
మెదక్/, సంగారెడ్డి/సిద్దిపేట, వెలుగు: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ట్రస్ట్ పాలిటిక్స్ మొదలయ్యాయి. ఆయా అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆయా పార్టీల లీడర్లు ట్రస్ట్‌లు ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పబ్లిసిటీ, పబ్లిక్ సపోర్ట్ కూడగట్టేందుకు భారీగా ఖర్చు పెడుతూ హైకమాండ్ దృష్టిలో పడాలని ప్రయత్నిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నచోటే అధికార పార్టీ లీడర్ల ట్రస్ట్ పాలిటిక్స్ ముమ్మరంగా కొనసాగుతుండటం ఆసక్తికరంగా మారింది.
నాయణఖేడ్ నియోజవర్గంలో
నారాయణఖేడ్ నియోజవర్గంలోని పెద్దశంకరంపేటకు చెందిన సెంట్రల్ ఫుడ్ కార్పోరేషన్ మాజీ డైరెక్టర్ విగ్రం శ్రీనివాస్ గౌడ్ తన తండ్రి పేరు మీద 'విగ్రం రామాగౌడ్ పీపుల్స్ వెల్ఫేర్ ట్రస్ట్' ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి మద్దతు కూడగట్టుకుంటున్నారు. పార్టీ అధిష్టానం దృష్టిలో పడే ప్రయత్నం చేస్తున్నారు.
దుబ్బాక నియోజకవర్గంలో
సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న మామిడి మోహన్ రెడ్డి 'ప్రజాహితం ఫౌండేషన్' పేరిట సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ నాయకుడు మద్దుల గాలి రెడ్డి 'ఎంజీఆర్ ట్రస్ట్ ' పేరిట వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హుస్నాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లో బీజేపీ లీడర్ జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి జేఎస్ ఆర్ టీమ్ పేరుతో పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అలాగే కర్ణకంటి మంజులా రెడ్డి కూడా వివిధ సేవా కార్యక్రమాలతో ప్రజల మధ్య ఉంటున్నారు. సిద్దిపేట సెగ్మెంట్ లో సీఎం కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల వంశీధర్ రావు తన తండ్రి పేరిట ఏర్పాటు చేసిన 'కేఆర్ఆర్ ఫౌండేషన్ ' ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
పటాన్ చెరు లో
పటాన్ చెరు సెగ్మెంట్ లో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, చిట్కుల్ సర్పంచ్ నీలం మధు మధ్య టికెట్ పోటీ కొనసాగుతోంది. అయితే ఇటీవల పటాన్ చెరు పర్యటనలో సిట్టింగ్ ఎమ్మెల్యేను మరోసారి గెలిపించాలని ప్రజలను సీఎం కేసీఆర్ కోరారు. మహిపాల్ రెడ్డికి టికెట్క్లారిటీ వచ్చినప్పటికీ సొంత పార్టీ నేతల నుంచి సవాల్ ఎదురవుతోంది. ఒకే పార్టీలో ఉంటూ ఎమ్మెల్యే గూడెంకు యాంటీగా మధు ఎన్ఎంఆర్ యువసేన పేరుతో సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఇప్పటికే నియోజకవర్గాన్ని చుట్టేశారు.
మెదక్ సెగ్మెంట్లో...
మెదక్ అసెంబ్లీ నియోజవర్గ స్థానంలో పద్మా దేవేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ మళ్లీ తనకే టికెట్ వస్తుందన్న ధీమాతో ఆమె ఉన్నారు. కాగా మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావ్ కొడుకు డాక్టర్ మైనంపల్లి రోహిత్ వచ్చే ఎన్నికల్లో మెదక్ స్థానంలో పోటీ చేసే ఉద్దేశం తో మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ పేరుతో నియోజకవర్గ వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. హన్మంతరావుకు, మంత్రి కేటీఆర్ మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. మంత్రి సపోర్ట్ తోనే తన కొడుకును రంగంలోకి దించినట్టు ప్రచారం జరుగుతోంది. రోహిత్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా పనిచేస్తూ ఎన్నికల్లో తనకే టికెట్ అంటూ ఇన్ డైరెక్ట్ గా ప్రచారం చేసుకుంటున్నారు.
సంగారెడ్డి జిల్లాలో మూడు చోట్ల..
సంగారెడ్డి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం పీఎంకే ఫౌండేషన్ పేరుతో నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. లక్షలు డొనేట్ చేస్తూ ప్రజల మధ్య తిరుగుతున్నారు. అలాగే ఇక్కడి నుంచే మరో బీఆర్ఎస్ లీడర్, ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు పులిమామిడి రాజు పీఎంఆర్ పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేసి అవసరమైన వసతులను ప్రజలకు కల్పిస్తున్నారు. ఇక్కడి నుంచే బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ విస్తృతంగా పర్యటిస్తున్నారు.