ఆర్టిజన్ కార్మికుల అరెస్ట్.. కేసీఆర్ హామీ ఏమైందని ప్రశ్న

ఏప్రిల్ 25న తేదీన ఉదయం 8 గంటలకు ఆర్టిజన్ కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లాలో విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులను ముందస్తుగా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. డ్యూటీలో ఉన్న వాళ్ళని సైతం అరెస్టు చేశారు పోలీసులు. ఈ మేరకు పోలీసుల అత్యుత్సాహంపై విద్యుత్ శాఖ కార్మికులు మండిపడుతున్నారు. 

హామీ ఏమైంది..

2017 జులై 29న కార్మికులను రెగ్యులర్ చేస్తున్నట్లు అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించారని విద్యుత్ కార్మికులు గుర్తు చేశారు. రెగ్యులర్ చేయకుండా ఆర్టిజన్ కార్మికులుగానే గుర్తిస్తూ వీరికోసం ప్రత్యేకమైన సర్వీస్ రూల్స్ ను ప్రభుత్వం తీసుకొచ్చిందని తెలిపారు. విద్యుత్ శాఖలో ఉన్న రెగ్యులర్ ఎంప్లాయిస్ కు ఉన్న సర్వీస్ రూల్స్ నే తమకు కేటాయించాలంటూ.. గత కొంతకాలంగా ఆర్టిజన్ కార్మికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా పట్టించుకోవడం లేదు.  దీంతో సమ్మెకు వెళ్తున్నట్టు ఆర్టిజన్ కార్మిక సంఘ నాయకులు ముందస్తు నోటీసులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ శాఖలో 22,600 మంది ఆర్టిజన్ కార్మికులుగా పనిచేస్తున్నారు. నల్గొండ జిల్లాలో 2వేలకు పైచిలుకు మంది ఆర్టిజన్ కార్మికులు పనిచేస్తున్నారు.

ఆర్టిజన్ కార్మికుల ప్రధాన డిమాండ్లు..

  • ఆర్టిజన్ కార్మికులకు ఎక్సిస్టింగ్ సర్వీస్ రూల్స్ (APSEB) అమలు చేయాలి.
  • ఆర్టిజన్ కార్మికులకు విద్యా అర్హతలను బట్టి కన్వెన్షన్ ఇవ్వాలి.
  • ఆర్టిజన్ కార్మికులకు 50% పీఆర్ సీ అమలు చేయాలి.
  • నూతనంగా నియమించబడిన ఉద్యోగులకు 35% పీఆర్ సీ అమలు చేయాలి
  • GENCO, TRANSCO, SPDCL, NPDCL లో ఐడి కార్డు కలిగి ఉన్న కార్మికులందరిని ఆర్టిజన్ గా గుర్తించాలి.
  • NPDCLలో పనిచేస్తున్న అన్మెన్ కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించాలి. 

ఇతర సమస్యల సాధన కోసం సమ్మె చేపట్టామని ఆర్టిజన్లు డిమాండ్లలో తెలిపారు.