హౌతీలపై అమెరికా భీకర దాడి

హౌతీలపై అమెరికా భీకర దాడి
  • యెమెన్​పై ఎయిర్​స్ట్రైక్.. 31 మంది మృతి

న్యూయార్క్: ఇరాన్​ మద్దతున్న మిలిటెంట్​ గ్రూప్​హౌతీపై అగ్రరాజ్యం అమెరికా విరుచుకుపడింది. యెమెన్​పై శనివారం ఎయిర్ స్ట్రైక్​ చేసింది. యెమెన్‌‌ రాజధాని సనా, సదా, అల్‌‌ బైదా, రాడాలే లక్ష్యంగా భీకర దాడులకు పాల్పడింది. ఇందులో ఇప్పటి వరకూ 31 మంది మృతి చెందగా.. 101 మంది గాయపడినట్టు హౌతీ హెల్త్​ మినిస్ట్రీ తెలిపింది. మృతుల్లో మహిళలు, చిన్నారులే ఎక్కువగా ఉన్నట్టు వెల్లడించింది.  ఈ విషయాన్ని హౌతీలు కూడా ధ్రువీకరించారు. 

ఈ దాడుల్లో 18 మంది సామాన్య పౌరులు కూడా మృతిచెందారని తెలిపారు. శనివారం సాయంత్రం తమ భూభాగంలో, రాజధాని సనా, సౌదీ అరేబియా సరిహద్దుల్లోని ఉత్తర ప్రావిన్స్​ సదాలో యూఎస్​ ఎయిర్​స్ట్రైక్ చేసిందని తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున కూడా ఆ ప్రాంతాల్లో వైమానికి దాడులు జరిగినట్టు పేర్కొన్నారు. కాగా, అమెరికా నౌకలు, విమానాలపై హౌతీలు దాడి చేస్తే సహించబోమని యూఎస్‌‌ ‘సెంట్రల్‌‌ కమాండ్‌‌’ పేర్కొంది. ఇది ప్రారంభం మాత్రమేనని హెచ్చరించింది. 

దీనిపై స్పందించిన హౌతీ.. అమెరికాకు దీటుగా సమాధానమిచ్చింది. ఎయిర్​స్ట్రైక్​తమను నిరుత్సాహపరచలేవని, అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని హౌతీ మీడియా కార్యాలయ డిప్యూటీ హెడ్​ నస్రుద్దీన్​ అమేర్​ అన్నారు. ఇక, అమెరికా దాడులను హౌతీ పొలిటికల్​ బ్యూరో యుద్ధ నేరంగా అభివర్ణించింది. యెమెన్‌‌ దళాలు ప్రతిస్పందించేందుకు సిద్ధంగా ఉన్నాయని హెచ్చరించింది. 

హౌతీలు.. మీ సమయం ఆసన్నమైంది: ట్రంప్​

యెమెన్​లో హౌతీలు ఉన్న ఏరియాల్లో ఎయిర్​ స్ట్రైక్స్​చేయాలని తమ సైన్యానికి శనివారం ఆదేశాలు జారీ చేసినట్టు డొనాల్డ్​ ట్రంప్​ తెలిపారు. ‘‘హౌతీలు మీ సమయం ఆసన్నమైంది. మీ దాడులు వెంటనే ఆపేయాలి. లేకుంటే ఊహించని పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎన్నడూ చూడనంత నరకాన్ని చూపిస్తాం’’ అని ట్రూత్‌‌ వేదికగా హెచ్చరించారు. ఇరాన్​ మద్దతున్న హౌతీ మిలిటెంట్లు కీలకమైన సముద్ర కారిడార్​లో షిప్పులపై దాడులను ఆపే దాకా  భీకర దాడులు కొనసాగుతాయని చెప్పారు.