ఏకగ్రీవ​ పంచాయతీలకు జాడలేని నజరానా..జిల్లాలో 120 జీపీ పాలకుల ఎదురుచూపులు

నిజామాబాద్, వెలుగు: ఏకగ్రీవ పంచాయతీలకు సర్కారు ఇస్తామన్న రూ .10 లక్షల  ప్రోత్సాహకం నేటికీ అందలేదు. మరో 7 నెలల్లో ప్రస్తుత సర్పంచుల పదవీకాలం ముగియనుండగా, ఎక్కడా నజరానా ఊసు వినిపించడం లేదు. జిల్లాలో యునానిమస్​గా ఎన్నికైన 120 పంచాయతీలకు అందాల్సిన రూ.12 కోట్ల సొమ్ము కోసం సర్పంచులు ఎదురుచూస్తున్నారు.

గిరిజన జీపీలే అధికం..  

జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసిన 140 పంచాయతీలతో కలిపి మొత్తం 530 జీపీలకు 2019, జనవరి 22 న ఎలక్షన్​పెట్టారు. వీటిలో 120 పంచాయతీలకు పాలకులు యునానిమస్​గా ఎంపికయ్యారు. కొత్త జీపీలుగా ఏర్పడిన వాటిలో గిరిజన తండాలు ఎక్కువగా ఉన్నాయి. వీటికి ఇన్​కమ్​సోర్స్​పెద్దగా ఉండదు. ఏకగ్రీవ నజరానాతో అందే నగదుతో అభివృద్ధి పనులు చేసుకోవచ్చని భావించిన అనేక తండాలు పాలకులను యునానిమస్​గా ఎన్నుకున్నారు.

సొమ్ము పెంచి దాటవేత..

2019 ఎలక్షన్లకు ముందు మైనర్​ ఏకగ్రీవ  పంచాయతీలకు రూ.5 లక్షలు, మేజర్​ జీపీలకు రూ.8 లక్షల నజరానా ఉండేది.  దీన్ని రూ.10 లక్షలకు పెంచారు. కానీ నిధులు విడుదల చేసేందుకు దాటవేత ధోరణి అవలంబిస్తున్నారు. 2024, ఫిబ్రవరితో పదవీకాలం ముగుస్తుందని, ఇంకా ఎప్పడిస్తారంటూ పల్లెపాలకులు ప్రశ్నిస్తున్నారు.

జీవో రాలే: జయసుధ, డీపీవో

ఏకగ్రీవ ఎన్నిక జరిగిన జీపీలకు రూ.10 లక్షల నజరానా ఇస్తామని గవర్నమెంట్​ ప్రకటించింది. కానీ ఇందుకు సంబంధించిన జీవో రాలేదు.  ఏకగ్రీవ నజరానా ఇవ్వాలని సంబంధిత సర్పంచులు ప్రశ్నిస్తున్నారు. కానీ మా చేతుల్లో ఏం లేదు.

నజరానా వెంటనే రిలీజ్​ చేయాలి

యునానిమస్​జీపీలకు గవర్నమెంట్​ఇస్తానన్న రూ.10 లక్షల నజరానా ఇప్పటివరకు ఇవ్వలేదు. ఇప్పటికే చాలా లేట్​ అయింది, ఇంకా ఆలస్యం చేయొద్దు. ఆ డబ్బులేవో ఇస్తే గ్రామాభివృద్ధికి సహాయపడుతుంది.

  –గంగారాం నాయక్​, సర్పంచ్, ధర్మారం తండా