విద్యాశాఖ వెబ్ సైట్​లో డీఎస్సీ హాల్ టికెట్లు

విద్యాశాఖ వెబ్ సైట్​లో డీఎస్సీ హాల్ టికెట్లు
  • ఈ నెల 18 నుంచి పరీక్షలు
  • పరీక్షకు 15 నిమిషాల ముందే గేట్లు క్లోజ్

హైదరాబాద్,వెలుగు: ఈ నెల 18 నుంచి ప్రారంభమయ్యే డీఎస్సీ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను విద్యాశాఖ అధికారులు వెబ్ సైట్​లో పెట్టారు. గతంలో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం గురువారం రాత్రి స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్ సైట్​ https://schooledu.telangana.gov.in/ISMS లో హాల్ టికెట్లను అభ్యర్థులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. అభ్యర్థులు తమ పేమెంట్ రిఫరెన్స్ ఐడీ లేదా ఆధార్ నంబర్ వివరాల ఆధారంగా హాల్ టికెట్లు తీసుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.

కాగా, ఈనెల 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు సబ్జెక్టులు, మీడియం వారిగా డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి. 11,062 టీచర్ పోస్టుల భర్తీకి 2.79 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షలు ప్రతిరోజూ రెండు షిప్టుల్లో నిర్వహించనున్నట్టు అధికారులు ప్రకటించారు. ఉదయం 9 గంటల నుంచి11.30 గంటల వరకు ఫస్ట్ షిఫ్ట్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకూ సెకండ్ షిఫ్ట్ లో ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు.

అయితే, అభ్యర్థులకు బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకుంటున్న నేపథ్యంలో నిర్ణీత సమయానికి కనీసం గంటన్నర ముందే పరీక్షా హాల్ లోకి అనుమతించనున్నారు. నిర్ణీత సమయానికి 15 నిమిషాల ముందే గేట్లు మూసివేస్తామని, అభ్యర్థులు ముందుగానే సెంటర్లకు రావాలని అధికారులు సూచించారు.