కరీంనగర్: ఎమ్మెల్యేల కొనుగోలు విషయంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి వాస్తవాలను బయట పెట్టాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట రెడ్డి డిమాండ్ చేశారు. మునుగోడు ఉప ఎన్నికకు హుజూరాబాద్ ఫలితంతో పోలిక లేదని ఆయన స్పష్టం చేశారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన చాడ వెంకట్ రెడ్డి బీజేపీని ఓడించేందుకే మునుగోడులో టీఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్నామని పునరుద్ఘాటించారు. రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగత స్వార్థంతోనే మునుగొడులో ఉప ఎన్నిక జరుగుతోందన్నారు.
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్యం ప్రజా వ్యతిరేక విధానాలను ఆవలంబిస్తోందని చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు. వికలాంగుడైన ప్రొఫెసర్ సాయిబాబాను కుట్ర పూరితంగా విడుదల కాకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. మోడీ ప్రభుత్యం 13 రాష్ట్రాల్లో ప్రభుత్యాలను కూల్చివేసిందని చాడ వెంకట్ రెడ్డి విమర్శించారు.