సంపూర్ణ అక్షరాస్యత ఊసేలేదు.. నీతి ఆయోగ్ పదేపదే అలర్ట్ చేసినా పట్టించుకోలేదు

సంపూర్ణ అక్షరాస్యత ఊసేలేదు.. నీతి ఆయోగ్ పదేపదే అలర్ట్ చేసినా పట్టించుకోలేదు

ఊసేలేని ‘ఈచ్ వన్–టీచ్ వన్’

సంపూర్ణ అక్షరాస్యతపై సర్కారు నిర్లక్ష్యం

అక్షరాస్యతలో జాతీయ సగటు కంటే తక్కువ స్థానంలో రాష్ట్రం

ఫైనాన్స్ కమిషన్ రిపోర్టులో వెల్లడి

హైదరాబాద్, వెలుగు: పోయిన ఏడాది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘ఈచ్ వన్ టీచ్ వన్’ స్లోగన్‌‌ పడకేసింది. వంద శాతం అక్షరాస్యత ఉన్న రాష్ట్రంగా తీర్చుదిద్దుతామని చెప్పిన సర్కారు మాటలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. దీంతో రాష్ట్రం మరోసారి అక్షరాస్యతలో కనిష్ట స్థాయికి పడిపోయింది. నిరక్షరాస్యత పోగొట్టేందుకు ఆరేండ్లలో రాష్ట్ర సర్కారు ప్రత్యేక చర్యలేవీ తీసుకోలేదు సరికదా.. ఈ విషయంపై నీతి ఆయోగ్ పదే పదే అలర్ట్ చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రతి ఏటా టెన్త్ తర్వాత పై చదువుల కోసం ఎన్‌‌రోల్‌‌ చేసుకునే స్టూడెంట్స్‌‌ సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. ఇది జాతీయ సగటు కంటే తక్కువగా ఉంటోందని 15వ ఫైనాన్స్ కమిషన్ తన రిపోర్టులో పేర్కొంది. అక్షరాస్యత పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఫైనాన్స్ కమిషన్ సూచించింది.

నినాదాన్ని మర్చిపోయిన సర్కారు

రాష్ట్రంలో అక్షరాస్యత పెంచడానికి పోయినేడాది న్యూ ఇయర్ రోజున ‘‘ఈచ్ వన్ టీచ్ వన్’’ నినాదాన్ని తీసుకున్నారు. ఇదే విషయాన్ని 2020–21 బడ్జెట్ సమావేశాల్లో కూడా కేసీఆర్ పేర్కొన్నారు. ఈచ్ వన్– టీచ్ వన్ అనే నినాదంతో చదువుకున్న ప్రతి ఒక్కరూ.. మరొకరిని అక్షరాస్యుడిగా మార్చాలని కోరారు. కాని ఆ నినాదాన్ని ప్రభుత్వం ఏడాదిగా మరిచిపోయింది. దానికి ఎలాంటి ప్రణాళిక రూపొందించలేదు.

పరువు పోతుందని డేటా కూడా ఇవ్వలే

రాష్ట్రంలోని సామాజిక, ఆర్థిక పరిస్థితులపై ఫైనాన్స్ కమిషన్ ఐదేండ్లకు ఒకసారి రిపోర్టు ఇస్తుది. రిపోర్టు ఇచ్చే ముందు కమిషన్ సభ్యులు ప్రతి రాష్ట్రంలో పర్యటించి, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి డేటా కలెక్ట్‌‌ చేస్తారు. అయితే మన రాష్ట్రంలో కమిషన్ సభ్యులు పర్యటించిన సమయంలో అన్ని రంగాల సమాచారాన్ని ఇచ్చిన ప్రభుత్వం.. లిటరసీ డేటా ఇవ్వలేదని తెలిసింది. ఇదే విషయాన్ని ఫైనాన్స్ కమిషన్ తన రిపోర్టులో పేర్కొంది. దేశ సగటు లిటరసీ 73% ఉంటే, మన రాష్ట్రంలో లిటరసీ రేటును అందులో పేర్కొనలేదు.

టెన్త్ తర్వాత చదవట్లేదు

టెన్త్ పూర్తయిన తర్వాత రాష్ట్రంలో స్టూడెంట్స్‌‌ పై చదువులకు వెళ్లడం లేదని ఫైనాన్స్ కమిషన్ రిపోర్టులో పేర్కొంది. గ్రాస్ ఎన్‌‌రోల్‌‌మెంట్ దేశ సగటు55.4 శాతం ఉంటే, మన రాష్ట్రంలో మాత్రం అది కేవలం 50.6 శాతంగా ఉంది. 16–17 ఏండ్ల వయసున్న మగ పిల్లల్లో అక్షరాస్యత 90% ఉంటే, 18–24 వయసు గ్రూపులో ఏకంగా మూడు శాతం తగ్గి 87 శాతానికి చేరింది. టెన్త్, ఇంటర్ తర్వాత ఆడపిల్లలను చదువు మానిపిస్తున్నారు. 16–17 ఏండ్లు ఉన్న ఆడపిల్లల్లో 91.9% అక్షరాస్యత ఉంటే, 18–24 వయసున్న మహిళల అక్షరాస్యత 11% తగ్గి 79.5 శాతానికి పడిపోయింది. జోగులాంబ జిల్లాలో అత్యల్పంగా 49.87% అక్షరాస్యత ఉండగా.. నాగర్ కర్నూల్‌‌లో 54.38%, మూడో స్థానంలో వనపర్తి 55.67%, నాలుగో స్థానంలో మెదక్ 56.12%, కామారెడ్డి 56.51 శాతంతో తరువాతి స్థానాల్లో నిలిచాయి.

వెనుకబడ్డ తెలంగాణ

మన రాష్ట్రం అక్షరాస్యతలో వెనుకబడి ఉంది. గతేడాది నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీసు నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఏడేండ్ల వయసు దాటిన వారిలో అక్షరాస్యత రేటుపై జరిపిన సర్వే ఆధారంగా ఒక నివేదిక ఇచ్చింది. అతితక్కువ లిటరసీ రేటు ఉన్న రాష్ట్రాల్లో ఏపీ 66.4%తో ఫస్ట్‌ ప్లేస్‌లో, తరువాతి స్థానాల్లో రాజస్థాన్‌‌ 69.7%, బీహార్‌‌‌‌లో 70.9 శాతంతో ఉన్నాయి. 72.80% తో మన రాష్ట్రం నాలుగో ప్లేస్‌లో ఉందని రిపోర్టులో పేర్కొంది. మన రాష్ట్రంలో లిటరసీ రేషియో తక్కువగా ఉందని  నీతిఆయోగ్‌‌ సభ్యులు గతేడాదే సర్కారును అలర్ట్‌‌ చేశారు. ఇదే విషయాన్ని వారం రోజుల క్రితం ప్రగతి భవన్‌‌లో సీఎం కేసీఆర్‌‌‌‌తో జరిగిన మీటింగ్‌‌లో నీతి ఆయోగ్‌‌ వైస్‌‌ చైర్మన్‌‌ రాజీవ్‌‌ కుమార్‌‌‌‌ గుర్తు చేశారని తెలిసింది.

For More News..

కేంద్రం నుంచి రాష్ట్రానికి 10,543 కోట్లు

కోర్టు టైం వేస్ట్ చేస్తారా?.. 25 వేలు ఫైన్ కట్టండి

పోతిరెడ్డిపాడు పక్కనే రాయలసీమ లిఫ్ట్‌

ఎలక్ట్రిక్‌‌ బైకులకు నో ట్యాక్స్‌‌, నో రిజిస్ట్రేషన్‌‌ ఫీజు