- అగ్రికల్చర్ అండ్ ఫార్మసీలో 89.66 శాతం
- ఈ సారి కూడా ఏపీ విద్యార్థులే టాపర్లు
- ఎప్ సెట్ ఫలితాలు రిలీజ్ చేసిన బుర్రా వెంకటేశం, లింబాద్రి
- వారంలో అడ్మిషన్ షెడ్యూల్ రిలీజ్ చేస్తామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు : టీఎస్ ఎప్ సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంజినీరింగ్ స్ర్టీమ్ లో 74.98 శాతం మంది క్వాలిఫై కాగా.. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ర్టీమ్ లో 89.66 శాతం మంది అర్హత సాధించారు. ఎప్ సెట్ ఫలితాల్లో అమ్మాయిలు మరోసారి సత్తా చాటారు. శనివారం జేఎన్టీయూహెచ్ లో విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, జేఎన్టీయూ వీసీ కట్టా నర్సింహారెడ్డి.. ఎప్ సెట్ ఫలితాలను విడుదల చేశారు.
రాష్ట్రంలో ఈ నెల 7 నుంచి 11 వరకు ఆన్ లైన్ లో టీఎస్ ఎప్ సెట్ పరీక్షలు జరిగాయి. దీంట్లో ఇంజినీరింగ్ స్ర్టీమ్ లో 2,54,750 మంది రిజిస్టర్ చేసుకుంటే 2,40,618 మంది పరీక్ష రాశారు. వారిలో 1,80,424 (74.98 శాతం) మంది క్వాలిఫై అయ్యారు. అందులో అమ్మాయిలు 97,902 మంది పరీక్ష రాయగా.. 74,262 (75.85 శాతం) మంది, అబ్బాయిలు 1,42,716 మందికి 1,06,162 (74.38 శాతం) మంది అర్హత సాధించారు. అలాగే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ర్టీమ్ లో 91,633 మంది పరీక్ష రాయగా 82,163 (89.66 శాతం) మంది క్వాలిఫై అయ్యారు. అందులో అమ్మాయిలు 66,969 మంది పరీక్షకు హాజరుకాగా.. 60,395 (90.18 శాతం), అబ్బాయిలు 24,664 మంది రాయగా.. 21,768 (88.25 శాతం) మంది అర్హత సాధించారు. ఈ సందర్భంగా లింబాద్రి మాట్లాడుతూ.. వారంలోపే ఎప్ సెట్ ఫలితాలు విడుదల చేశామన్నారు. గతేడాది వరకూ ప్రతి పూట 24 వేల నుంచి 27 వేల వరకే ఆన్ లైన్ ఎగ్జామ్స్ రాసే పరిస్థితి ఉండేదని, ఈసారి మాత్రం రోజూ 50 వేల మంది వరకూ ఒకసెషన్ లో రాసేలా సామర్థ్యం పెంచామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కౌన్సిల్ వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ వెంకటరమణ, ఎస్కే మహమూద్, సెక్రటరీ శ్రీరామ్ వెంకటేశ్, ఎప్ సెట్ కన్వీనర్ దీన్ కుమార్, కోకన్వీనర్ విజయ కుమార్ రెడ్డి, రిజిస్ట్రార్ వెంకటేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.
టాపర్లు ఏపీ వాళ్లే..
నిరుటి మాదిరిగా ఈసారి కూడా ఎప్ సెట్ లో రెండు స్ర్టీముల్లోనూ ఏపీ స్టూడెంట్లే టాపర్లుగా నిలిచారు. ఇంజినీరింగ్ స్ర్టీమ్ లో సతివాడ జ్యోతిరాదిత్య (శ్రీకాకుళం) టాపర్ గా నిలిచారు. మొత్తం టాప్ టెన్ ర్యాంకుల్లో ఏపీ, తెలంగాణ విద్యార్థులు చెరో ఐదు ర్యాంకులు పొందారు. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ర్టీమ్ లో ఆలూర్ ప్రణీత (మదనపల్లి) టాపర్ గా నిలిచింది. దీంట్లోనూ పది ర్యాంకుల్లో తెలంగాణకు చెందిన ఐదుగురు, ఏపీకి చెందిన ఐదుగురు విద్యార్థులు ఉన్నారు.
వారంలో అడ్మిషన్ షెడ్యూల్: బుర్రా వెంకటేశం
వారంలోనే అడ్మిషన్ షెడ్యూల్ ఇస్తామని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం తెలిపారు. ఏపీలో ఇప్పుడు పరీక్షలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. ఈ ఏడాది కూడా ఏపీ, తెలంగాణకు కంబైండ్ అడ్మిషన్లు ఉంటాయన్నారు. ఇంజినీరింగ్ బీ కేటగిరి సీట్లను నీట్ సీట్ల మాదిరిగా ఆన్ లైన్ లో కౌన్సెలింగ్ ద్వారా నిర్వహిచేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పారు. నిబంధనల ప్రకారమే మేనేజ్మెంట్లు సీట్లను నింపాలని ఆదేశించారు. ప్రైవేటు యూనివర్సిటీల్లోనూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిరుడు గుర్తింపు రాకముందే అడ్మిషన్లు తీసుకున్న గురునానక్, శ్రీనిధి విద్యా సంస్థలపై నెలరోజుల్లో చర్యలు తీసుకుంటామన్నారు.
ఎప్ సెట్ ఇంజినీరింగ్ టాపర్లు
ఫస్ట్ ర్యాంక్ : - సతివాడ జ్యోతిరాదిత్య (శ్రీకాకుళం, ఏపీ)
రెండో ర్యాంక్: -గొల్ల లేఖహర్ష (కర్నూల్, ఏపీ)
మూడో ర్యాంక్ : రిషిశేఖర్ శుక్లా (సికింద్రాబాద్, తెలంగాణ)
అగ్రి కల్చర్ అండ్ ఫార్మసీ స్ర్టీమ్
ఫస్ట్ ర్యాంక్ -: ఆలూర్ ప్రణీత (మదనపల్లి, ఏపీ)
రెండో ర్యాంక్ : నాగుడసారి రాధాకృష్ణ (విజయనగరం, ఏపీ)
మూడో ర్యాంక్- : గడ్డం శ్రీవర్షిణి (వరంగల్, తెలంగాణ)