భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి: జస్టిస్ బీవీ నాగరత్న

 భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి: జస్టిస్ బీవీ నాగరత్న
  • కోర్టులకు రావడానికి ముందే సఖ్యతకు ప్రయత్నించాలని సూచన

న్యూఢిల్లీ, వెలుగు: భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవాలని, ఒకరిపై మరొకరు గౌరవం కలిగి ఉండాలని జస్టిస్ బీవీ నాగరత్న సూచించారు. భార్యాభర్తలు ఎవరు తప్పు చేసినా ఒకరి స్థానంలో  మరొకరు ఉండి ఆలోచన చేయాలన్నారు. విడాకుల కేసుల్లో కోర్టుల్లో విచారణకు ముందే భార్యాభర్తలు సఖ్యతకు ప్రయత్నించాలని అభిప్రాయపడ్డారు. ‘ఫ్యామిలీ.. ద బేసిస్ ఆఫ్ ఇండియన్ సొసైటీ’ అనే అంశంపై జరిగిన చర్చలో జస్టిస్ నాగరత్న కీలక సూచనలు చేశారు. కుటుంబ న్యాయస్థానంలో కేసు విచారణకు రాకముందే తప్పనిసరిగా మధ్యవర్తిత్వానికి ప్రయత్నించాలని  అభిప్రాయపడ్డారు. 

కోర్టులో వాదనల సందర్భంగా దంపతుల మధ్య దూరం మరింత పెరిగే ప్రమాదముందని తెలిపారు. అందుకే, ఫ్యామిలీ కోర్టుల్లో శిక్షణ పొందిన నిపుణులు, రిటైర్డ్ జడ్జిలు మధ్యవర్తులుగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. మహిళలు సామాజిక, ఆర్థిక పురోగతి సాధించడమే దాంపత్య జీవితాల విచ్ఛిన్నానికి కారణమనే అపోహ ఉందని, అది ఏ మాత్రం సరికాదని పేర్కొన్నారు. గత పదేండ్లలో జరిగిన వివాహాల్లో సుమారు 40 శాతం విడాకులకు దారి తీశాయని ఇటీవలే ఒక సర్వేలో తేలిందని గుర్తు చేశారు.