హైదరాబాద్, వెలుగు: ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ, ఎంఈడీ తదితర పీజీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన సీపీగెట్లో 94.57 శాతం మంది క్వాలిఫై అయ్యారు. మొత్తం 73 వేల మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 61,246 మంది అర్హత సాధించారు. శుక్రవారం హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫీసులో టీజీసీహెచ్ఈ చైర్మన్ లింబాద్రి సీపీగెట్ రిజల్ట్స్ రిలీజ్ చేశారు. 8 యూనివర్సిటీల్లో 45 పీజీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం జులై 6 నుంచి16 వరకు ప్రతి రోజూ మూడు సెషన్లలో పరీక్షలను నిర్వహించారు. మొత్తం 64,765 మంది పరీక్షలకు అటెండ్ కాగా, వారిలో 61,246 మంది క్వాలిఫై అయ్యారు. అత్యధికంగా ఎంఎస్సీ కెమిస్ర్టీలో 4,221 , ఎంకామ్లో 4,892 మంది, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ లో 4,285 మంది, ఎంఎస్సీ జువాలజీలో 4,161 మంది, ఎంఏ ఇంగ్లిష్ లో 3,503 మంది, ఎంఏ తెలుగులో 3,090 మంది క్వాలిఫై అయ్యారు.
అందుబాటులో 42,192 సీట్లు
పీజీ కోర్సుల్లో ఓయూ, కేయూ, తెలంగాణ, శాతవాహన, మహాత్మాగాంధీ, పాలమూరు, జేఎన్టీయూహెచ్ తో పాటు తెలంగాణ మహిళా వర్సిటీలో మొత్తం 42,192 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో సర్కారు కాలేజీల్లో5,443 సీట్లుండగా, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల్లో 6,167 సీట్లున్నాయి. ప్రైవేటు కాలేజీల్లో 30,582 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ నెల 12 నుంచి అడ్మిషన్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని సీపీగెట్ కన్వీనర్ పాండు రంగారెడ్డి తెలిపారు. 12 నుంచి 21 వరకు రిజిస్ర్టేషన్లతో పాటు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఉంటుందన్నారు. ఈ నెల 27 నుంచి 30 వరకు వెబ్ ఆప్షన్లు, సెప్టెంబర్ 4న సీట్లను అలాట్ చేయనున్నట్టు వెల్లడించారు. సీట్లు పొందిన విద్యార్థులు సెప్టెంబర్ 9లోగా రిపోర్టు చేయాలని సూచించారు.