మస్క్‎ను చిన్న మాట అన్నా పీకి పడేస్తా.. మంత్రులకు ట్రంప్ స్వీట్ వార్నింగ్..!

మస్క్‎ను చిన్న మాట అన్నా పీకి పడేస్తా.. మంత్రులకు ట్రంప్ స్వీట్ వార్నింగ్..!

వాషింగ్టన్: 2024లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించడంలో టెస్లా అధినేత, బిలియనీర్ ఎలన్ మస్క్ పాత్ర కీలకం. ట్రంప్ తరుఫున ఎలన్ మస్క్ స్వయంగా పాల్గొని ప్రచారం నిర్వహించారు. అంతేకాకుండా.. ట్రంప్‎ను గెలిపించాలని తన మద్దతుదారులకు విజ్ఞప్తి చేశాడు మస్క్. వెరసీ.. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ రెండో సారి అమెరికా అధ్యక్షుడిగా ఘన విజయం సాధించారు. తన విజయంలో  క్రియాశీలక పాత్ర పోషించిన మస్క్ పట్ల ట్రంప్ అంతే విధేయత చూపిస్తున్నారు. రెండో సారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే మస్క్‎ను తన ప్రభుత్వంలోకి తీసుకున్నాడు ట్రంప్. 

అంతేకాకుండా మస్క్‎కు ఎంతో కీలకమైన డోస్ బాధ్యతలను అప్పజెప్పాడు.అనవసర ఖర్చులను తగ్గించి ప్రభుత్వంపై ఆర్ధిక భారాన్ని తగ్గించే పనిని మస్క్‎కు అప్పగించాడు. మొత్తానికి ట్రంప్ కేబినెట్‎లో ఎలన్ మస్క్ ఒక సూపర్ పవర్‎గా మారిపోయారు. మస్క్ ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్లు మారింది పరిస్థితి. ట్రంప్ నుంచి ఫ్రీ హ్యాండ్ ఉండటంతో మస్క్ కూడా దూకుడుగా ముందుకు పోతున్నారు. ఈ క్రమంలోనే మస్క్ దూకుడు, కొన్ని నిర్ణయాలు ట్రంప్ కేబినెట్‎లోని ఇతర మంత్రులకు నచ్చడం లేదని ఇంటర్నేషనల్ మీడియా కోడైకూస్తోంది. తాజాగా ఈ ప్రశ్న నేరుగా ట్రంప్‎కు ఎదురైంది.

బుధవారం (ఫిబ్రవరి 26) ట్రంప్ తన కేబినెట్ మంత్రులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఓ రిపోర్టర్.. ఎలన్ మస్క్ నిర్ణయాలు, డోజ్ పని తీరు పట్ల మీ కేబినెట్‎లోని కొందరు మంత్రులు అసంతృప్తిగా ఉన్నారనే దానిపై ట్రంప్‎ను ప్రశ్నించారు. దీనికి వెంటనే స్పందించిన ట్రంప్.. ఎలన్ మస్క్‌ను విమర్శించే ఏ క్యాబినెట్ మంత్రినైనా మంత్రి మండలి నుంచి బహిష్కరిస్తానని చమత్కరించాడు.

అలాగే.. మస్క్ పట్ల మీరు అసంతృప్తతో ఉన్నారా అని పక్కనే ఉన్న తన సహచర మంత్రులను ప్రశ్నించాడు ట్రంప్. దీనికి అలాంటిదేమి లేదని మంత్రులు ఆన్సర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. ఎలన్ మస్క్ ను ప్రశంసలతో ముంచెత్తాడు. డోజ్‎ ను ఎలన్ మస్క్ విజయవంతంగా నడిపిస్తున్నారని కితాబిచ్చాడు. మస్క్ వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం మిగిలిందన్నారు. 

తన మంత్రివర్గానికి మస్క్ పట్ల చాలా గౌరవం ఉందని ట్రంప్ పేర్కొన్నాడు. కొందరు మస్క్ నిర్ణయాలతో విభేదించొచ్చు కానీ కేబినెట్‎లోని మెజార్టీ మంత్రులు అతడి పని తీరు పట్ల సంతృప్తిగా ఉన్నారని చెప్పారు. మొత్తానికి.. మస్క్‎ను పల్లెత్తు మాట అన్నా పీకి పడేస్తానని ట్రంప్ తన మంత్రులకు స్వీట్ వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. దీంతో ఎలన్ మస్క్‎కు ట్రంప్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో మరోసారి నిరూపితమైంది.