గులాబీ బాట పట్టిన 9 మంది ఎమ్మెల్యేలు
మరో నలుగురు చేజారే చాన్స్
ప్రధాన ప్రతిపక్ష హోదా గల్లంతే!
టీఆర్ఎస్ ఎల్పీలో సీఎల్పీ విలీనమేనా?
బీజేపీలో చేరిన డీకే అరుణ, సోయం బాపూరావు
త్వరలో మరికొంత మంది కీలక నేతలు
పాలమూరు, నల్గొండ, మెదక్ నుంచి వలసలు!
లోక్ సభ ఎన్నికల వేళ రాష్ట్రంలో కాంగ్రెస్ కు దెబ్బ మీద దెబ్బ
ఇటు కారెక్కుతున్న ఎమ్మెల్యేలు.. అటు కమలంవైపు కీలక నేతలు
“పక్కాగా అధికారంలోకి వస్తాం .. రాష్ట్రం దశ మారుస్తాం” మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ల నుంచి జూనియర్ల దాకా అందరూ చెప్పిన మాటలివి. ఫలితాలు వచ్చేసరికి అధికారం కాదు కదా.. అంతకు ముందున్నన్ని సీట్లు కూడా ఆ పార్టీ రాబట్టుకోలేకపోయింది. మహామహులమనుకునే నాయకులు కూడా కారు జోరుకు కంగుతిన్నారు. 19 మంది మాత్రమే గెలిచారు. వాళ్లయినా పార్టీలో ఉంటారా అనుకుంటే.. ఒకరి తర్వాత ఒకరు కారెక్కుతున్నట్లు ప్రకటించేస్తున్నారు. ఇలా వరుసగా బుధవారం వరకు తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యే లు అధికార పార్టీ టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు తేల్చేశారు. ఇదే బాటలో నడిచేందుకు మరో నలుగురు ఎమ్మెల్యేలు కూడా సిద్ధంగా ఉన్నారు. రేపో మాపో వాళ్లు కూడా ప్రకటన చేసే అవకాశం ఉంది.
ఎమ్మెల్యే ల మాట అటుంచితే కీలక నేతలైనా మిగులుతారా అనుకుంటే.. ఆ పరిస్థితీ కనిపించడం లేదు. వారిలో చాలా మంది కమలం వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎమ్మెల్యే సోయం బాపూరావు బీజేపీలో చేరిపోయారు. మహబూబ్ నగర్, నల్గొండ, మెదక్ జిల్లాల కాంగ్రెస్ కీలక నేతలు కాషాయదళంలో చేరేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
ప్రతిపక్ష హోదా గల్లంతేనా?
లోక్ సభ ఎన్నికల వేళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఇలా షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. మూడింట రెండొంతుల కాంగ్రెస్ ఎమ్మెల్యే లు (13 మంది) తాము టీఆర్ ఎస్ ఎల్పీలో విలీనం కావాలని తీర్మానించుకుంటే సీఎల్పీ అడ్రస్ గల్లంతయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే కారెక్కుతామని ప్రకటించిన ఎమ్మెల్యేలు(9 మంది) అధికారికంగా టీఆర్ఎస్ లో చేరితే.. కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా కూడా కోల్పోనుంది. ఇప్పటివరకు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ను వీడుతున్నట్లు ప్రకటించారు. వీరికి తోడు మరో నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జత కూడి తీర్మానించుకుంటే.. కాంగ్రెస్ శాసనసభ పక్షం(సీఎల్పీ) అడ్రస్ గల్లంతవుతుంది.
ఏదైనా పార్టీకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా దక్కా లంటే మొత్తం సీట్లలో పది శాతం సభ్యుల బలం ఉండాలి. దీని ప్రకారం మన రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాకు 12 స్థా నాలు అవసరమవుతాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 19 స్థానాలు గెలుచుకొని ప్రతిపక్ష హోదా దక్కించుకుంది. ఆ పార్టీ మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు. కాగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కాంగ్రెస్ కు చెందిన ఆదివాసీ ఎమ్మెల్యేలు రేగాకాంతారావు (పినపాక), ఆత్రం సక్కు (ఆసిఫాబాద్ ) తాము టీఆర్ ఎస్ లోకి వెళ్తున్నట్లు ప్రకటించారు. తర్వాత వరుసగా చిరుమర్తి లింగయ్య (నకిరేకల్ ), హరిప్రియ నాయక్ (ఇల్లెందు), సబితా ఇంద్రారెడ్డి (మహేశ్వరం), ఉపేందర్ రెడ్డి (పాలేరు), వనమా వెంకటేశ్వర్‌రావు (కొత్తగూడెం) పార్టీ వీడుతున్నట్లు తెలిపారు.
తాజాగా బుధవారం కొల్లా పూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి కూడా అదే బాటలో పయనిస్తున్నట్లు వెల్లడించారు. దీంతో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదాకు సరిపడా సభ్యుల సంఖ్య(12) లేకుండా పోయింది. దాని బలం పదికి పడిపోయింది. అయితే వీరంతా అధికారికంగా టీఆర్ ఎస్ కండువా కప్పుకుంటే కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా ఉండదు. అధికారికంగా చేరని పక్షంలో అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులుగా కొనసాగుతారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్‌కు సాంకేతికంగా మాత్రమే ప్రతిపక్ష హోదా ఉంటుంది.
2014లో ఏం జరిగింది?
2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ 15 స్థా నాల్లో గెలిచింది. అందులో 12 మంది వివిధ సందర్భాల్లో టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. నాడు టీడీఎల్పీ నేతగా ఉన్న ఎర్రబెల్లి తాము టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం కావాలని నిర్ణయించుకున్నట్లు స్పీకర్‌కు లేఖ ఇచ్చారు. సాంకేతికంగా ఎన్ని అభ్యంతరాలు, చర్చలు జరిగినా.. వారిని విలీనమైన ఎమ్మెల్యేలుగానే భావించారు. ఈ పార్టీలో అంతిమంగా ముగ్గురు మాత్రం మిగిలిపోయారు.
ఇటీవల శాసన మండలిలో ఇదే పునరావృతమైంది. ఇందులో కాంగ్రెస్ కు ఆరుగురు సభ్యులుండగా నలుగురు ఎమ్మెల్సీలు ఆకుల లలిత, సంతోష్ కుమార్, ఎం ఎస్ ప్రభాకర్, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కలిసి మండలి చైర్మన్ స్వామి గౌడ్ కు లేఖ ఇచ్చారు. తాము టీఆర్ఎస్ ఎల్పీలో విలీనమవుతున్నట్లు అందులో పేర్కొన్నారు. దీంతో వెంటనే దీనికి ఆమోదం లభించింది. ఈ పరిణామాలతో ఇప్పుడు మండలిలో కాంగ్రెస్ఎల్పీ కనుమరుగైంది. ఈ రెండు ఘటనలు ఇప్పుడు మళ్లీ అసెంబ్లీలో పునరావృతమవుతాయనే చర్చ సాగుతోంది.