వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు హోరాహోరీగా సాగుతున్నాయి. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ క్యాండిడేట్ కమలా హ్యారిస్ మధ్య నెక్ టు నెక్ ఫైట్ నెలకొంది. కౌంటింగ్ ఉత్కంఠగా సాగుతోన్న వేళ డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. పెన్సిల్వేనియాలో గెలిస్తేనే నాకు నిజమైన విజయమని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పెన్సిల్వేనియా కౌంటింగ్‌లో అక్రమాలకు కుట్ర జరుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు ట్రంప్. కాగా, పెన్సిల్వేనియాలో ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే.
అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా ప్రచారం నిర్వహించిన ట్రంప్‌పై దుండగుడు కాల్పులు జరిపాడు. బుల్లెట్ ట్రంప్ చెవిని తాకుతూ వెళ్లింది. ట్రంప్ తృటిలో ప్రాణపాయం నుండి తప్పించుకున్నాడు. ఈ హత్యాయత్నం ఘటన అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ అయ్యింది. పెన్సిల్వేనియాలో దాడి ఘటనతో ట్రంప్‌పై భారీగా సానుభూతి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే తనపై హత్యాయత్నం జరిగిన పెన్సిల్వేనియాలో గెలిస్తేనే.. తనకు నిజమైన విజయమని ట్రంప్ వ్యాఖ్యానించడం హాట్ టాపిక్‌గా మారింది.
మరోవైపు.. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ విజయం దిశగా దూసుకుపోతున్నారు. ఇప్పటి వరకు వెలువడిన ట్రెండ్స్ ప్రకారం.. ట్రంప్ 17 రాష్ట్రాల్లో విజయం సాధించగా.. కమలా హ్యారిస్ 9 స్టేట్లలో గెలుపొందారు. డొనాల్డ్ ట్రంప్, కమలాహారిస్ మధ్య హోరాహోరీ ఫైట్ నెలకొంది. విజయంపై డొనాల్డ్ ట్రంప్, కమలాహారిస్ ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. ఎన్నికల ఫలితాల్లో ట్రంప్ ఆధిక్యంలో ఉండటంతో అతడి కంపెనీల షేర్లు ఒక్కసారిగా దూసుకుపోయాయి. ట్రంప్ దెబ్బకు అమెరికా స్టాక్ మార్కెట్ బుధవారం రెండు సార్లు నిలిచిపోయింది.