ఒక్కరోజే 4 వేల మంది దవాఖాన్లలో చేరిన్రు

ఒక్కరోజే 4 వేల మంది దవాఖాన్లలో చేరిన్రు
  • 27 వేలు దాటిన కరోనా ఐపీ కేసులు
  • రోజు రోజుకూ పెరుగుతున్న ఇన్‌‌పేషెంట్ల సంఖ్య
  • తగ్గుతున్నాయంటున్న సర్కార్
  • మరో 51 మంది మృతి.. 6,361 కేసులు

హైదరాబాద్, వెలుగు: రాష్ర్టంలో సర్కార్ చెప్పే కరోనా లెక్కలు, వాస్తవ పరిస్థితికి పూర్తి భిన్నంగా ఉంటున్నాయి. హెల్త్ డిపార్ట్‌‌మెంట్ ఇచ్చే బులెటిన్‌‌లో కేసుల సంఖ్య రోజు రోజుకూ తగ్గుతుండగా, ప్రభుత్వ,ప్రైవేట్ హాస్పిటళ్లలో కరోనా పేషెంట్ల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. బుధవారం ఒక్కరోజే 4 వేల మందికిపైగా కరోనా పేషెంట్లు దవాఖాన్లలో చేరారు. స్టేట్ హెల్త్ డిపార్ట్‌‌మెంట్‌‌ వెబ్‌‌సైట్‌‌లోని బెడ్ల డ్యాష్‌‌ బోర్డు లెక్కలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. మంగళవారం సాయంత్రం ఆరు గంటల సమయానికి ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటళ్లలో 23,146 మంది పేషెంట్లు ఉంటే, బుధవారం అదే సమయానికి పేషెంట్ల సంఖ్య 27,404కు పెరిగింది. ఇందులో 8,040 మంది వెంటిలేటర్లపై ఉంటే, 13,531 మంది ఆక్సిజన్‌‌ సపోర్ట్‌‌పై ట్రీట్‌‌మెంట్‌‌ తీసుకుంటున్నట్టు డ్యాష్‌‌బోర్డులో పేర్కొన్నారు. ఇంకో 5,833 మంది మోడరేట్ సింప్టమ్స్‌‌తో నార్మల్ బెడ్లపై చికిత్స పొందుతున్నారు.
డెత్స్ ఆగట్లే..
రాష్ర్టంలో కరోనా మరణాలు ఆగట్లేదు. సోమవారం 59 మంది మరణించగా, మంగళవారం మరో 51 మంది చనిపోయినట్టు హెల్త్ డిపార్ట్‌‌మెంట్ ప్రకటించింది. వీరితో కలిపి కరోనా మృతుల సంఖ్య 2,527కు చేరుకుంది. దాదాపు 10 రోజులుగా యాభైకిపైగా మరణాలు నమోదవుతున్నాయి. మంగళవారం 77,435 మందికి టెస్టులు చేయగా 6361 మందికి పాజిటివ్ వచ్చింది. ఇందులో గ్రేటర్ హైదరాబాద్‌‌లో 1,225, జిల్లాల్లో 5,136 కేసులు నమోదయ్యాయి. రాష్ర్టంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 4,69,722కు చేరుకుంది. ఇందులో 3,89,722 మంది కోలుకున్నారని, 77,704  మంది యాక్టివ్ పేషెంట్లు ఉన్నారని పేర్కొంది. తాజాగా 8,126 మంది కోలుకున్నారని ప్రకటించింది.