ఇండియాలో ఎవరినో గెలిపించాలనుకున్నరు.. బైడెన్ హయాంలో భారత్​కు నిధులపై ట్రంప్ ఆరోపణలు

ఇండియాలో ఎవరినో గెలిపించాలనుకున్నరు.. బైడెన్ హయాంలో భారత్​కు నిధులపై ట్రంప్ ఆరోపణలు
  • ఇండియాకు నిధులు ఎందుకియ్యాలని ప్రశ్న
  • యూఎస్ ఎయిడ్ నిధులపై దర్యాప్తుకు సిద్ధమైన కేంద్రం

న్యూఢిల్లీ/వాషింగ్టన్: ఇండియాలో మరెవరినో గెలిపించేందుకు అమెరికా గత అధ్యక్షుడు బైడెన్ సర్కారు యత్నించిందని యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. భారత్ కు విదేశీ సాయం చేయడం ద్వారా ఆ దేశ ఎన్నికలపై ప్రభావం చూపేందుకు బైడెన్ సర్కారు ప్రయత్నించిందని, అందుకే భారత్ లో ఓటింగ్ శాతం పెంచేందుకు 21 మిలియన్ డాలర్లు (రూ.182 కోట్లు) ఇవ్వాలని చూసిందన్నారు.

ఇండియాలో ఓటింగ్ శాతం పెంచేందుకు తామెందుకు నిధులు ఇవ్వాలని ఆయన ప్రశ్నించారు. బుధవారం మియామీలో జరిగిన ఓ కార్యక్రమంలో ట్రంప్  మాట్లాడారు. భారత్ కు తన సర్కారు విదేశీ సాయం రద్దు చేయడాన్ని ఆయన సమర్థించుకున్నారు. ‘‘ఇండియాలో మరెవరినో గెలిపించేందుకు బైడెన్ పాలకవర్గం ప్రయత్నించింది. ఈ విషయాన్ని భారత ప్రభుత్వానికి తెలియజేశాం. ఇండియాకు 21 మిలియన్  డాలర్ల విదేశీ సాయం అవసరమే లేదు. ఎందుకంటే, వారి (భారత్) వద్ద చాలా డబ్బు ఉంది.

అంతేకాకుండా, అత్యధిక పన్నులు వసూలు చేస్తున్న ధనిక దేశాల్లో ఇండియా కూడా ఒకటి. భారత్ లో టారిఫ్​లు భారీగా ఉన్నాయి. దీంతో, మనం మన సరుకులను అక్కడికి పంపలేకపోతున్నాం. అలాంటపుడు ఇండియాకు 21 మిలియన్  డాలర్ల సాయం చేయాల్సిన​అవసరం ఉందా? భారత్ లో ఓటింగ్  శాతం పెంపు కోసం సాయం చేస్తే, ఇక్కడ (అమెరికా) ఎవరు మనకు సాయం చేస్తారు?” అని ట్రంప్  వ్యాఖ్యానించారు. కాగా.. గత నాలుగేండ్లలో భారత్ కు అమెరికా అందిస్తున్న విదేశీ సాయం తగ్గింది. ఆ నాలుగేండ్లలో పాకిస్తాన్ కు అందించిన విదేశీ సాయం 970 మిలియన్  డాలర్ల కన్నా 35% తక్కువగా ఉంది. 

యూఎస్ ఎయిడ్ నిధులపై కేంద్రం దర్యాప్తు 
భారత ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకని ఎన్జీవోలు, ఇతర సంస్థలకు యూఎస్ ఎయిడ్ సంస్థ అందజేసిన నిధులపై సమగ్ర దర్యాప్తు జరిపించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. యూఎస్ ఎయిడ్ కు, భారత్ లోని సంస్థలు, వ్యక్తులకు మధ్య జరిగిన లావాదేవీల లిస్టును ఇదివరకే ట్రంప్ సర్కారు మోదీ సర్కారుకు అందజేసింది. ఆ లిస్టులోని సంస్థలు, వ్యక్తుల లావాదేవీలపై దర్యాప్తులో అధికారులు దృష్టి సారించనున్నట్టు తెలుస్తోంది.

2024 లోక్ సభ ఎన్నికల్లో ఆయా సంస్థలు, వ్యక్తుల ద్వారా రాజ్యాంగం ప్రమాదంలో పడిందంటూ ప్రచారం చేయించి, ప్రతిపక్షాలు ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రయత్నించాయని అధికార పక్షం నేతలు వాదిస్తున్నారు. యూఎస్ ఎయిడ్ నుంచి నిధులు తీసుకుని, తమను తామే ఎందుకు ఓడించుకుంటామని కాంగ్రెస్ మీడియా సెల్ చైర్మన్ పవన్ ఖేరా ఎక్స్ లో ప్రశ్నించారు. యూఎస్ ఎయిడ్ సంస్థను 1961లో ప్రారంభించారని, అప్పటి నుంచి దశాబ్దాలపాటు జరిగిన లావాదేవీలన్నింటిపైనా కేంద్రం శ్వేతపత్రం రిలీజ్ చేయాలని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ డిమాండ్ చేశారు.