చూస్తూ ఊరుకోం.. బ్రిక్స్ ​దేశాలకు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్​

చూస్తూ ఊరుకోం.. బ్రిక్స్ ​దేశాలకు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్​

వాషింగ్టన్: అమెరికాకు కాబోయే ప్రెసిడెంట్ డొనాల్డ్​ ట్రంప్ బ్రిక్స్​దేశాలకు ​స్ట్రాంగ్​వార్నింగ్​ఇచ్చారు. డాలర్‎కు ప్రత్యామ్నాయంగా ఉమ్మడి కరెన్సీని రూపొందిస్తే ఆయా దేశాల దిగుమతులపై 100% ట్యాక్స్​విధిస్తామని హెచ్చరించారు. డాలర్‎కు ప్రత్యామ్నాయం తీసుకొచ్చినా, డాలర్​విలువ తగ్గించాలని ప్రయత్నించినా తాము చూస్తూ ఊరుకోబోమని అన్నారు. ఈ ఏడాది అక్టోబర్‎లో కజన్‎లో జరిగిన బ్రిక్స్​సదస్సులో ఉమ్మడి కరెన్సీపై దృష్టిపెట్టాలని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్‌ తాజా హెచ్చరికలు జారీ చేశారు.

సోషల్​మీడియా ‘ట్రుత్’ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘అమెరికా డాలర్‎కు దూరంగా ఉండాలని బ్రిక్స్​దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఇందుకోసం ఉమ్మడి కరెన్సీని రూపొందించే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే, శక్తివంతమైన అమెరికా డాలర్‎కు బదులు మరో కరెన్సీ తీసుకొస్తే ఆయా దేశాల దిగుమతులపై 100 శాతం ట్యాక్స్​విధిస్తాం. ఆయా దేశాలు (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా, ఇతర దేశాలు) అమెరికాతో వాణిజ్యాన్ని వదులుకోవాల్సి ఉంటుంది’ అని వార్నింగ్​ ఇచ్చారు. అంతర్జాతీయ వాణిజ్యంలో అమెరికా డాలర్‌ను బ్రిక్స్ దేశాలు రీప్లేస్ చేసే చాన్సేలేదని స్పష్టం చేశారు.

భారత్​స్టాండ్​ ఏంటి..?

రష్యాలోని కజన్‎లో ఈ ఏడాది అక్టోబర్‎లో బ్రిక్స్​ శిఖరాగ్ర సదస్సు జరిగింది. అంతర్జాతీయ లావాదేవీలకు డాలర్‎పై ఆధారపడడం తగ్గించాలని, ప్రత్యామ్నాయంగా ఉమ్మడి కరెన్సీ రూపొందించాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ పిలుపునిచ్చారు. ఈ కూటమిలోని దేశాలు డిజిటల్ కరెన్సీ వాడుకునేందుకు భారత్‎తో కలిసి రష్యా పనిచేస్తున్నదని తెలిపారు. అయితే, అమెరికాతో దృఢమైన వాణిజ్య బంధం ఉన్న భారత్​.. ట్రంప్​రక్షణ విధానాల పట్ల అప్రమత్తంగా ఉన్నది. ఫార్మాస్యూటికల్, ఐటీ, టెక్స్​టైల్​లాంటి కీలకమైన రంగాల్లో డాలర్‏పై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలని చూస్తున్నది. 

అదే సమయంలో డీ డాలరైజేషన్‎కు తాము వ్యతిరేకమని పేర్కొంటున్నది. అక్టోబర్‎లో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్​దీనిపై క్లారిటీ ఇచ్చారు. డీ డాలరైజేషన్​ అనేది భారత ఆర్థిక విధానంలో లేదా రాజకీయ లేదా వ్యూహాత్మక విధానాల్లో భాగం కాదని పేర్కొన్నారు. అయితే, తమ వాణిజ్య భాగస్వాములు డాలర్లు తీసుకోని సందర్భాల్లో లేదా వాణిజ్య విధానాల వల్ల సమస్యలు తలెత్తినప్పుడు పరిష్కారాలను పరిశీలిస్తామని ఆయన చెప్పారు. ఉమ్మడి కరెన్సీ వాస్తవ రూపం దాల్చేందుకు ముందు అనేక అంశాలను పరిశీలించాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.