రాష్ట్రంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ పేషెంట్ల సంఖ్య పెరిగిపోతోంది. వేలాది కేసులు నమోదవుతున్నా.. టెస్టుల సంఖ్యను పెంచకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం మాటల గారడీ చేస్తోంది. వైరస్‌ను కంట్రోల్ చేయడానికి పటిష్ట చర్యలు తీసుకోవడం లేదు. ఒకవైపు భగభగ మండుతున్న ఎండలు.. మరోవైపు విజృంభిస్తున్న కరోనా వైరస్‌తో రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. దీనికి ప్రధాన కారణం కేసీఆర్ ప్రభుత్వ నిర్లక్ష్యమే. దేశవ్యాప్తంగా కరోనాను కంట్రోల్ చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ కృషి చేస్తుంటే.. సీఎం కేసీఆర్ మాత్రం అందుకు సహకరించడం లేదు. దీంతో కరోనా ఆస్పత్రుల్లో వసతులు లేక డాక్టర్లు, సిబ్బంది ఇబ్బందులకు గురవుతున్నారు. కరోనా టెస్టులు సరిగ్గా చేయకుండా ప్రజల ప్రాణాలతో కేసీఆర్ చెలగాటమాడుతున్నారు. కరోనా కట్టడిలో డాక్టర్లకు కనీస సదుపాయాలు కల్పించడంలో, టీకా ఉత్సవ్‌ను నిర్వహించడంలో రాష్ట్ర సర్కార్ ఘోరంగా విఫలమైంది.
తొలి దశలో లక్ష మందికి కరోనా సోకినా ట్రీట్మెంట్ అందించేందుకు విస్తృత ఏర్పాట్లు చేశామని, రూ.వెయ్యి కోట్లు ఖర్చు పెడతామని ప్రగల్భాలు పలికిన కేసీఆర్ రెండో దశలో పూర్తిగా చేతులెత్తేశారు. కరోనా అనుమానితులు శాంపిల్ ఇవ్వడానికే ఒకట్రెండు రోజులు పడుతోంది. ఇక టెస్ట్ రిజల్ట్ రావడానికి నాలుగైదు రోజుల టైమ్ తీసుకుంటున్నారు. టెస్ట్ రిజల్ట్స్ వచ్చేలోపే వారి కుటుంబ సభ్యులు మహమ్మారి బారిన పడుతున్నారు. ఇంట్లో ఒకరికి వైరస్ వస్తే అందరికీ క్షణాల్లో వ్యాపిస్తోంది. దీంతో పరిస్థితి విషమించి ఆస్పత్రుల్లో చేరిన రెండు మూడు రోజులకే కొంత మంది చనిపోతున్నారు. అయినా హాస్పిటల్స్‌లో కనీస సౌకర్యాలు కల్పించలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఏమాత్రం నిర్లక్ష్యం వ్యవహరించినా, అప్రమత్తంగా లేకపోయినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది.
గాంధీలో ఇప్పటికీ సరైన సౌలతులు లేవు
ఇప్పటికే కరోనా రోగులతో నిండిన గాంధీని పూర్తిస్థాయి కరోనా ఆస్పత్రిగా మళ్లీ ప్రకటించారు. ఏడాది కాలంగా ఎన్ని విమర్శలు వచ్చినా అక్కడ సదుపాయాలను కల్పించిన దాఖలాలు లేవు. గాంధీ ఆస్పత్రిలో ప్రతి 10 నిమిషాలకు ఒక కరోనా పేషెంట్ చేరుతున్నారు. దీంతో అక్కడ మిగతా అత్యవసర సేవలన్నీ నిలిపేశారు. పరిస్థితి ఇంత సీరియస్‌గా ఉన్నా మిగిలిన ప్రభుత్వ హాస్పిటల్స్ లో కరోనా సేవలు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేయడం లేదు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో కరోనా టెస్టులు చేస్తున్నారు. తెలంగాణలో కనీసం వేల స్థాయిలో కూడా టెస్టులు చేయడం లేదు. కేసీఆర్ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో రాష్ట్రంలో మరణాల రేటు రోజురోజుకూ పెరుగుతోంది. మరోవైపు కరోనా ట్రీట్మెంట్ విషయానికి వస్తే పేదలు, మధ్యతరగతికి అందనంత భారీ ప్యాకేజీలతో ప్రైవేట్ ఆస్పత్రులు బెంబేలెత్తిస్తున్నాయి. ప్రైవేట్ లో ట్రీట్మెంట్ కోసం సామాన్యులు తిరిగి తిరిగి వేసారిపోతున్నారు. సాధారణ ట్రీట్మెంట్లకు కూడా బెడ్స్ దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. ఇదే కొనసాగితే రానున్న రోజుల్లో పరిస్థితి చేయిదాటి పోయే అవకాశం ఉంది.
హెల్త్ డిపార్ట్మెంట్లో పోస్టులన్నీ భర్తీ చేయాలె
టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటిస్తున్న హెల్త్ బులెటిన్లలో పారదర్శకత లోపించింది. కరోనాపై రోజువారీ రివ్యూలు కరువయ్యాయి. క్లబ్‌లు, పబ్బులు, బార్లు, మాల్స్, సినిమా థియేటర్లు, స్వయంగా సీఎం బహిరంగ సభలకు అనుమతులు ఇస్తుంటే ఇక కరోనా కట్టడి ఎలా చేస్తారు? పబ్బులు, లిక్కర్ షాపులపై చర్యలు ఏమయ్యాయి? కరోనా పరిస్థితులకు సంబంధించి టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం పట్ల హైకోర్టు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ప్రజల ప్రాణాలు గాల్లో తేలాడుతుంటే ఇంకెప్పుడు చర్యలు తీసుకుంటారు? డాక్టర్లు, నర్సులు, సిబ్బంది నియామకాలు చేపట్టకుండా బెడ్స్ పెంచితే ఏం ప్రయోజనం. రానున్న రోజుల్లో కరోనా కేసులు వేల సంఖ్యలో పెరిగే అవకాశం ఉన్నందున ముందు చూపుతో వైద్య శాఖలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను త్వరితగతిన భర్తీ చేయాలి.
కేంద్రం పెంచినా.. రాష్ట్రం పెంచలె
ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం వైద్య, ఆరోగ్య శాఖకు 147 శాతం నిధులు పెంచింది. కరోనా కట్టడికే రూ.35 వేల కోట్లు కేటాయించింది. కరోనా పేషెంట్లకు లిక్విడ్ ఆక్సిజన్ కొరత పెరుగుతుండడంతో అత్యవసర ప్రాంతాలకు ఆక్సిజన్ సప్లై కోసం ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ ట్రైన్లను ఏర్పాటు చేసింది. అభివృద్ధి చెందుతున్న దేశంగా మనదేశం సొంతంగా రెండు కరోనా వ్యాక్సిన్లను అభివృద్ధి చేసుకోగలిగింది. పీఎం కేర్స్ ఫండ్స్ కింద ఇప్పటి వరకు 32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 162 ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. అలాగే లక్ష ఆక్సిజన్ సిలిండర్లను సేకరించి వాటిని వివిధ రాష్ట్రాలకు పంపిణీ చేసింది. అయినా తమ వైఫల్యాలను కేంద్రంపై నెట్టి తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రాష్ట్రం మాత్రం బడ్జెట్ లో గత ఏడాది కంటే హెల్త్‌కు కేటాయింపులు తగ్గించింది. కరోనా కట్టడికి ప్రత్యేక నిధులు లేవు.
టెస్టులు, ట్రాకింగ్ పెంచితేనే మరణాలు తగ్గుతయ్
టెస్టింగ్, ట్రాకింగ్, ట్రీట్మెంట్ కు మించిన ప్రత్యామ్నాయం లేదు. త్వరగా టెస్టు చేయడం, సరిగ్గా ట్రాక్ చేయడం ద్వారానే మరణాల సంఖ్య తగ్గించే అవకాశం ఉంది. కరోనా మొదటి దశను దేశం కలిసికట్టుగా జయించింది. ఇప్పుడు సెకండ్ వేవ్‌లో కూడా మరింత కోఆర్డినేషన్‌తో ముందుకెళ్లి మరోసారి విజయం సాధించే దిశగా ప్రయత్నం చేయాలి. ప్రతి ఆస్పత్రిలో డిమాండ్ కు తగ్గట్టుగా వెంటిలేటర్లు అందుబాటులో ఉండేలా, వెంటిలేటర్ల వాడకంపై రియల్ టైం పర్యవేక్షణ ఉండేలా, ప్రజల ఇబ్బందులను పరిష్కరించి సరైన ట్రీట్మెంట్ అందించడానికి లోకల్ అధికారులు చర్యలు తీసుకోవాలి. యాంటీ వైరల్ మందుల సప్లై, వినియోగం మెడికల్ గైడ్ లైన్స్ ప్రకారమే జరిగేలా చూడాలి. వాక్సినేషన్ విషయంలో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించకుండా త్వరగా మేలుకుంటేనే సమాజానికి మేలు చేసినవాళ్లమవుతాం. మాస్కు పెట్టుకోవడం, ఫిజికల్ డిస్టెన్స్ పాటించడం వంటి వాటిపై ప్రజలకు అధికారులు, ప్రజా ప్రతినిధులు అవగాహన కల్పించాలి. కరోనా కట్టడి చేసేందుకు ఎలాంటి అపోహలు, భయాలు లేకుండా ప్రతి ఒక్కరూ టీకా వేసుకునేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. కరోనా రెండో దశ విజృంభిస్తున్న సమయంలో రాజకీయాలకు తావు లేకుండా రాజ ధర్మాన్ని పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
రాష్ట్రాన్ని కరోనా హబ్‌గా మార్చిన్రు
తెలంగాణను కరోనా హబ్ గా మార్చి.. కేసీఆర్ మాత్రం తన ఫామ్ హౌస్ లో తీరిగ్గా విశ్రాంతి తీసుకుంటున్నారు. రెండో దశలో కూడా కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చకుండా మీనమేషాలు లెక్కిస్తూ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ ను తెలంగాణలో అమలు చేస్తా అని చెప్పి.. చేయకపోవడంతో ఇక్కడి పేద ప్రజలకు తీరని అన్యాయం జరుగుతోంది. ఒకప్పుడు కేంద్రం నుంచి వచ్చే ఒక్క పైసాను రాష్ట్ర ప్రభుత్వం వదులుకోదన్నారు కేసీఆర్. కానీ ఏటా సుమారు రూ.250 కోట్ల మేర ఆయుష్మాన్ భారత్ నిధులను రాష్ట్రం కోల్పోవలసి వస్తోంది. అత్యవసర పరిస్థితుల దృష్ట్యా ఆయుష్మాన్ భారత్ పరిధిలోకి కరోనాను వెంటనే తీసుకురావాలి.
అప్పు తెచ్చిన పైసలు ఏమైనయ్
టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది. అప్పులు చేయడాన్ని కేసీఆర్ చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్రం అప్పులు రూ.63 వేల కోట్లు ఉంటే.. ఇప్పుడు అవి సుమారు రూ.4 లక్షల కోట్లకు పెరిగాయి. ఇవే కాక మిషన్ భగీరథ, విద్యుత్ రంగం, సాగునీటి ప్రాజెక్టులు మొదలైన వాటికి చేసిన అప్పులు ఎన్ని ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వమే ప్రజలకు తెలియజేయాలి. ధనిక రాష్ట్రంలో తీసుకువచ్చిన లక్షల కోట్ల అప్పులు ఎటు పోయాయి. కరోనా విజృంభిస్తున్నా, జనం ప్రాణాలు పోతున్నా నివారణ కోసం ఏ మాత్రం నిధులు ఖర్చు పెట్టకుండా కేసీఆర్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ఖజానాలో నిధులు ఏమైనట్లు? తెలంగాణ ధనిక రాష్ట్రమని ఒకసారి.. తెలంగాణను అమెరికా అయ్యను చేస్తానని మరోసారి ప్రజలను మభ్యపెడుతూ కరోనా కాలంలో ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అరెస్టులు, కేసులతో అణిచివేస్తున్నారు. కేసీఆర్ నియంతృత్వం నానాటికీ పెరిగిపోతోంది. - డాక్టర్ కె.లక్ష్మణ్, నేషనల్ ప్రెసిడెంట్, బీజేపీ ఓబీసీ మోర్చా.