- దేవాలయ గోడను సైతం కూలగొట్టి గేటు నిర్మాణం
- స్థానికుల ఆందోళనతో రంగంలోకి అధికారులు
గండిపేట, వెలుగు: రాజేంద్రనగర్ సర్కిల్ అత్తాపూర్ డివిజన్లోని రాంబాగ్ అనంత పద్మనాభస్వామి ఆలయ భూమిపై కొందరు కబ్జాదారులు కన్నేశారు. సర్వే నంబర్ 523లో ఆలయానికి 8.25 ఎకరాల భూమి ఉండగా, ఇందులోని 2 వేల గజాల స్థలాన్ని కొందరు కబ్జా చేసేందుకు యత్నించారు. దేవాలయ గోడను సైతం కూలగొట్టి గేటును నిర్మిస్తున్నారని స్థానికులు బుధవారం ఆందోళన చేపట్టారు.
దీంతో విషయం తెలుసుకున్న దేవాదాయ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని పనులను ఆపివేశారు. సర్వే నంబర్ 523 లోని భూమి పూర్తిగా దేవాలయానికి చెందిందేనని స్పష్టం చేశారు. అయితే, ఈ భూమిని తమ పూర్వీకులు కొనుగోలు చేశారని కబ్జాదారులు చెప్తున్నారు. దీంతో అత్తాపూర్ పీఎస్లో దేవాదాయ శాఖ అధికారులు ఫిర్యాదు చేశారు. ఆలయ భూమిని కాపాడాలని పూర్తి దస్తావేజులను సమర్పించారు.