వచ్చే నెలలో పరీక్షల షెడ్యూల్ రిలీజ్ 

వచ్చే నెలలో పరీక్షల షెడ్యూల్ రిలీజ్ 
  • కసరత్తు చేస్తున్న హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ 
  • జేఈఈ షెడ్యూల్​కు తగ్గట్టుగా ఎంసెట్ తేదీలు

హైదరాబాద్, వెలుగు : వివిధ కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించే ప్రవేశ పరీక్షలపై హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ దృష్టి పెట్టింది. ఇప్పుడిప్పుడే కరోనా ప్రభావం నుంచి కోలుకుని విద్యా సంస్థలు గాడిన పడుతున్న నేపథ్యంలో, ఈసారి సరైన టైమ్​కే ఎంట్రెన్స్ ఎగ్జామ్స్  నిర్వహించాలని భావిస్తోంది. దాదాపు అన్ని ప్రవేశ పరీక్షలు మే, జూన్ నెలల్లో  నిర్వహించాలని యోచిస్తోంది. దీనికి అనుగుణంగా కౌన్సిల్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో 2023–24 విద్యా సంవత్సరంలో వివిధ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే ఎంసెట్, ఈసెట్, ఐసెట్,ఎడ్ సెట్, లాసెట్, పీఈసెట్, పీజీఈసెట్ తదితర ప్రవేశ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లను అధికారులు మొదలుపెట్టారు. ఇప్పటికే ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ తో పాటు జేఈఈ షెడ్యూల్ రిలీజ్ కావడంతో కీలకమైన ఎంసెట్ పరీక్ష నిర్వహణకు లైన్ క్లియర్ అయినట్టే. ఈసారి ఎంసెట్ మార్కుల వెయిటేజీ కూడా లేకపోవడంతో రిజల్ట్ కోసం కూడా వేచిచూసే పరిస్థితి లేదు. త్వరలోనే హయ్యర్ ఎడ్యుకేషన్ అధికారులు యూనివర్సిటీ వీసీలతో సమావేశమై, ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ నిర్వహణపై చర్చించనున్నారు. ప్రస్తుతం పీఈసెట్ ను ఎడ్ సెట్​లో కలపాలని ఆలోచిస్తున్నారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ కు ప్రొఫెసర్ల కొరత ఉండడం, తక్కువ మంది పాల్గొంటుండటంతో, ఇక నుంచి ఎడ్ సెట్ ద్వారానే బీపీఈడీ, డీపీఈడీ అడ్మిషన్లు చేయాలని యోచిస్తున్నారు. ప్రస్తుతం ఓయూ, కేయూ, జేఎన్టీయూ, మహాత్మా గాంధీ వర్సిటీలు ప్రవేశపరీక్షలు నిర్వహిస్తున్నాయి. పీఈసెట్ ను రద్దు చేస్తే, మూడు వర్సిటీలే ఎంట్రెన్స్​లు నిర్వహిస్తాయి. ప్రస్తుతం ఒకటి, రెండు సెట్లకు కన్వీనర్లనూ మార్చే ఆలోచనలో కౌన్సిల్ అధికారులు ఉన్నారు. దీని కోసం ఈ నెలాఖరులోగా అన్ని యూనివర్సిటీలకు ఉన్నత విద్యా మండలి లేఖలు రాయనున్నది. కన్వీనర్ల నియామకం కోసం మూడు పేర్లను వీసీల నుంచి ప్రపోజల్స్ సేకరించి, దాంట్లోంచి ఒకర్ని కన్వీనర్ గా ప్రకటించనున్నది.

మే నెలలో ఎంసెట్, ఈసెట్

జనవరిలో జేఈఈ మెయిన్ ఫస్ట్ సెషన్, ఏప్రిల్ ఫస్ట్ వీక్​లో సెకండ్ సెషన్ పరీక్షలుంటాయని ఎన్టీఏ ప్రకటించింది. జూన్ 4 నుంచి అడ్వాన్స్ డ్ ఎగ్జామ్ ఉంటుందని ఐఐటీ గౌహతి వెల్లడించింది. ఇంటర్ మెయిన్ ఎగ్జామ్స్ మార్చి నెలాఖరులోనే ముగియనున్నాయి. దీంతో మే రెండో వారం లేదా మూడో వారంలో ఎంసెట్ నిర్వహించాలని యోచిస్తున్నారు. ఈసెట్ మే ఫస్ట్ వీక్​లో పెట్టాలని భావిస్తున్నారు. మిగిలిన అన్ని సెట్లు కూడా జాతీయ పరీక్షతో పాటు, డిగ్రీ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని, మే–జూన్ నెలల్లో నిర్వహించనున్నారు. వీటికి సంబంధించిన షెడ్యూల్ ను జనవరిలోనే రిలీజ్ చేయనున్నారు. నోటిఫికేషన్లు మాత్రం ఫిబ్రవరి, మార్చి నెలల్లో విడుదల చేసే అవకాశముంది. పాలిసెట్ ఎగ్జామ్ మే నెలలో నిర్వహించనున్నారు.