విస్కీపై టారిఫ్ ఎత్తేయకుంటే వైన్‎పై 200% సుంకమేస్తాం.. ట్రంప్‎తో పెట్టుకుంటే మాములుగా ఉండదు మరీ..!

విస్కీపై టారిఫ్ ఎత్తేయకుంటే వైన్‎పై 200%  సుంకమేస్తాం.. ట్రంప్‎తో పెట్టుకుంటే మాములుగా ఉండదు మరీ..!

న్యూయార్క్: అమెరికా నుంచి ఎగుమతి అయ్యే విస్కీపై యూరోపియన్​యూనియన్ విధించిన టారిఫ్‎లు ఎత్తేయకుంటే.. ఆ దేశాలనుంచి వచ్చే అన్ని రకాల వైన్లు, ఇతర ఆల్కహాలిక్ ఉత్పత్తులపై తాము 200%  సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ప్రపంచంలోనే అత్యంత దుర్వినియోగం చేసే ట్యాక్సింగ్, టారిఫింగ్​వ్యవస్థ ఈయూదని మండిపడ్డారు. యూఎస్​నుంచి అధికంగా ప్రయోజనం పొందుతున్నదని చెప్పారు. 

తమ దేశం నుంచి దిగుమతి చేసుకునే విస్కీపై 50 శాతం టారిఫ్​విధించిందని సోషల్​మీడియా ప్లాట్​ఫామ్​ ‘ట్రూత్’ వేదికగా వెల్లడించారు. ​‘‘ఈ టారిఫ్‎ను వెంటనే తొలగించకపోతే ఫ్రాన్స్, ఈయూ ప్రాతినిధ్యం వహిస్తున్న దేశాల నుంచి వచ్చే అన్ని వైన్లు, షాంపైన్లు, ఆల్కహాల్ ఉత్పత్తులపై అమెరికా త్వరలో 200% సుంకాన్ని విధిస్తుంది. ఇది యూఎస్‎లోని వైన్, షాంపైన్ వ్యాపారాలకు లాభదాయకంగా ఉంటుంది” అని తెలిపారు. కాగా, ఒకరోజుముందు ఉక్కు, అల్యూమినియంపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించిన  కొద్దిసేపటికే ఈయూ సైతం అగ్రరాజ్యంపై  సుంకాలను విధించింది. 

జోరుగా ‘బాయ్​కాట్ యూఎస్ఏ’ ప్రచారం.. 

అధికారంలోకి వచ్చిన నాటినుంచి డొనాల్డ్​ట్రంప్​ అన్ని దేశాలపై ఎడాపెడా టారిఫ్‎లు విధిస్తుండడంతో ఇది వాణిజ్య యుద్ధానికి దారితీస్తున్నది. కెనడా, మెక్సికో, చైనా, ఈయూసహా చాలా దేశాలపై సుంకాలతో విరుచుకుపడడంతో  ‘బాయ్​కాట్​యూఎస్​ఏ’ నినాదం ఊపందుకుంటున్నది. గత 7 రోజుల్లో ఈయూ దేశాలతోపాటు కెనడాలో గూగుల్​లో ఈ నినాదం టాప్​లో ఉన్నది. యూఎస్ఏ ప్రొడక్ట్స్​ను బాయ్​కాట్​చేయాలని ఫేస్​బుక్​ గ్రూప్స్​లు కూడా ఏర్పాటు చేశారు.

 డెన్మార్క్​కు చెందిన ఫేస్​బుక్​గ్రూప్​ 73 వేల మందితో మొదటి స్థానంలో ఉండగా.. ఆ తర్వాతి స్థానంలో లక్సెంబర్గ్​ ఉన్నది. గూగుల్​లో యూఎస్​ బాయ్​కాట్​ నినాదం మార్మోగుతున్న దేశాల్లో ఈయూ, ఫ్రాన్స్​ 3,  స్వీడన్ 4, కెనడా ఐదో స్థానంలో కొనసాగుతున్నాయి. కెనాడాలోనైతే ఎక్కడ చూసినా ‘కెనడా అమ్మాకానికి లేదు’ అనే టోపీలు దర్శనమిస్తున్నాయి. కెనాడాలోని చాలా ఫ్రావిన్స్​లలో అమెరికా లో తయారైన ఆల్కహాల్​ను తిరస్కరిస్తున్నారు.