సాధారణంగా దొంగలు తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తారు. కొన్ని ఆయుధాలతో తాళం పగులకొట్టి.. ఇంట్లోకి చొరబడి అందినకాడికి దోచుకుంటారు. కాని ఒక్కోసారి తాళం తీసేటప్పుడు సౌండ్ రావడంతో ఇట్టే చిక్కుతారు. అందుకే దొంగలు చాలా జాగ్రత్తగా శబ్దం రాకుండా తాళం తీసి వాళ్ల పని వాళ్లు చేసుకొని వెళ్లిపోతారు. తాజాగా రంగారెడ్డి జిల్లాలో ఓ దొంగ తాళం వేసిన ఇంటికి దొంగతనానికి వచ్చాడు. అయితే తాళం తీయడంలో విఫలం కావడంతో ఈసురోమంటూ వెనుదిరిగాడు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.....
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపాలిటీ చటాన్ పల్లి అంగన్ వాడీ టీచర్ పద్మ దత్తాత్రేయ గుడి దగ్గరలో ఓ ఇంట్లో నివసిస్తోంది. ఆమె భర్త విక్రమ్‌కు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ట్రీట్ మెంట్‌కు జనవరి 26 వ తేది (ఆదివారం) హైదరాబాద్ ఆస్పత్రికి వెళ్లారు. తిరిగి సోమవారం (జనవరి 27) రాత్రి వచ్చేసరికి తాళం వంకరగా.. పగులగొట్టినట్లు.. విరిగి ఉంది. ఆందోళనగా ఇంట్లోకి వెళ్లి చూడగా ఎలాంటి వస్తువలు గాని... డబ్బులు కాని పోలేదు.
ALSO READ | గతంలో కూల్చినా మళ్లీ అక్రమ నిర్మాణాలు.. కుత్బుల్లాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు
అప్పుడు సీసీ కెమారలను పరిశీలించగా దొంగ తాళాన్ని పగులకొట్టేందుకు నానా తంటాలు పడినట్లు రికార్డ్ అయింది. ఎంత ప్రయత్నించినా తాళం రాకపోయేసరికి విసుగుతో వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దొంగలు పడిన ప్రాంతంలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు.