- రూ. 5,694 కోట్లు కేటాయింపు
- గతేడాదితో పోలిస్తే రూ. 1,681 కోట్ల కోత
- ఈఎన్‌టీ పరీక్షలు, హెల్త్ ప్రొఫైల్ ప్రస్తావనే లేదు.. కేసీఆర్ కిట్కూ కటింగ్స్
హైదరాబాద్, వెలుగు: ప్రజారోగ్య పద్దులో రాష్ట్ర ప్రభుత్వం భారీగా కోత పెట్టింది. 2018–19 బడ్జెట్‌లో వైద్యారోగ్యశాఖకు రూ.7,375.20 కోట్లు కేటాయించిన సర్కార్.. ఇప్పుడు దాన్ని రూ.5,694.17 కోట్లకు కుదించింది. అంటే ఈసారి రూ. 1,681 కోట్లు కోత పడింది. నిర్వహణ పద్దు కింద రూ. 3705.36 కోట్లు.. ప్రగతి పద్దు కింద రూ. 1988.81 కోట్లు కేటాయించారు. గత ఏడాది మెడికల్ ఎడ్యుకేషన్‌కు రూ. 1,472 కోట్లు కేటాయిస్తే, ఇప్పుడు కేవలం రూ. 214 కోట్లతో సరిపెట్టారు. ఫలితంగా కొత్తగా ఏర్పాటైన నల్గొండ, సూర్యాపేట మెడికల్ కాలేజీల భవన నిర్మాణాలు, ఇతర అభివృద్ధి పనులకు బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో 5 కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని గతంలో హామీ ఇచ్చిన ప్రభుత్వం.. బడ్జెట్‌లో మాత్రం ఆ ప్రస్తావన తీసుకురాలేదు. ఈఎన్‌టీ పరీక్షలు, స్టేట్ హెల్త్ ప్రొఫైల్ తయారు చేయడానికి ఈ బడ్జెట్‌లో అసలు ప్రతిపాదనలే చేయలేదు.
‘కిట్’కూ కట్
‘కేసీఆర్ కిట్’ పథకానికి కూడా కేటాయింపుల్లో కోత పెట్టారు. గత బడ్జెట్ రూ. 561.5 కోట్లు కేటాయిస్తే.. ఇప్పుడు రూ. 357 కోట్లతో సరిపెట్టారు. నిధులు లేక 10 నెలలుగా ఈ పథకానికి సంబంధించిన ప్రోత్సాహక నగదు బాలింతలకు అందడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు బడ్జెట్‌లో కోతలు పెట్టడంతో పథకాన్ని సమర్థంగా నడపడం కష్టమేనని అధికారులు అంటున్నారు. 104 సర్వీస్‌కు గత బడ్జెట్‌లో రూ. 33 కోట్లివ్వగా.. ఈసారి రూ. 15 కోట్లకు కుదించారు. ఈ 15 కోట్లతో కొత్త వాహనాల కొనుగోలు లేనట్టేనని అధికారులు చెబుతున్నారు. గర్భిణులు, బాలింతలను తరలించే 102 సర్వీస్‌కు కేవలం రూ. 3 కోట్లే ఇచ్చారు. ప్రభుత్వ దవాఖాన్లలో ప్రసవాలు రెండింతలైన నేపథ్యంలో కొత్త మాతా, శిశు కేంద్రాల ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదనలు పంపగా.. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. 108, 104 వాహనాల కొనుగోలుకు సైతం నిధులివ్వలేదు.
మెడిసిన్స్కూ కత్తెర
విష జ్వరాలతో ప్రజలు అల్లాడుతున్నా.. ఎపిడమిక్ కంట్రోల్ (సీజనల్ వ్యాధుల నివారణ) స్కీమ్‌కు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రూపాయి కూడా ఇవ్వలేదు. మెడిసిన్స్ కొనుగోలు పద్దుకూ భారీగా కోత పెట్టింది. గతేడాది రూ.332 కోట్లు కేటాయిస్తే.. ఈసారి రూ.226 కోట్లే ఇచ్చింది. అయితే, ఆరోగ్యశ్రీ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్‌కు గతేడాది రూ.900 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. ఈసారి రూ.1,336 కోట్లు కేటాయించడం గమనార్హం. మొత్తంగా ప్రజారోగ్యానికి సంబంధించి ఈసారి కొత్త పథకాలుగానీ, ఆస్పత్రుల ఏర్పాటుగానీ లేనట్టేనని బడ్జెట్ స్పష్టం చేస్తోంది.
వీటికి అసలు బడ్జెట్టే ఇవ్వలే
- కేంద్ర, జిల్లా ఆఫీసుల నిర్మాణం/అప్‌గ్రెడేషన్
- ఎపిడమిక్ కంట్రోల్
- ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అప్‌గ్రెడేషన్
- రోగ నిర్ధారణ పరికరాల (డయాగ్నస్టిక్స్) కొనుగోలు
- మెడికల్ కాలేజీలు, హాస్పిటల్ భవనాల నిర్మాణం
- రిమ్స్ మెడికల్ కాలేజీ
- లైఫ్ సేవింగ్స్ మెడిసిన్ కొనుగోలు
- బోధనాస్పత్రుల్లో ఎక్విప్‌మెంట్ మెయింటెనెన్స్
- మెడికల్ కాలేజీల రీసెర్చ్ ఫండ్
- 108,104 వాహనాల కొనుగోళ్లు