అరిజోనాలోనూ ట్రంప్‎దే విజయం.. స్వింగ్ స్టేట్స్ క్లీన్ స్వీప్

అరిజోనాలోనూ ట్రంప్‎దే విజయం.. స్వింగ్ స్టేట్స్ క్లీన్ స్వీప్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యింది. 2024, నవంబర్ 10 ఆదివారం చివరి ఫలితం వెలువడింది. స్వింగ్ స్టేట్లలో కీలకమైన అరిజోనా రాష్ట్రం కూడా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఖాతాలో చేరింది. అరిజోనాలో 11 ఎలక్టోరల్ ఓట్లు సాధించి ట్రంప్  విజయకేతనం ఎగరేశారు. అరిజోనా విజయంతో అమెరికా అధ్యక్ష ఎన్నికలో ఎంతో కీలకమైన 7 స్వింగ్ స్టేట్లను డొనాల్డ్ ట్రంప్ క్లీన్ స్వీప్ చేశారు. 

మొత్తం ఏడు స్వింగ్ స్టేట్లు ఉండగా.. ఇప్పటికే ఆరు రాష్ట్రాల్లో ట్రంప్ విజయ ఢంకా మోగించారు. తాజాగా అరిజోనాలో గెలుపుబావుటా ఎగరేయడంతో మొత్తం ఏడు స్వింగ్ స్టేట్లు రిపబ్లికన్ పార్టీ వశమయ్యాయి. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇదే అరిజోనా రాష్ట్రంలో డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ ట్రంప్‎పై విజయం సాధించారు. ఈ సారి ఎలాగైనా అరిజోనాలో గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న ట్రంప్.. ఈ రాష్ట్రంలో ప్రచారం పెద్ద ఎత్తున నిర్వహించారు.

ఎట్టకేలకు అరిజోనా రాష్ట్రాన్ని కైవసం చేసుకుని వైట్ హౌస్‎కు వెళ్లేందుకు మార్గం మరింత సుగమమం చేసుకున్నాడు. కాగా, అమెరికాలో మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లు ఉండగా.. ట్రంప్ 312 ఓట్లు సాధించి రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఘన విజయం సాధించారు. ట్రంప్‎కు ధీటుగా పోటీనిచ్చిన డెమొక్రటిక్ అభ్యర్థిని కమలాహ్యారిస్ 226 ఎలక్టోరల్ ఓట్లకే పరిమితమై ఓటమి పాలయ్యారు. 

స్వింగ్ స్టేట్స్:

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఏడు స్వింగ్ రాష్ట్రాలు ఎంతో కీలకం. ఈ రాష్ట్రాల ఫలితాలు అమెరికా అధ్యక్షుడి ఎన్నికలో క్రియాశీలక పాత్ర పోషిస్తాయి. స్వింగ్ రాష్ట్రాల్లో మెజార్టీ స్థానాల్లో గెలుపొందిన అభ్యర్థులు దాదాపు అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించే అవకాశం ఉంటుంది. 

ఏడు రాష్ట్రాల్లో అరిజోనా స్టేట్ ఒకటి. ఇక్కడ మొత్తం 11 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. ఇక్కడ ఇమ్మిగ్రేషన్ అంశం ఎంతో కీలకం. 2020 ఎన్నికల్లో బైడెన్ గెలిచారు. 

రెండో స్టేట్ జార్జియా.. ఇక్కడ మొత్తం 16 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. 2020 ఎన్నికల్లో ట్రంప్ జోక్యం చేసుకున్నారంటూ జార్జియాలోని అడ్వొకేట్లు ఆయనపై కేసు పెట్టారు. ఇప్పటికీ ఈ కేసుకు సంబంధించిన తీర్పు వెలువడలేదు. 

మిషిగాన్ స్టేట్‎లో మొత్తం 15 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. రాష్ట్రంలో ఆటో పరిశ్రమలు ఎక్కువ. అరబ్ అమెరికన్లే ఎక్కువగా ఉంటారు. 
    
నెవడా స్టేట్‎లో 6 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. కాలిఫోర్నియా, డిస్ట్రిక్ ఆఫ్ కొలంబియా తర్వాత అత్యధిక నిరుద్యోగ రేటు నెవడాలోనే ఉంది.
    
నార్త్​ కరోలినా స్టేట్‎లో మొత్తం 16 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. స్వింగ్ స్టేట్ జాబితాలో ఈ రాష్ట్రం చేరింది. జులైలో బైడెన్ ఆధిక్యాన్ని కనబర్చారు. ఆయన తప్పుకున్నాక ట్రంప్‎కు మద్దతుదారులు పెరిగారు. 60% నల్లజాతీయులు ఉన్నారు.

పెన్సిల్వేనియా స్టేట్‎లో మొత్తం 19 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. ఈ రాష్ట్రంలోనే ట్రంప్‎పై హత్యాయత్నం జరిగింది. హారిస్, ట్రంప్ మధ్య జరిగిన ఏకైక డిబేట్ సెప్టెంబర్​10న ఇక్కడే నిర్వహించారు.

విస్కాన్సిన్ స్టేట్‎లో మొత్తం 10 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. గత రెండు అధ్యక్ష ఎన్నికల్లో ఇక్కడే అత్యధిక ఓటింగ్ శాతం నమోదైంది. 2020 ఎన్నికల్లో బైడెన్‎కు దాదాపు 21వేల ఓట్లు వచ్చాయి. 2016, 2020 ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థులకు 20వేల ఓట్ల మెజార్టీ ఇచ్చారు.