ఆయన చుట్టూ వివాదాలే.అయినా.. ఎక్కడా తగ్గలేదు. అభిమానించేవాళ్ల కంటే వ్యతిరేకించేవాళ్లే ఎక్కువ. కానీ.. అలాంటివాళ్లను అస్సలే పట్టించుకోడు. అదే ట్రంప్ స్టయిల్. ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నాడు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా తనదైన స్టయిల్లో అమెరికాను రూల్ చేశాడు. కొందరు ప్రశంసించారు.. మరికొందరు రాళ్లు రువ్వారు. అయినా.. తను అనుకున్నదే చేశాడు. ట్రంప్‌కు ఆటుపోట్లు కొత్తేమీ కాదు. రాజకీయాలకు ముందు వ్యాపారంలోనూ డక్కాముక్కీలు తిన్నాడు. సంపదలో పుట్టి, పెరిగినా.. ఎన్నో కష్ట, నష్టాలను చూసిన ట్రంప్ లైఫ్ జర్నీ..
అమెరికా 47వ అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ జాన్ ట్రంప్ 1946 జూన్ 14న న్యూయార్క్ సిటీలోని క్వీన్స్‌లో పుట్టాడు. తండ్రి ఫ్రెడరిక్ క్రైస్ట్ ట్రంప్ సంపన్న రియల్ ఎస్టేట్ డెవలపర్. తల్లి మేరీ అన్నే మాక్లియోడ్ స్కాట్లాండ్ నుంచి అమెరికాకు వలస వచ్చింది. వాళ్లకు ఐదుగురు పిల్లలు. ట్రంప్ నాలుగోవాడు. క్రైస్ట్ పిల్లల్ని చాలా క్రమశిక్షణతో పెంచాడు. చిన్న తప్పు చేసినా సహించేవాడు కాదు. ట్రంప్ మాత్రం తుంటరి పనులు చేస్తూ చివాట్లు తినేవాడు. దాంతో ట్రంప్‌కు క్రమశిక్షణ అలవాటు చేయాలనే ఉద్దేశంతో13 ఏండ్ల వయసులో న్యూయార్క్ మిలిటరీ అకాడమీకి పంపారు. అక్కడ అతని జీవితం పూర్తిగా మారిపోయింది. బుద్ధిగా చదువుకున్నాడు. తర్వాత యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా అనుబంధంగా నడుస్తున్న వార్టన్ స్కూల్ ఆఫ్ ఫైనాన్స్ నుంచి 1968లో ఎకనామిక్స్ పట్టా అందుకున్నాడు.
రిస్క్‌లే ఇష్టం
క్రైస్ట్‌కి బిజినెస్‌లో రిస్క్ తీసుకోవడం పెద్దగా ఇష్టం ఉండదు. కానీ.. ట్రంప్ రిస్క్‌లోనే లాభాలు ఉంటాయని నమ్ముతాడు. అందుకే1971లో తన తండ్రి వ్యాపారంలో చేరిన ట్రంప్ చాలా తక్కువ టైంలోనే లాభాలు పెంచాడు. వెంటనే ‘ఎలిజబెత్ ట్రంప్ అండ్ సన్స్’గా ఉన్న కంపెనీ పేరుని ‘ట్రంప్ ఆర్గనైజేషన్’ అని మార్చేశాడు. తండ్రి దగ్గర ఒక మిలియన్ డాలర్లు అప్పుగా తీసుకుని సొంతంగా బిజినెస్ కూడా చేశాడు.
మొదట్లో మాన్హాటన్లో లగ్జరీ బిల్డింగ్స్‌ని నిర్మించాడు. న్యూయార్క్‌లో గ్రాండ్ హయత్ హోటల్, ఫిఫ్త్ అవెన్యూలో 68-అంతస్తుల ట్రంప్ టవర్‌ను డెవలప్ చేశాడు. ఈ రెండు అతని జీవితంలోనే ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్స్. వీటివల్లే ట్రంప్‌కు ‘రియల్ ఎస్టేట్ మొగల్’గా గుర్తింపు వచ్చింది. రియల్ ఎస్టేట్‌లో వచ్చిన సక్సెస్‌తో ఆగిపోకుండా వ్యాపారాన్ని మరింత విస్తరించాడు. 1980ల్లో క్యాసినో వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత అతను తీసుకొచ్చిన ట్రంప్ ప్లాజా, ట్రంప్ క్యాజిల్ వెంచర్లు నష్టాలను తెచ్చిపెట్టాయి. మిగతా కంపెనీలు కూడా చాలాసార్లు దివాలా తీశాయి. అయినా.. ట్రంప్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. రిస్క్‌లు తీసుకుంటూ మళ్లీ పుంజుకున్నాడు. ఇప్పుడు ట్రంప్‌కు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో వ్యాపారాలు ఉన్నాయి. ముఖ్యంగా అమెరికాలోని చికాగో, లాస్ వెగాస్తోపాటు టర్కీ, ఫిలిప్పీన్స్‌లో ట్రంప్ కాసినోలు, హోటళ్లు ఉన్నాయి.
మూడు పెండ్లిళ్లు.. ఐదుగురు పిల్లలు
ట్రంప్ వ్యక్తిగత జీవితం కూడా అంత సాఫీగా ఏం సాగలేదు. అతనికి మూడు పెండ్లిళ్లు జరిగాయి. చెక్ మోడల్, వ్యాపారవేత్త ఇవానా జెల్నికోవాతో1977 లో మొదటి వివాహం జరిగింది. వాళ్లకు డోనాల్డ్ జూనియర్, ఇవాంకా, ఎరిక్ ట్రంప్ పుట్టిన తర్వాత1992లో డైవర్స్ తీసుకున్నారు. 1993లో యాక్ట్రెస్ మార్లా మాపుల్స్‌ను పెండ్లి చేసుకున్నాడు. ఆమెకు కూతురు టిఫనీ ట్రంప్ పుట్టాక 1999లో విడాకులు తీసుకున్నారు. 2005లో స్లోవేనియన్ మోడల్ మెలానియాని పెండ్లి చేసుకున్నాడు. ఆమెకు 2006లో బారన్ ట్రంప్ పుట్టాడు. అతని ఐదుగురు పిల్లలు కలిసి వ్యాపారాలను నడిపిస్తున్నారు. వాళ్లంతా రాజకీయ ప్రచారంలో కూడా పాల్గొన్నారు.
బిజినెస్ మ్యాన్
వాస్తవానికి ట్రంప్ ఆస్తుల వివరాలు బయటికి పెద్దగా తెలియవు. ఈ సంవత్సరం మేలో ఫోర్బ్స్ డొనాల్డ్ ట్రంప్‌కు మొత్తం 7.5 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన ఆస్తులు ఉన్నాయని తెలిపింది. ఆయన ఆస్తుల విలువ1988లోనే బిలియన్ మార్కును దాటింది. 78 ఏళ్ల వయస్సులో ఇప్పటికీ రాజకీయాలతో పాటు బిజినెస్‌లోనూ చురుకుగా పాల్గొంటున్నాడు ట్రంప్.
లగ్జరీ ఇండ్లంటే ఇష్టం
రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పుట్టి, పెరగడంతో ట్రంప్‌కు లగ్జరీ ఇండ్లంటే ఇష్టం ఏర్పడింది. అందుకే న్యూయార్క్‌తోపాటు చాలా ప్రాంతాల్లో లగ్జరీ ఇండ్లు కట్టించుకున్నాడు. విదేశాల్లో కూడా ఆయనకు ఇండ్లు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన న్యూయార్క్‌లోని ట్రంప్ టవర్‌లో ఉంటున్నాడు. ఆ ఇల్లంటే ట్రంప్‌కు చాలా ఇష్టం. అందులోనూ ఎక్కువగా పెంట్హౌస్లోనే గడుపుతాడు.
తాతగా ఉండడం..
డొనాల్డ్ ట్రంప్‌కు తన మనవలు, మనవరాళ్లతో గడపడమంటే చాలా ఇష్టం. జీవితంలో తాతగా తన రోల్‌ని బాగా ఎంజాయ్ చేస్తాడు. ట్రంప్‌కు పది మంది మనవలు, మనవరాళ్లు ఉన్నారు. ట్రంప్ కొడుకు డొనాల్డ్ ట్రంప్ జూనియర్, అతని మాజీ భార్య వెనెస్సాకు ఐదుగురు పిల్లలు. ట్రంప్ కూతురు ఇవాంకా, ఆమె భర్త జారెబ్ కుష్నెర్కు ముగ్గురు, మరో కొడుకు ఎరిక్ ట్రంప్, అతని భార్య లారాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ట్రంప్ జూనియర్ కూతురు పదిహేడెండ్ల కై మాడిసన్ ట్రంప్ తాతకు మద్దతుగా ప్రచారంలో పాల్గొని స్పీచ్ కూడా ఇచ్చింది.
బాగా చదువుతాడు
డొనాల్డ్ ట్రంప్ తాను పుస్తకాల పురుగు అని ఎప్పుడూ చెప్పుకోలేదు. కానీ.. పుస్తకాలు బాగా చదువుతాడు. చాలామందికి ‘ది హోలీ బైబిల్’ చదవాలని రికమండ్ చేస్తుంటాడు. మిలటరీ స్ట్రాటజీ, వివాదాలు, డెసిషన్ మేకింగ్, పవర్ డైనమిక్స్, పొలిటికల్ స్ట్రాటజీ లాంటివి తెలుసుకోవాలంటే నికోలో మాకియావెల్లి రాసిన ‘ది ప్రిన్స్’, రెబెక్కా డి కోస్టా రాసిన ‘ది వాచ్మెన్ రాటిల్’, జియోఫ్ కొల్విన్ రాసిన ‘టాలెంట్ ఈజ్ ఓవర్‌రేట్’ లాంటివి చదవాలి అంటాడు.
ట్వీటింగ్ కింగ్
ట్రంప్ ట్విట్టర్లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటాడు. 2017 నుంచి 2021 వరకు అధ్యక్షుడిగా ఉన్న టైంలో కూడా ట్వీట్లు చేయడం తగ్గించలేదు. ఆ నాలుగేండ్లలో 25 వేల కంటే ఎక్కువ సార్లు ట్వీట్ చేశారు. 2015లో ట్రంప్‌ని ప్రెసిడెంట్ క్యాండిడేట్‌గా ఎంపిక చేయకముందే ట్విట్టర్లో 2.98 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు 93.6 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.
పిజ్జా క్రస్ట్ నచ్చదు
డొనాల్డ్ ట్రంప్, అతని మాజీ భార్య ఇవానా 1995లో ఒక పిజ్జా కమర్షియల్‌లో నటించారు. అందులో ట్రంప్ పిజ్జా క్రస్ట్‌ను ఆస్వాదిస్తూ తిన్నాడు. కానీ.. ట్రంప్‌కు పిజ్జా క్రస్ట్ అంటే అస్సలు ఇష్టముండదు. పిజ్జా మధ్యలో ఉండే భాగాన్నే తింటాడు. ఈ విషయాన్ని అతనే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ట్రంప్ ఎక్కువగా అమెరికన్ ఫాస్ట్ ఫుడ్‌ని ఇష్టపడతాడు. మెక్‌డొనాల్డ్స్, కేఎఫ్సీలో దొరికే ఫుడ్‌తోపాటు పిజ్జా, డైట్ కోక్ అంటే బాగా ఇష్టం. కొన్నిసార్లు రోజుకు12 డైట్కోక్లు తాగుతుంటాడు. కానీ.. ఎక్కడపడితే అక్కడ తినడం ఇష్టం ఉండదు. ముఖ్యంగా చిన్న హోటల్స్, నాన్-చైన్ రెస్టారెంట్లకు చాలా దూరంగా ఉంటాడు. అలాంటి ప్లేస్ల్లో కల్తీ ఫుడ్, క్వాలిటీ లేని ఫుడ్ ఉంటుందని, దాని వల్ల హెల్త్ పాడవుతుందనేది ఆయన అభిప్రాయం.
మస్క్ ప్లాన్
ట్రంప్ గెలుపులో టెస్లా, ఎక్స్, స్పేస్ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ పాత్ర చాలా పెద్దది. చాలా రోజుల నుంచి ట్రంప్ తరఫున మస్క్ ప్రచారం చేస్తున్నాడు. ముఖ్యంగా ట్రంప్ మీద హత్యా ప్రయత్నం తర్వాత మస్క్ ట్రంప్‌కు బాగా దగ్గరయ్యాడు. మస్క్ ప్రచారం చేసిన చాలా ప్రాంతాల్లో రిపబ్లికన్ పార్టీ గెలిచింది. మస్క్ ఇదంతా ఎందుకు చేశాడు? ట్రంప్ అధికారంలోకి వస్తే మస్క్‌కు వచ్చే లాభమేంటి? అంటే.. ట్రంప్ గెలిచిన తర్వాత మస్క్ కంపెనీల షేర్లు పెరుగుతూనే ఉన్నాయి. కానీ.. ట్రంప్‌కు మస్క్ దగ్గరవ్వడానికి ఇదొక్కటే కారణం కాదు. మాజీ అధ్యక్షుడు బైడెన్‌తో ఉన్న విభేదాలు కూడా కారణమే.
మస్క్ ఎప్పుడూ తనను తాను సగం డెమొక్రాట్, సగం రిపబ్లికన్ అని చెప్పుకునేవాడు. కానీ.. 2016లో ఎలక్షన్స్‌కి ముందు మస్క్ రిపబ్లికన్ను విమర్శించాడు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అతన్ని వ్యతిరేకించాడు. ఆ తర్వాత ఎన్నికల్లో కూడా మస్క్ జోబైడెన్‌కే సపోర్ట్ చేశాడు. కానీ.. బైడెన్ గెలిచిన తర్వాత సీన్ మారిపోయింది. మస్క్‌ని బైడెన్ పక్కనపెట్టేశాడు. దాంతో వాళ్లిద్దరి మధ్య వివాదాలు మొదలయ్యాయి. బైడెన్ విధానాలను మస్క్ వ్యతిరేకిస్తూ వచ్చాడు. దాంతో 2021లో వైట్‌హౌస్‌లో ఈవీ కంపెనీలతో జరిగిన ఒక సమ్మిట్‌కు మస్క్ కంపెనీ టెస్లాని పిలవలేదు. అదే ఏడాది స్పేస్ఎక్స్ సివిలియన్ స్పేస్ ఫ్లైట్‌ని లాంచ్ చేసి సక్సెస్ అయ్యింది. అప్పుడు బైడెన్ తప్ప అక్కడి లీడర్లంతా మస్క్‌కు అభినందనలు చెప్పారు.
ఇవి కూడా..
ట్రంప్‌తో మస్క్ ఫ్రెండ్షిప్ చేయడానికి ఇంకా చాలా కారణాలే ఉన్నాయి. టెస్లా, స్పేస్ ఎక్స్, న్యూరాలింక్తోపాటు మారో మూడు పెద్ద కంపెనీలను మస్క్ నడుపుతున్నాడు. వాటి మీద గవర్నమెంట్ ఎక్కువ ఆంక్షలు పెడితే లాభాలు తగ్గుతాయి. అలా పెట్టకుండా ఉండాలంటే ప్రెసిడెంట్‌తో మంచి సంబంధాలు ఉండాలి. అందుకే ట్రంప్ గెలుస్తాడని ఊహించిన మస్క్ అతనికి దగ్గరయ్యాడు.
గోల్ఫ్‌పై ప్రేమ
ట్రంప్‌కి గోల్ఫ్ అంటే ఇష్టం. ఖాళీ టైం దొరికితే గోల్ఫ్ కోర్స్‌కి వెళ్లిపోతాడు. రాజకీయ ప్రచారాల్లో ఉన్నప్పుడు కూడా రిలాక్స్ అవ్వడానికి గోల్ఫ్ ఆడేవాడు. అధికారిక ట్రంప్ గోల్ఫ్ వెబ్సైట్ ప్రకారం.. ట్రంప్‌కు మూడు ఖండాల్లో18 గోల్ఫ్ కోర్సులు ఉన్నాయి. వాటిలో కొన్ని అమెరికాలో మరికొన్ని స్కాట్లాండ్, ఐర్లాండ్, యూఏఈలో ఉన్నాయి.
టీవీ షోలో..
ట్రంప్ టీవీలో కూడా మెరిశాడు. 2003లో అమెరికాలో వచ్చిన రియాలిటీ షో ది అప్రెంటిస్‌కి ఆయనే నిర్మాత, హోస్ట్. ఆ షోలో ట్రంప్ రెగ్యులర్‌గా చెప్పే డైలాగ్ ‘యు ఆర్ ఫైర్డ్’ చాలా పాపులర్ అయ్యింది. ఆ షోకు జనాదరణ కూడా బాగా ఉండేది. ట్రంప్ ఒక్కో ఎపిసోడ్‌కు 3 మిలియన్ల వరకు సంపాదించాడు. ది అప్రెంటిస్‌కి 2015 వరకు ఆయన గెస్ట్‌గా వెళ్లాడు.