టారిఫ్​లపై తగ్గం .. భారత్ తగ్గిస్తేనే మేం తగ్గిస్తం: ట్రంప్

టారిఫ్​లపై తగ్గం .. భారత్ తగ్గిస్తేనే మేం తగ్గిస్తం: ట్రంప్
  • తేల్చిచెప్పిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్
  • ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం, అణు ఇంధనంపై ముందడుగు: మోదీ
  • అక్రమ వలసదారులను వెనక్కి తెస్తామని వెల్లడి
  • ఇండియాకు ఎఫ్35 ఫైటర్ జెట్లు ఇస్తామన్న ట్రంప్
  • 26/11 ఉగ్రదాడి నిందితుడు రాణా అప్పగింతకు ఓకే
  • బంగ్లాదేశ్ అంశం ఇండియాకే వదిలేస్తున్నామని ప్రకటన 

వాషింగ్టన్: భారత్ నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే వస్తువులపై టారిఫ్​ల విషయంలో వెనక్కి తగ్గబోమని యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. తమ వస్తువులపై ఇండియా టారిఫ్​లు తగ్గించుకుంటే తాము కూడా భారత్ వస్తువులపై సుంకాలు తగ్గించుకుంటామని తేల్చిచెప్పారు. గురువారం సాయంత్రం(భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున) వాషింగ్టన్​లోని వైట్​హౌస్​లో ప్రధాని నరేంద్ర మోదీ, ట్రంప్ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. టెక్నాలజీ, ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీ, ఇమిగ్రేషన్, ఎడ్యుకేషన్ తదితర రంగాల్లో సహకారంపై ఇరువురు చర్చించారు. అనంతరం ఇద్దరూ కలిసి మీడియా సమావేశంలో సంయుక్త ప్రకటన చేశారు. రక్షణ రంగంలో భారత్​కు మరింత సహకారం అందిస్తామని ట్రంప్ ప్రకటించారు. ఇందులో భాగంగా ఫిఫ్త్ జనరేషన్​కు చెందిన ప్రపంచంలోనే అధునాతన ఎఫ్35 ఫైటర్ జెట్​లను ఇండియాకు సరఫరా చేస్తామని వెల్లడించారు. ముంబై ఉగ్రదాడి కేసు నిందితుడు తహవుర్ రాణాను భారత్​కు అప్పగిస్తామని, తదుపరి దశలో మరిన్ని అప్పగింతలు కూడా ఉంటాయన్నారు. అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులను వెనక్కి తీసుకు వస్తామని మోదీ ప్రకటించారు. అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం, అణు ఇంధన రంగంలో సహకారం దిశగా కీలక ముందడుగు పడిందన్నారు. ‘‘2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని దాదాపు రెట్టింపుగా.. 500 బిలియన్ డాలర్ల మార్కుకు చేర్చాలని టార్గెట్​గా నిర్ణయించుకున్నాం” అని చెప్పారు.


భారత్ సహా అనేక దేశాలు వాణిజ్యం విషయంలో సమన్యాయం పాటించడం లేదని, అందుకే ఆయా దేశాలపై రిసిప్రోకల్ టారిఫ్​లు(పరస్పర సుంకాలు) విధానాన్ని అమలు చేస్తున్నామని ట్రంప్ వెల్లడించారు. తమ వస్తువులపై భారత్ ఎక్కువ టారిఫ్​లు వేస్తోందని, ఇది చాలా అన్యాయంగా ఉందన్నారు. అందుకే ఇండియాతో తాము రిసిప్రోకల్ టారిఫ్​ల విధానం అనుసరిస్తామని.. ఆ దేశం ఎంత టారిఫ్​లు వేస్తే తామూ అంతే టారిఫ్ లు వేస్తామన్నారు. ‘‘భారత్​తో అమెరికా100 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటును ఎదుర్కొంటోంది. ఈ అసమానతలను తగ్గించేందుకు చర్చలు కొనసాగుతాయి. సమానంగా లేని టారిఫ్​లను తగ్గించేందుకు ప్రధాని మోదీ అంగీకరించారు. మేం చమురు, గ్యాస్ ను ఇండియాకు ఎగుమతి చేయడం ద్వారా వాణిజ్య లోటును తగ్గించుకుంటాం. ఆయిల్, గ్యాస్ సరఫరాలో ఇండియాకు నెంబర్ వన్ సప్లయర్​గా మారతాం” అని ట్రంప్ తెలిపారు. కాగా, గురువారం ప్రధాని మోదీతో భేటీకి ముందే ట్రంప్ రిసిప్రోకల్ టారిఫ్ ల విధానాన్ని 
ప్రకటించారు. చర్చల తర్వాత కూడా అదే విధానం కొనసాగిస్తున్నట్టు తేల్చిచెప్పారు. 

అక్రమ వలసదారులను వెనక్కి తెస్తం.. 

అక్రమంగా అడుగుపెట్టినోళ్లకు ఆ దేశంలో ఉండే హక్కు లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఇది అన్ని దేశాలకు వర్తిస్తుందని చెప్పారు. అమెరికాలో అక్రమంగా ఉంటున్న ఇండియన్లను వెనక్కి తీసుకుంటమని వివరించారు. అమెరికాలో అక్రమంగా ఉంటున్న వాళ్లలో చాలామంది హ్యూమన్ ట్రాఫికింగ్ బాధితులని మోదీ చెప్పారు. కొంతమంది భారీ ఆశలు చూపి వారిని సరిహద్దులు దాటిస్తున్నారని అన్నారు. వాళ్లంతా పేద కుటుంబాలకు చెందిన వారేనని, మాయమాటలకు మోసపోయి అమెరికా చేరుకున్నారని చెప్పారు. వారిని వెనక్కి రప్పించడంతో ఆగకుండా హ్యూమన్ ట్రాఫికింగ్ పై ఇండియా పోరాడుతుందని వివరించారు. ఈ విషయంలో అమెరికా కూడా ఈ పోరాటంలో భాగం కావాలని, ఇండియాకు మద్దతుగా నిలవాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.

2030కల్లా 500 బిలియన్ డాలర్ల ట్రేడ్.. 

భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం విలువను 2030 నాటికల్లా రెట్టింపు చేసుకుని 500 బిలియన్ డాలర్ల మార్కును చేరుకోవాలని, ఇందుకోసం ‘మిషన్ 500’ కింద చర్యలు తీసుకోవాలని రెండు దేశాలు నిర్ణయించాయి.  ఇందులో భాగంగా బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ (బీటీఏ)కు సంబంధించి తొలి విడత చర్చలను 2025 చివరినాటికి పూర్తి చేయాలని అంగీకారానికి వచ్చాయి. అలాగే దశలవారీగా సుంకాలు తగ్గించుకుని, మార్కెట్ యాక్సెస్​ను పెంచుకోవాలని నిర్ణయించాయి. ద్వైపాక్షిక వాణిజ్యంలో సమాన న్యాయం, జాతీయ భద్రత, ఉద్యోగాల సృష్టికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించినట్టు ఈ మేరకు రెండు దేశాలు ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. 

యూఎస్ వర్సిటీలకు గ్రీన్ సిగ్నల్ 

ఉన్నత విద్యారంగంలో సహకారంపై కూడా భారత్, అమెరికా మధ్య  ఒప్పందం కుదిరింది. అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీలు, కాలేజీలు భారత్ లో క్యాంపస్ లు ఓపెన్ చేసేందుకు ప్రధాని మోదీ అంగీకారం తెలిపారు. ట్యాలెంట్ ఉన్న ఉద్యోగులు, విద్యార్థులు, రీసెర్చర్ల వలసలతో రెండు దేశాలకూ ప్రయోజనమేనని ఇరువురు నేతలు నిర్ణయించారు. అలాగే, ఓపెన్ డూర్స్ రిపోర్ట్ తాజా నివేదిక ప్రకారం.. అమెరికాలో 3 లక్షలకుపైగా ఇండియన్ స్టూడెంట్లు ఉన్నారని, వారు ఏటా 8 బిలియన్ డాలర్ల మేరకు యూఎస్ ఎకానమీకి కంట్రిబ్యూట్ చేస్తున్నారని, పెద్ద సంఖ్యలో డైరెక్ట్, ఇండైరెక్ట్ ఉద్యోగాల సృష్టికి కూడా తోడ్పడుతున్నారని రెండు దేశాలు ఉమ్మడి ప్రకటనలో తెలిపాయి.

అణు ఇంధనంపై సహకారం

భారత్, అమెరికా మధ్య పదహారేండ్ల కిందట కుదిరిన పౌర అణు ఒప్పందంపై తాజాగా ట్రంప్, మోదీ భేటీలో ముందడుగు పడింది. ఈ ఒప్పందం ప్రకారం ఇండియాలో అమెరికా న్యూక్లియర్ రియాక్టర్ల ఏర్పాటుకు ట్రంప్ అంగీకారం తెలిపారు. అణు ఇంధన రంగంలో సహకారాన్ని గణనీయంగా పెంచుకునేందుకు ఆమోదం తెలిపారు. అమెరికాలో డిజైన్ చేసిన న్యూక్లియర్ రియాక్టర్లను భారత్​లోనే తయారు చేసేందుకు, వీలైతే టెక్నాలజీ ట్రాన్స్ ఫర్​కు కూడా అంగీకారానికి వచ్చినట్టు రెండు దేశాలు ఉమ్మడి ప్రకటనలో తెలిపాయి. 

ఢిల్లీకి బయలుదేరిన ప్రధాని  

అమెరికా పర్యటన ముగించుకున్న మోదీ శుక్రవారం భారత్​కు బయలుదేరారు. నాలుగు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ముందుగా సోమవారం ఫ్రాన్స్ రాజధాని పారిస్ కు చేరుకున్న ఆయన మంగళవారం ఏఐ యాక్షన్ సమిట్ లో పాల్గొన్నారు. మాషే నగరంలో ఇండియన్ కాన్సుల్ జనరల్ ఆఫీసును ప్రారంభించారు. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల్లో అసువులు బాసిన భారత అమర జవాన్లకు నివాళులు అర్పించారు. మూడు రోజుల పర్యటన తర్వాత బుధవారం సాయంత్రం అమెరికా బయలుదేరారు. గురువారం యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్​తో ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు.

వైట్ హౌస్​లో సాదర స్వాగతం 

వైట్ హౌస్​లోని అధ్యక్ష కార్యాలయం ఓవల్ ఆఫీస్ వద్ద మీటింగ్​కు ముందు మోదీకి ట్రంప్ సాదర స్వాగతం పలికారు. షేక్ హ్యాండ్ ఇచ్చి, హగ్ చేసుకున్నారు. మోదీని చాలా మిస్ అయ్యామని, ఆయన గొప్ప ఫ్రెండ్, అద్భుతమైన వ్యక్తి అని కొనియాడారు. రెండోసారి ప్రెసిడెంట్ అయినందుకు ట్రంప్​ను మోదీ అభినందించా రు. ట్రంప్ ఫస్ట్ టర్మ్​లో రెండు దేశాల సంబంధాలు బలోపేతం అయ్యాయని, ఈసారి మరింత బాగా కలిసి పనిచేస్తామని ఆకాంక్షించారు. అమెరికా ప్రయోజనాలకే ట్రంప్ పెద్దపీట వేస్తారని, ఆయనలాగే తాను కూడా ఇండియా ప్రయోజనాలకే టాప్ ప్రయారిటీ ఇస్తానన్నారు. ఈ సందర్భంగా తాను రాసిన ‘అవర్ జర్నీ టుగెదర్’ కాఫీ టేబుల్ బుక్ ను మోదీకి ట్రంప్ గిఫ్ట్ గా ఇచ్చారు. ‘మిస్టర్ ప్రైమ్ మినిస్టర్, యూఆర్ గ్రేట్’ అని రాసి, సంతకం చేశారు.

మాగా, మైగా కలిస్తే.. మెగా పార్ట్​నర్షిప్ 

ట్రంప్ ఇచ్చిన ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్ (మాగా)’ నినాదం స్ఫూర్తితో ‘మేక్ ఇండియా గ్రేట్ అగైన్(మైగా)’ అనే కొత్త నినాదాన్ని తాను ఖరారు చేసినట్టు మోదీ ప్రకటించారు. మాగా, మైగా అనే విజన్లను కలిపితే రెండు దేశాల సుసంపన్నత దిశగా మెగా పార్ట్ నర్షిప్ అవుతుందని, భాగస్వామ్యాన్ని కొత్త ఎత్తుకు తీసుకెళ్తుందని అభివర్ణించారు. ‘‘ట్రంప్ ఇచ్చిన మాగా నినాదాన్ని అమెరికన్ ప్రజలు స్వాగతించారు. భారత ప్రజలు కూడా అభివృద్ధిని వేగవంతం చేయ డం ద్వారా ‘వికసిత్ భారత్ 2047’ సాధన కోసం ప్రయత్నిస్తున్నారు. దీనినే అమెరికా భాషలో చెప్పాలంటే.. అభివృద్ధి చెందిన భారత్ అంటే.. మేక్ ఇండియా గ్రేట్ అగైన్ (మైగా) అని అనొచ్చు. ఇండియా, యూఎస్ కలవడం ద్వారా (మాగా ప్లస్ మైగా) మెగా పార్టనర్షిప్ అవుతుంది. మన లక్ష్యాల సాధన దిశగా ఇది మెగా స్ఫూర్తిని అందిస్తుంది” అని మోదీ వివరించారు. 

చైనా విషయంలో సాయం..

చైనాతో సరిహద్దు విషయంలో నెలకొన్న సమస్యపై భారత్​కు సహాయం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని  ట్రంప్​ తెలిపారు. అయితే, దీనిని భారత్​ సున్నితంగా తిరస్కరించింది. మోదీ- ట్రంప్‌‌‌‌ సంయుక్త విలేకర్ల సమావేశంలో భాగంగా ఈ విషయం చర్చకు వచ్చింది. మొదట ట్రంప్​ మాట్లాడుతూ.. భారత సరిహద్దుల్లో ఘర్షణలు జరుగుతున్నాయని, భవిష్యత్తులోనూ ఇవి కొనసాగుతాయని అనుకుంటు న్నట్లు చెప్పారు. ఈ ఘర్షణలను ఆపేందుకు భారత్​కు అవసరమైతే సాయం చేయడానికి తాను సిద్ధమని ఆఫర్ చేశారు. భారత్ ​సరిహద్దుల్లో సుదీర్ఘకాలంగా జరుగుతున్న హింసాత్మక ఘటనలకు ముగింపు పలకాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. భారత్, చైనా, రష్యా, అమెరికా మధ్య సహకారం ఉండాలని అన్నారు. అయితే, ట్రంప్​ ప్రతిపాదనను భారత్​ తోసిపుచ్చింది. ​ట్రంప్ ​ఇచ్చిన ఆఫర్​పై భారత విదేశాంగ శాఖ సెక్రెటరీ  విక్రమ్‌‌‌‌ మిశ్రి స్పందించారు. ద్వైపాక్షిక చర్చలతోనే తాము పొరుగు దేశాలతో ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటామని సమాధానం ఇచ్చారు. మూడో పక్షానికి తాము ఆ చాన్స్​ ఇవ్వబోమని చెప్పారు.

అదానీ ఇష్యూపై చర్చించలే..  

భారతీయ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ కంపెనీ కాంట్రాక్టుల కోసం లంచాలు ఇచ్చిందంటూ గత ప్రెసిడెంట్ బైడెన్ సర్కారు చేసిన ఆరోపణలపై ప్రస్తుత ప్రెసిడెంట్ ట్రంప్​తో చర్చించలే దని మోదీ చెప్పారు. ట్రంప్​తో కలిసి నిర్వహించిన ప్రెస్ మీట్​లో అదానీ గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు మోదీ స్పందిస్తూ.. ‘‘భారత్ ఒక ప్రజాస్వామ్య దేశం. వసుధైక కుటుంబం అన్నదే మా సంస్కృతి, మా ఫిలాసఫీ. మేం ప్రపంచమంతా ఒక కుటుంబంగా భావిస్తాం. అలాగే ప్రతి ఇండియన్​నూ మా సొంత వ్యక్తులు గానే అనుకుంటాం. అదానీ ఇష్యూ వంటి వ్యక్తిగత విషయాలపై ఏ రెండు దేశాల అధినేతలూ చర్చలు జరపబోరు” అని తెలిపారు. 

తహవుర్ రాణా అప్పగింతకు ట్రంప్​ ఓకే.. 

26/11 ముంబై దాడుల్లో కీలక నిందితుడైన తహవుర్ రాణాను భారత్​కు అప్పగిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. త్వరలోనే మరికొన్ని అప్పగింతలు కూడా ఉంటాయని ఆయన తెలిపారు. ట్రంప్ నిర్ణయంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ‘‘2008లో మా దేశంలో మారణహోమానికి పాల్పడిన వ్యక్తిని మాకు అప్పగించేందుకు అంగీకరించిన ట్రంప్​కు కృతజ్ఞతలు. ఇక ఆ నేరస్తుడికి మా కోర్టులు తగిన శిక్ష విధిస్తాయి” అని మోదీ తెలిపారు. కాగా, టెర్రరిజంపై కలసికట్టుగా పోరాడాలని అమెరికా, ఇండియా నిర్ణయించాయి. ప్రపంచవ్యాప్తంగా టెర్రరిస్టుల రక్షణ స్థావరాలన్నింటినీ ధ్వంసం చేయాలని పునరుద్ఘాటించాయి. ఈ సందర్భంగా ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్తాన్ తీరును రెండు దేశాలు ఎండగట్టాయి.