హైదరాబాద్, వెలుగు: ఈఏపీసెట్ (బైపీసీ) ఫస్ట్ ఫేజ్ సీట్ల అలాట్ మెంట్ ప్రక్రియ ముగిసింది. బీ ఫార్మసీ, ఫార్మాడీ తదితర కోర్సుల్లో 10,854 సీట్లు ఉండగా, వాటి కోసం16,145 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. వీరిలో 10,436 మంది కి సీట్లు అలాట్ చేసినట్టు టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన తెలిపారు. మొత్తం 54 కాలేజీ ల్లో వంద శాతం సీట్లు నిండాయి.
బీఫార్మసీలో 127 కాలేజీల్లో 8,845 సీట్లకు 8,453 సీట్లు నిండగా, ఫార్మా డీలో 74 కాలేజీల్లో 1,678 సీట్లకు 1,627 సీట్లు విద్యార్థులకు అలాట్ చేశారు. 2 కాలేజీల్లో ఉన్న 58 బయోమెడికల్ ఇంజినీరింగ్ సీట్లన్నీ నిండాయి. ఫార్మాసూటికల్ ఇంజినీరింగ్ కోర్సులో 122 సీట్లుండ గా 117 సీట్లు, బయోటెక్నాలజీ కోర్సు 4 కాలేజీల్లో 181 సీట్లు ఉండగా..181 సీట్లు నిండాయి. సీట్లు అలాట్ అయిన విద్యార్థులు ఈ నెల 30లోగా ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయాలని సూచించారు.