- మంత్రి కొండా సురేఖ
కాశీబుగ్గ, వెలుగు : రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను సాధించుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కొండా సురేఖ చెప్పారు. గురువారం వరంగల్‌లో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ పోరాట ఫలితంగానే కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో భాగమైన తయారీ యూనిట్‌ను కేంద్రం మంజూరు చేసిందన్నారు. కాజీపేట రైల్వేస్టేషన్‌కు డివిజన్ హోదా కల్పించేందుకు కేంద్రం కార్యాచరణ ప్రారంభించడం అభినందనీయం అన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, విభజన చట్టాల అమలుపై సీఎం రేవంత్‌రెడ్డి కేంద్రానికి రెండు సార్లు లెటర్ రాశారని గుర్తు చేశారు. కోచ్ తయారీ యూనిట్, రైల్వే డివిజన్ ఏర్పాటుతో ఉమ్మడి జిల్లాతో పాటు, రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకుపోతుందన్నారు. విభజన చట్టంలోని మిగతా హామీల అమలుకు సైతం కాంగ్రెస్ అలుపెరగని పోరాటం చేస్తుందని చెప్పారు.
Also Read : ముదిరాజ్ సంక్షేమ భవనాన్ని ప్రారంభించిన నీలం మధు ముదిరాజ్
ఓరుగల్లు ప్రజల చిరకాల స్వప్నమైన మామునూరు ఎయిర్‌పోర్ట్‌ను సాకారం చేసుకున్నామన్నారు. 2041 మాస్టర్ ప్లాన్‌లో భాగంగా వరంగల్ అభివృద్ధికి మంజూరు చేసిన రూ. 4,962.47 కోట్లతో నగర రూపురేఖలు
మారుతాయన్నారు.