ఇండియాలో ఎవరిని గెలిపించేందుకు యూఎస్ ఫండ్స్..? భారత్కు సాయంపై ట్రంప్ సంచలన కామెంట్స్

ఇండియాలో ఎవరిని గెలిపించేందుకు యూఎస్ ఫండ్స్..? భారత్కు సాయంపై ట్రంప్ సంచలన కామెంట్స్

యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బైడెన్ ప్రభుత్వ హయాంలో ఇండియాకు ఆర్థిక సాయంపై తీవ్రస్థాయిలో విమర్శించారు. ఇండియాలో ఎవరిని గెలిపించేందుకు 21 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం చేశారని ప్రశ్నించారు. ‘‘ఇండియాలో ఓటింగ్ శాతం పెంచేందుకు, ఓట్ల నిర్వహణకు యూఎస్ ఎయిడ్ (USAID) నిధులు వెచ్చించారు.. ఓటింగ్ శాతాన్ని ప్రభావితం చేసి ఎవరిని గెలిపించేందుకు ఆ నిధులను పంపారు’’అని బైడెన్ కు సూటి ప్రశ్న వేశారు. 

భారత ఎన్నికల ప్రక్రియలో తలదూర్చి ఎవరికి ప్రయోజనం కలిగించేందుకు బైడెన్ నిధులు వెచ్చించారని గురువారం (ఫిబ్రవరి 20) మీడియా కాన్ఫరెన్స్ లో ట్రంప్ అనటం సంచలనం రేపింది. అయితే నిన్న (బుధవారం) ఇండియాకు   యూఎస్ నిధులను నిలిపివేతపై మీడియా ప్రశ్నలకు.. ‘‘ఇండియా దగ్గర చాలా  డబ్బు ఉంది.. వారికి ఆర్థిక సాయం అక్కరలేదు’’ అని కామెంట్స్ చేసిన ట్రంప్.. ఇవాళ ఏకంగా ఇండియాలో ఎవరినో గెలిపించేందుకు.. ఎన్నికలను ప్రభావితం చేసేందుకు యూఎస్ ఆర్థిక సాయం చేసిందని చెప్పడం ఇరు దేశాల మధ్య సంచలన వార్తగా నిలిచింది. 

ఇండియాలో జరిగే ఎన్నికలకు అమెరికా ఎందుకు 21 మిలియన్ డాలర్ల డబ్బులివ్వాలి.. దీని వెనుక ఏదో ఉంది.. ఎవరినో గెలిపించేందుకు బైడెన్ ప్రభుత్వం ఈ చర్యకు పాల్పడింది. దీనిపై భారత్ ప్రభుత్వానికి సమాచారం ఇస్తా’’మని ట్రంప్ అన్నారు.

 మరోవైపు ఈ అంశంపై విచారణ జరపాల్సిందిగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే డిమాండ్ చేశాయి. ఇండియాకు గత ఏడాది ఇచ్చిన 21 మిలియన్ డాలర్ల ఫండ్ ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలోని డోజ్ (DOGE) నిలిపి వేసిన విషయం తెలిసిందే.