అంతిమ వీడ్కోలులో వివక్ష!

మనం చేసే పనులను బట్టి మన అంతిమ యాత్ర ఉంటుంది. చనిపోయిన తర్వాత ఆత్మగౌరవంతో దహన సంస్కారాలు జరగాలని చాలా మంది కోరుకుంటారు. కానీ విచిత్రం ఏమిటంటే అంతిమ వీడ్కోలులోనూ అంటరానితనం కనిపించడం బాధాకరం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత అంటరానితనం వివిధ రకాలుగా మార్పు చెందింది. స్వరాష్ట్ర ఉద్యమంలో త్యాగాలకు, పోరాటాలకు దళితులు అంటరాని వారు కారు. కానీ  తెలంగాణ వచ్చాక పదువులివ్వడంలో మాత్రం దళితులు అంటరానివారయ్యారు. పరిపాలన తెలియని వారయ్యారు. గూడ అంజన్న తెలంగాణ విముక్తి పోరాటంలో కవిగా, గాయకుడిగా, పోరాటయోధుడుగా క్రియాశీలకంగా పనిచేశాడు. కేసీఆర్ కంటే ముందే తెలంగాణ బతుకు చిత్రాన్ని, గోసల్ని తన పాటతో, మాటతో ఈ ప్రపంచానికి తెలిపాడు.

ఉద్యమంలో మహోన్నత పాత్రను పోషించిన గూడ అంజన్న తెలంగాణ వచ్చాక 2016 లో అనారోగ్యంతో మరణిస్తే అధికారంలో ఉన్న వారు అటువైపు తొంగి చూడకపోగా కనీసం అధికారిక లాంఛనాలతోనైనా అంత్యక్రియలు జరపలేదు. ఇదిలా ఉంటే బహుజన బిడ్డ నిజాం పాలనపై నిప్పుల యుద్ధం చేసిన వీరుడు, మూడు తరాల ఉద్యమ పొద్దు, చివరిదాకా తెలంగాణ కోసం తపించిన తెలంగాణ తొలి గురువు కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ కోసం తృణప్రాయంగా తన పదవిని వదులుకున్నారు. బాపూజీ మరణిస్తే మన నేతలు అటువైపు వెళ్లలేదు. అధికార లాంఛనాలతో అంతిమ క్రియలు జరపలేదు. 

అధికార పార్టీ ఎమ్మెల్యే అయినా..

సికింద్రాబాద్ కంటోన్మెంట్ సిట్టింగ్ అధికార పార్టీ ఎమ్మెల్యే జి.సాయన్న ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజా సేవలో ముందున్నాడు. 25 ఏండ్లు అధికారంలో ఉండి కూడా పెద్దగా ఆస్తులు కూడబెట్టకుండా అనారోగ్యంతో మరణించాడు. కానీ సర్కారు కంటితుడుపు చర్యగా నివాళి అర్పించింది తప్ప.. అంతిమ సంస్కారాలను అధికారిక లాంఛనాలతో నిర్వహించలేదు. యువకుడిగా, ఉద్యమ కెరటంగా అనేక ఉద్యమాలు నిర్వహించిన పాటల పుట్ట సాయిచంద్. తను ముందుండి నడిచి ప్రతి పల్లెలో ప్రతి ఊర్లో జరిగిన ధూంధాంలలో తన ఆట, పాటలతో ఉద్యమ కాగడాల్ని రగిల్చాడు. ఇంత చేస్తే తెలంగాణ సర్కారు ఆయనకు.. ఎమ్మెల్సీ ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తగ్గింది. రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ తో సరిపెట్టింది. తనకు రావాల్సిన ఎమ్మెల్సీ అగ్రకులాలకు ఇచ్చి అవమానించారు. అయినా తను పార్టీ పట్ల విధేయత ను ప్రతిసారీ నిరూపించుకున్నాడు. గుండెపోటుతో చిన్న వయసులోనే కాలం చేశాడు. సాయిచంద్​అంతిమయాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలకతీతంగా వేలాదిమంది తరలివచ్చారు, ప్రభుత్వ పెద్దలు వచ్చారు. కానీ అధికారికంగా ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించలేదు. 

ప్రశ్నించే సమయం ఇదే..

గతంలో తెలంగాణకు ఎలాంటి సంబంధం లేని, రాష్ట్ర ఏర్పాటులో భాగస్వామ్యం అందివ్వని అగ్రకులాల సినీ దిగ్గజాలకు, నిజాం మనవడికి, ఇతరులకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. సాయిచంద్​కు చేయకపోవడం అంటరానితనం కాదా? తెలంగాణ ఏర్పాటులో తమ రక్తాన్ని చెమట చుక్కలుగా ధారపోసి అమరులైన గూడ అంజన్న, సాయన్న, సాయిచంద్ ల అంతిమ సంస్కారాలను ఎందుకు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించలేదు? వారు ముగ్గురు దళితులు కాబట్టే అర్హత లేదా? అగ్రకులాలతో సమానంగా వీరికి చరిత్రలో గౌరవ మర్యాదలు ఉంటాయని నిర్వహించలేదా? ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి. మాకు అర్థమైంది ఏంటంటే కులాన్ని బట్టి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు ఉంటాయనేది. ప్రభుత్వం, కేవలం ఓదార్పులతో, పేపర్ ల మీద సంతాప ప్రకటనలతో నివాళులు అర్పిస్తే మన వీరుల త్యాగాలకు గుర్తింపు రాదు. ఇంత జరుగుతున్నా పట్టించుకోని దళిత, బహుజన సమాజం సిగ్గుతో తలవంచుకుంటుందో, లేక ఇది వివక్ష కాదు కక్ష అని ప్రభుత్వ విధానాన్ని ప్రశ్నిస్తుందో తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. 

- పిల్లి సుధాకర్ 
రాష్ట్ర అధ్యక్షుడు, 
తెలంగాణ మాలమహానాడు