ట్రంప్​ బిజినెస్​లు

అమెరికా అధ్యక్ష హోదాలో డొనాల్డ్​ ట్రంప్​ ఈరోజు ఇండియాకి తొలిసారి వస్తున్నారేమో గానీ ఆయనకు బిజినెస్​పరంగా మన దేశంతో ఎప్పటినుంచో సంబంధాలు ఉన్నాయి. ట్రంప్​ రియల్​ ఎస్టేట్​ ప్రాజెక్టులు నార్త్​ అమెరికా బయట ఇండియాలోనే ఎక్కువ ఉన్నాయి. ఈ విషయాన్ని స్వయంగా ఆయన కొడుకే (డొనాల్డ్​ ట్రంప్​ జూనియర్) చెప్పారు. ఈ వ్యాపారాలను చూసుకునేందుకు జూనియర్​ ట్రంప్ మన దేశానికి చాలా సార్లు వచ్చిపోతుంటారు. సీనియర్​ ట్రంప్​ కూడా చివరిసారిగా 2014లో వచ్చివెళ్లారు.

అద్భుతమైన మార్కెట్​​

ట్రంప్​ మన దేశంలోని వెంచర్లను మారుపేర్లతో కాకుండా నేరుగా ట్రంప్​ టవర్స్​​ అనే బ్రాండ్​ నేమ్​తోనే బిజినెస్​ చేస్తున్నారు. ఆ కుటుంబానికి ఇక్కడ ఉన్న మొత్తం ఆస్తుల సంఖ్య ఐదు. వాటిలో 4 లగ్జరీ రెసిడెన్షియల్​ ప్రాజెక్టులు. ఒకటి ఆఫీస్​ టవర్. ఈ అద్దాల మేడలు పుణె, ముంబై, కోల్​కతాలలో ఒక్కొక్కటి చొప్పున, గుర్గావ్​లో రెండు ఉన్నాయి. ఇండియా​ రియల్​ ఎస్టేట్​ను తాను ఎమర్జింగ్​ మార్కెట్​లా కాకుండా అమేజింగ్​ మార్కెట్​లా చూస్తానని​ ట్రంప్​ అప్పట్లో అన్నారు.

ట్రంప్ పేరిట ఉన్న టవర్ల వివరాలు..

పుణెలో 23 అంతస్తుల చొప్పున రెండు టవర్లు కట్టారు. పంచ్​శీల్​ రియాల్టీ సంస్థను పార్ట్నర్​గా పెట్టుకున్నారు. ముంబైలో 75 ఫోర్లతో ఆకాశాన్నంటే అపార్ట్​మెంట్​ లేపారు. మ్యాక్రోటెక్​ డెవలపర్స్ కంపెనీని భాగస్వామిగా చేర్చుకున్నారు. కోల్​కతాలో రెసిడెన్షియల్​ టవర్​ నిర్మాణం నడుస్తోంది. దీనికోసం యూనిమార్క్​ అండ్​ ట్రిబెకా డెవలపర్స్​తో జతకలిశారు. గుర్గావ్​లోని ఆఫీస్​ అండ్​ రిటైల్​ కాంప్లెక్స్ నిర్మాణం ఇప్పుడు ఏ స్థితిలో ఉందో​ తెలియదు. అక్కడి మరో రెసిడెన్షియల్​ టవర్స్ కన్​స్ట్రక్షన్​ కూడా పూర్తి కాలేదు. దీనికి ఎం3ఎం అండ్​ ట్రిబెకా డెవలపర్స్ సహకరిస్తోంది.

ఇరియో సిటీలో ఆఫీస్​ టవర్

ట్రంప్​ ఆర్గనైజేషన్​.. రియల్​ ఎస్టేట్​ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ ఇరియోతో పార్ట్నర్​షిప్​ పెట్టుకుంటున్నట్లు 2016లో చెప్పింది. ఇరియో ఫౌండర్​ లలిత్​ గోయెల్​. ఢిల్లీ అధికార పార్టీ లీడర్​ సుధాంశు మిట్టల్​కి ఈయన బావ. ఈ సంస్థపై 2018లో ఆర్థిక అవకతవకల​ ఆరోపణలు పెద్దఎత్తున వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇరియోతో ప్రస్తుతం డొనాల్డ్​ ట్రంప్​ సంస్థకు వ్యాపార భాగస్వామ్యం కొనసాగుతోందా లేదా అనేది క్లియర్​గా తెలియదు. ఇరియో వెబ్​సైట్​లో కూడా ట్రంప్​ ప్రాజెక్టు గురించిన ప్రస్తావన లేదు.

ఢిల్లీకి దగ్గరలో రెండు బిల్డింగ్​లు

ట్రంప్​ రియల్​ ఎస్టేట్​ సంస్థ గుర్గావ్​లో రెండు టవర్ల నిర్మాణం చేపడుతోంది. ఒక్కోదాన్ని 600 అడుగుల ఎత్తులో కట్టనున్నారు. 2 వేల కోట్ల డాలర్లు ఖర్చు పెట్టి 250కి పైగా లగ్జరీ అపార్ట్​మెంట్లను నిర్మించనున్నారు. 2018లో మొదలుపెట్టిన ఈ వెంచర్​ కన్​స్ట్రక్షన్​ ప్రస్తుతం ప్రారంభ దశలోనే ఉంది. ట్రిబెకా డెవలపర్స్​ అనే సంస్థ ట్రంప్​ ఆర్గనైజేషన్​తో ఏడేళ్లుగా కలిసి పనిచేస్తోంది. ఇండియాలో ట్రంప్​ బ్రాండెడ్​ ప్రాజెక్టులకు సరిపడే​ సైట్లను వెతికి పెడుతుంది.

పెదవి విప్పని పార్టనర్లు

అమెరికా అధ్యక్ష హోదాలో డొనాల్డ్​ ట్రంప్ ​మొదటిసారిగా ఇండియాకి వస్తుండటంతో అధికారికంగా వారం పది రోజుల ముందు నుంచే హడావుడి నెలకొంది. మన దేశంలో ఎక్కడకి వెళ్లినా ఆయనకు సంబంధించిన ముచ్చట్లే వినిపిస్తున్నాయి. కానీ.. ట్రంప్​కి ఇక్కడ బిజినెస్​ పార్ట్నర్లుగా ఉన్నోళ్లు మాత్రం ఆయన పర్యటనపై మాట వరసకైనా పెదవి విప్పట్లేదు. ‘ఈ టూర్​పై మీ అభిప్రాయమేంటి’ అని అడిగితే ఇద్దరు భాగస్వాములు కనీసం రెస్పాండే​ కాలేదు. మరో ఇద్దరు నిర్మొహమాటంగా ‘నో కామెంట్​’ అనేశారు.

అమెరికాలోని ట్రంప్​ ఆర్గనైజేషన్​ కూడా ఇండియన్​ వెంచర్ల గురించి అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆన్సర్​ చెప్పకుండా మౌనం పాటించింది. అయితే, ఎవరేం మాట్లాడకపోయినా జూనియర్​ ట్రంప్ మాత్రం స్పందించారు. ‘మా సంస్థ ఇండియాలో విజయాలను కొనసాగిస్తుండటం మాకు ఎంతో గర్వంగా ఉంది’ అన్నారు.

 

ఆరేళ్ల కిందట.. ఆశ్చర్యకరంగా..

పుణేకి డొనాల్డ్​ ట్రంప్​ రావటం 2014లో పెద్ద వార్త. ప్రైవేట్​ జెట్​లో చేరుకున్న ఆయన సిటీలోని పెద్దోళ్లకు పార్టీ ఇవ్వటం చర్చకు దారితీసింది. ఎందర్నో ఆశ్చర్యపరిచింది. ఇక్కడ కళ్లు చెదిరే రీతిలో కట్టిన రెండు ట్రంప్​ టవర్స్​లో ఆయన ఆస్తులు​ చాలా ఉన్నాయి. 4,400 స్క్వేర్​ ఫూట్​ అపార్ట్​మెంట్ల కనీస రేటు 19.5 లక్షల డాలర్లు. ఈ రెండు బిల్డింగ్​లను అతుల్​, సాగర్​ చోర్డియా అనే సోదరులు సొంతం చేసుకున్నట్లు పంచ్​శీల్​ రియాల్టీ సంస్థ చెప్పింది. డొనాల్డ్​ ట్రంప్​ అమెరికా ప్రెసిడెంట్​గా ఎన్నికైన తర్వాత న్యూయార్క్​లోని ట్రంప్​ టవర్​లో ఈ అన్నదమ్ములు ఆయన్ని ఓసారి కలిశారు. ట్రంప్​ ఇకపై బిజినెస్​లో కొనసాగుతారో లేదోననే ఆందోళనలు అప్పట్లో ఉండేవి. ఈ నేపథ్యంలో వీళ్ల​ మధ్య గొడవలొచ్చాయి. తర్వాత ఏమైందో తెలియదు.

కోల్కతాలో హాట్కేకుల్లా..

కోల్​కతాలో ట్రంప్​ టవర్​ మొదలైన రెండు నెలల్లోనే దాదాపు సగం యూనిట్లు హాట్​కేకుల్లా సేల్​ అయినట్లు తెలుస్తోంది. ఖైతాన్​ అండ్​ కంపెనీలో ఫైనాన్స్​ డైరెక్టర్​గా పనిచేసే సుమిత్​ భలోటియా ఈ బిల్డింగ్​ గురించి మాట్లాడుతూ ‘ఇది అమెరికా ప్రెసిడెంట్​కి సంబంధించిన ప్రాపర్టీ కాబట్టి ఇందులో పెట్టుబడి పెట్టేందుకు వెనకా ముందు ఆలోచించాల్సిన అవసరం లేదు’ అన్నారు. ట్రంప్​ అమెరికా అధ్యక్షుడు కాకముందు ఆయన వ్యాపార సామ్రాజ్యం గురించి తనకు తెలియదని చెప్పారు. పోయినేడాది సెప్టెంబర్​లో కోల్​కతా, గుర్గావ్​ రెసిడెన్షియల్ ప్రాజెక్టులవాళ్లు బయ్యర్లకు మూడు రోజుల న్యూయార్క్​ ట్రిప్ ఏర్పాటుచేశారు. ఇందులో దాదాపు 150 మంది పాల్గొన్నారు. వాళ్లంతా ఓరోజు సాయంత్రం డొనాల్డ్​ ట్రంప్​ని కలిసి పార్టీ చేసుకున్నారు.

అపార్ట్మెంట్ కొంటే జెట్ సర్వీస్

ముంబైలో 75 అంతస్తులతో ఆకాశాన్నంటే రీతిలో ట్రంప్​ టవర్​ నిర్మించారు. అందులో అపార్ట్​మెంట్లు కొన్నోళ్లకు ప్రైవేట్​ జెట్​ సర్వీస్​ను ఆఫర్​ చేశారు. ఈ ప్రాజెక్ట్​కు ప్రమోటర్​గా మ్యాక్రోటెక్​ డెవలపర్స్​ వ్యవహరించారు. ఈ సంస్థను మన దేశంలోనే ఎక్కువ డబ్బున్న రియల్​ ఎస్టేట్​ డెవలపర్​గా చెప్పుకునే మంగల్​ ప్రభాత్​ లోధా స్థాపించారు. ప్రస్తుతం ఆ కంపెనీని ఆయన కొడుకు అభిషేక్​ లోధా నడుపుతున్నారు. మ్యాక్రోటెక్​ డెవలపర్స్​ ఈమధ్య ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నట్లు వార్తలొచ్చాయి.

ముంబైలోని ట్రంప్​ టవర్​లో రెండు అపార్ట్​మెంట్లు కొన్న డైమండ్ల వ్యాపారి రితేశ్​ షా ఆ బిల్డింగ్​ నిర్మాణాన్ని మెచ్చుకున్నారు. వాస్తుకు అనుగుణంగా ఉన్నట్లు తెలిపారు. మూడు బెడ్​రూమ్​లు ఉన్న​ అపార్ట్​మెంట్ల ధర తక్కువలో తక్కువ 10.4 లక్షల డాలర్లని చెప్పారు. ట్రంప్​ వ్యాపారం గురించీ ఆయన గొప్పగా అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో రియల్​ ఎస్టేట్​కి ఒకే ఒక్క బ్రాండ్​ నేమ్​ డొనాల్డ్​ ట్రంప్​ అని, రెండో బ్రాండే లేదని తేల్చేశారు. ట్రంప్​ ఇండియాకి వస్తున్న విషయంపై మాట్లాడేందుకు మాత్రం రితేశ్​ ఒప్పుకోలేదు.