మోసపోయిన గొల్ల కురుమలు

మోసపోయిన గొల్ల కురుమలు

గొర్రెల పంపిణీ పథకాన్ని పరిశీలిస్తే రెండేండ్లలో రాష్ట్రంలోని 7.30లక్షల మంది గొల్ల కురుమలకు గొర్రెలు పంపిణీ చేస్తామని లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఈ ఆరేండ్లలో కేవలం 3.98లక్షల మందికి మాత్రమే గొర్రెలిచ్చి చేతులు దులుపుకున్నారు. పంచిన గొర్ల ద్వారా ‘గొల్ల కురుమలకు పేరు బదునాం’ తప్ప లాభపడ్డది మాత్రం మధ్య దళారులే. మునుగోడు ఉప ఎన్నికకు ముందు ఆ నియోజకవర్గంలోని 7,600 మంది గొల్ల కురుమల అక్కౌంట్లను నగదు బదిలీ చేశారు. దీంతో నమ్మిన గొల్ల కురుమలు అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థికే పట్టం కట్టారు. కానీ ప్రభుత్వం మాత్రం నగదు బదిలీ చేసినట్టే చేసి, లబ్ధిదారుల అకౌంట్లను ఫ్రీజ్ చేసి, ఇప్పటికీ అక్కడ గొర్రెలు ఇవ్వకుండా, నగదు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తుంది. ప్రతి గ్రామంలో సగం మందికి గొర్రెలు పంపిణీ చేసి మరో సగం మందికి గొర్రెలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల సహజంగానే వ్యతిరేకత పెరుగుతుంది.


గొర్రెలు ఇస్తామని ప్రభుత్వ పెద్దలు ప్రకటించడంతో ఇప్పటికే 88,000 మంది తమ వాటాధనం క్రింద డి.డి.లు తీశారు. ఒక్కొక్కరు రూ.43,750 చొప్పున, సుమారు 385 కోట్ల రూపాయలను ప్రభుత్వ ఖజానాలో చెల్లించి ఏడాది కాలంగా వేచిచూస్తున్నారు. కనీసం డి.డి.లు చెల్లించిన లబ్ధిదారులందరికి పంపిణీ చేయాలంటే 15వందల కోట్లు అవసరం. నిధులు లేని కారణంగా నియోజకవర్గాల వారీగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఫైనల్ చేసిన సొంత పార్టీ కార్యకర్తలకు కొంతమందికి ఇచ్చినట్టు ఇచ్చి సాగదీశారు. నిన్న మొన్నటివరకు అందరికీ ఖచ్చితంగా గొర్రెలు పంపిణీ చేస్తామని చెప్పిన ప్రభుత్వానికి ఇటీవల దాతు చల్లబడినట్టు కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం కేంద్రంలో బీజేపీ అధీనంలో ఉన్న ఎన్సీడీసీ రుణం ఇవ్వనని చేతులెత్తేసింది. ఎన్సీడీసీ అప్పు మీదనే ఆధారపడ్డ ప్రభుత్వం ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో కుడితిలో పడ్డ ఎలుకలా కొట్టుమిట్టాడుతుంది. నిధుల లేమితో పథకం ముందుకు సాగించడం ఎలా అని తలనొప్పిగా మారిన తరుణంలోనే ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో అధికార పార్టీకి భయం పుట్టుకుంది. మరోవైపు తమ పరిస్థితి ఏంటని గొల్లకురుమలు కూడా ఆవేదన చెందుతున్నారు. గొర్రెలు ఇవ్వడం సంగతి దేవుడెరుగు కాని డి.డి.ల రూపంలో తాము చెల్లించిన డబ్బులైనా తిరిగి వస్తాయా? రావా? అని ఆందోళన పడుతున్నారు.

కులాల ఓట్లే నష్టం చేసేలా..

అన్ని కులాలకు పెట్టిన పథకాలు ఇదే విధంగా ఉన్నాయి. ఆయా సామాజిక వర్గాల నుండి నిరసనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. కులాల వారీగా పథకాలు పెడుతున్న ప్రభుత్వానికి ఇప్పుడు ఆ కులాల ఓట్లే నష్టం చేసేలా ఉన్నాయి. రాష్ట్రంలో గొల్లకురుమలు 30 లక్షలకుపైగా జనాభా కలిగి ఉన్నారు. ఈ సామాజిక వర్గాలలో నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ ఉన్నారు. అభ్యర్థుల ప్రకటనలో తమ జనాభాకు తగినన్ని టిక్కెట్లు ఇవ్వలేదని అసంతృప్తితో ఉన్నారు. ఉద్యమకాలం నుంచి కేసీఆర్​కు నమ్మిన సామాజిక వర్గం గొల్ల కురుమలు. గతంలో జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికలలో 90శాతం గొల్లకురుమలు బీఆర్ఎస్​కు ఓట్లేసి ఆ పార్టీ గెలుపునకు దోహదపడ్డారు. ఎన్నికలు ఉన్నప్పుడు హడావిడి చేస్తూ సమీక్షలు చేస్తూ, అధికారులను ఉరుకలు పెడుతూ, మిగతా సమయంలో నిర్లక్ష్యం చేస్తున్నారనే విమర్శలు ఇప్పటికే మూటగట్టుకున్నారు. గొల్లకురుమల విషయంలో కూడా ఇదే నిర్లక్ష్యం చేసి నమ్మించి మోసం చేశారు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో  కేసీఆర్ మరోసారి నమ్మించగలరా? లేదా గెలిపించినవారి చేతనే ఓటమికి బాటలు వేసుకుంటారా? గొల్లకురుమలు కూడా ‘గొర్రె కసాయిని నమ్మినట్టు’ మరోసారి అధికారి పార్టీని నమ్ముతారా లేక ఓటు అనే ఆయుధంతో మోసం చేసిన బీఆర్ఎస్ కు బుద్ధి చెబుతారా? వేచి చూడాలి.

- ఉడుత రవిందర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,
(గొర్రెలు, మేకల పెంపకందార్ల సంఘం)