
- కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని టీచర్ల సమస్యలు తనకు తెలుసునని, గెలిపిస్తే పరిష్కారానికి కృషి చేస్తానని కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య తెలిపారు. ఆదివారం హైదరాబాద్లో పలు సంఘాల టీచర్లు ఆయనను కలిసి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా కొమరయ్య మాట్లాడుతూ..
పెద్దపల్లి జిల్లాలోని బంధంపల్లిలో పుట్టిన తనకు సొంతగడ్డకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చినట్టు పేర్కొన్నారు. గతంలో ఎమ్మెల్సీలుగా గెలిచిన వారంతా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరారని విమర్శించారు. తాను మాత్రం టీచర్ల సమస్యలే ఎజెండాగా పోరాడతానన్నారు. పెండింగ్డీఏలు, బకాయిల విడుదల, పీఆర్సీ కోసం సర్కారుతో కొట్లాడతానన్నారు. టీచర్లంతా తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయం – నిజామాబాద్ ఎంపీ అరవింద్
టీచర్స్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి మల్కా కొమరయ్యకు ఓటేసి గెలిపించాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కోరారు. నిజామాబాద్ లో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సమ్మేళనం నిర్వహించారు. ఎంపీ అరవింద్ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమన్నారు.
అదేవిధంగా కరీంనగర్ జిల్లా హుజరాబాద్ టౌన్ మధువన్ ఫంక్షన్ హాల్ లో జరిగిన ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనంలో అభ్యర్థి మల్క కొమరయ్య పాల్గొన్నారు. తెలంగాణ లో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఉపాధ్యాయుల నుంచి మంచి స్పందన లభించిందని ఆయన
తెలిపారు.