ప్రపంచ ఆధిపత్యమే ట్రంప్ లక్ష్యమా.. ఇలా అనిపించడానికి కారణాలు ఇవే..

ప్రపంచ ఆధిపత్యమే ట్రంప్ లక్ష్యమా.. ఇలా అనిపించడానికి కారణాలు ఇవే..

ప్రపంచం మీద అమెరికా ఆధిపత్యం సాధించాలి. రెండోసారి ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యాక అదే పనికి పూనుకున్నాడు. ఆయన మాటల్లో, చేతల్లో ఆ లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. ఎక్కడా కూడా అయన రాజీ ధోరణి వ్యక్తం చేయడం లేదు. తన దేశ హితమే  ముందు అనేమాట కనిపిస్తున్నది. అదే ఫోకస్ చేస్తున్నాడు. వాణిజ్యం మీద సీరియస్గా ఉన్నట్టు కనిపిస్తున్నది. ప్రధానంగా సుంకాల మీద దృష్టి కేంద్రీకరించాడు. ఒకవైపు ఉక్రెయిన్, రష్యా యుద్ధం ఆపాలని కోరుతూనే,  గాజాపై కబ్జాకు ఉపక్రమించే  పరిస్థితి చూస్తున్నాం.

దశాబ్దాలుగా భారతదేశంలో ఇతర దేశాల జోక్యం అంగీకరించని  ఇండియాకు  చైనాతో  ఉన్న వివాదం పరిష్కరిస్తామని కూడా పేర్కొన్నాడు  ట్రంప్.   గతంలో ఒబామా కాలంలో  ఇదే విషయం  ప్రస్తావనకు వస్తే,  అప్పటి పీఎం మన్మోహన్ సింగ్ సున్నితంగా తిరస్కరించారు.  ఏ దేశంతోనైనా నేరుగా చర్చించి తన సమస్యను తాను పరిష్కరించుకునే సత్తా ఇండియాకు ఉందని తెలిపారు. ఇప్పుడు  ఈ విషయంలో మన పీఎం మోదీ మౌనంగానే ఉన్నారు.

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ‘గాజా’ మీద  ఇజ్రాయెల్ యుద్ధాన్ని అక్కడి  ప్రధాని  నెతన్యాహును ఒప్పించి ఆపించానని చెప్పాడు. షరతుల ప్రకారం హమాస్ వద్ద,  అటు ఇజ్రాయెల్ వద్ద ఉన్న ఇరుపక్షాల ఖైదీలను విడతలవారీగా విడుదల చేస్తున్నారు.  ఈ నేపథ్యంలో గాజా మీద యాజమాన్య హక్కు తనకు ఉంటుందని అక్కడ సముద్రపు ఒడ్డున రిసార్టులు,  ఇతర ఏర్పాట్లు చేస్తామని, అయితే గాజాను  ఖాళీ చేయాలని   ట్రంప్​ తెలిపాడు. ట్రంప్ ప్రకటన  నెతన్యాహుకు ఆమోదమే. ఎందుకంటే గాజా నుంచి జనాన్ని ఖాళీ చేయించడమే ఆయన లక్ష్యం.  ఇక్కడ వీరిద్దరి ఉద్దేశం ఒక్కటే అని తేలిపోయింది.  

గాజాపై ట్రంప్​ నజర్​
ఈ క్రమంలో  హమాస్ తమ వద్ద ఉన్న, అఖరి ఆయుధమైన ఖైదీల విడుదల విషయంలో కొంత డిలే చేయడమేకాక యుద్ధం, దాడులు మళ్ళీ గాజా ఖాళీ చేయించే విషయంలో  నెతన్యాహు,  ట్రంప్  కలిసి దాడి చేసే అవకాశం ఉందని అప్రమత్తం అవుతున్నట్టు  కనిపిస్తోంది.  మరోవైపు తాము గాజా విడిచి ఎటు పోతామని  బాధితులు ఆందోళన చెందుతున్నారు.  ఫిబ్రవరి 15న  హమాస్ నిర్బంధంలో ఉన్న ఇజ్రాయెల్ ఖైదీలను విడుదల చేయాలని ట్రంప్ వార్నింగ్ జారీ చేశాడు.  దీంతో మళ్ళీ గాజా మీద దాడి తప్పదా అనే పరిస్థితి నెలకొన్నది.

కొన్నిచోట్ల దాడులు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే  గాజాలో పాలస్తీనీయులు వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు.  92 శాతం గృహాలు, 70 శాతం పెద్ద భవనాలు, ఆసుపత్రులు నేలమట్టం అయ్యాయి. నిరాశ్రయులు ఉండడానికి షెల్టర్ లేదు. గాజా పున:నిర్మాణానికి పదిహేను ఏండ్లకు పైగా పడుతుంది.  అయితే, యుద్ధం, బాంబుల వల్ల భూమి పనికి రాకుండా అయ్యిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో  గాజాను  కబ్జా చేసే పనిలో  అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉన్నాడు.

అయితే, తాజాగా  ట్రంప్ మాటలను చైనా ఖండిస్తూ ముమ్మాటికీ గాజా పాలస్తీనా ప్రజలదే అని పేర్కొంది. ట్రంప్ ఆలోచన  ప్రపంచ దేశాలలోని  మెజారిటీ  ప్రజలు  విమర్శిస్తున్నారు. మొత్తానికి ట్రంప్ వ్యవహారం ప్రపంచంపైన ఆధిపత్యం సాధించే దిశగా  కొనసాగుతోంది.  వాణిజ్యంలోనూ  అమెరికా  నవంబర్ వన్గా రాణించాలని తహతహలాడుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తున్నది.  ఈ నేపథ్యంలో బ్రిక్స్ దేశాలు ఏం చేస్తాయో వేచిచూడాలి.  బ్రిక్స్​లో  మన ఇండియా కూడా భాగస్వామిగా ఉండడం విశేషం.

ఎండి.మునీర్,సీనియర్ జర్నలిస్ట్