- 2016 లో శాంక్షన్ చేసిన కేంద్ర ప్రభుత్వం
- హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల ఎలుకుర్తి వద్ద ఏర్పాటుకు నిర్ణయం
- ప్రతిపాదిత జాగలో అక్రమార్కుల మట్టి దందా
- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కామెంట్లతో మరోసారి తెరమీదకు అంశం
‘‘తెలంగాణలో సైనిక్ స్కూల్ ఏర్పాటుకు కేంద్రం అంగీకరించింది. వరంగల్ లో ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. దీనికి సంబంధించి త్వరలోనే ఎంవోయూ కుదుర్చుకోబోతున్నామని సంతోషంగా ప్రకటిస్తున్నాను”
-2017 జనవరి 17న తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో సీఎం కేసీఆర్
హనుమకొండ, వెలుగు: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి శాంక్షన్ చేసిన సైనిక్ స్కూల్ ఏర్పాటు ప్రక్రియ ఏడేండ్లు దాటినా ముందుకు కదలడం లేదు. స్కూల్ ఏర్పాటుకు హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఎలుకుర్తిలో అసైన్డ్ ల్యాండ్గుర్తించిన లీడర్లు ఆ తర్వాత అటువైపు తొంగి చూడడం లేదు. దీంతో సైనిక్ స్కూల్ కు పునాదులు ఎప్పుడు పడ్తయో తెలియని పరిస్థితి. సైనిక్ స్కూల్ ఏర్పాటు కోసం లేఖలు రాస్తున్నా రాష్ట్రం స్పందించడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో మళ్లీ ఆ అంశం తెరమీదకు వచ్చింది. అయితే ఏండ్లు గడుస్తున్నా రాష్ట్రం స్థలం అప్పగించకపోవడం, అక్కడ ఎలాంటి పనులు మొదలుకాకపోవడంతో కొంతమంది అక్రమార్కులు ఆ ల్యాండ్‌పై కన్నేశారు. జేసీబీలు, టిప్పర్లతో అదే స్థలంలో మట్టి దందాకు తెరలేపారు. దీంతో సైనిక్ స్కూల్ ప్రపోజల్ పెట్టిన స్థలం కాస్త బొందలగడ్డగా మారుతున్నది.
50 ఎకరాలు చూసిన్రు..
కేంద్ర ప్రభుత్వం 2016లో రాష్ట్రానికి సైనిక్ స్కూల్ శాంక్షన్ చేసింది. భూసేకరణ, బిల్డింగ్ కన్ స్ట్రక్షన్, మౌలిక వసతుల కల్పనకు రూ.100 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేయగా.. శాశ్వత ప్రాతిపదికన బిల్డింగ్ నిర్మాణానికి స్థలం ఇవ్వాల్సిందిగా రాష్ట్రాన్ని కోరింది. ఈ మేరకు ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్, అప్పటి డిప్యూటీ సీఎం, ప్రస్తుత ఎమ్మెల్సీ కడియం శ్రీహరి కూడా వివిధ సందర్భాల్లో స్పష్టం చేశారు. ఆ తర్వాత ధర్మసాగర్ మండలం ఎలుకుర్తిలో ఇందిరాగాంధీ హయాంలో పేద రైతులకు ఇచ్చిన సర్వే నెంబర్ 160 లోని అసైన్డ్ ల్యాండ్ పరిశీలించారు. ఆ సర్వే నెంబర్ లో మొత్తం 229 ఎకరాల భూమి ఉండగా.. అందులో సైనిక్ స్కూల్ కోసం 50 ఎకరాలు, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కోసం మరో 50 ఎకరాలు పరిశీలించి పెట్టారు. అక్కడి రైతులు అదే ల్యాండ్ ను నమ్ముకుని బతుకుతుండగా.. వారందరికీ పరిహారం ఇచ్చిన తర్వాతనే రెండు స్కూళ్లకు భూసేకరణ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు సైనిక్ స్కూల్ కు భూసేకరణకు అప్పట్లోనే రూ.4 కోట్లకు పైగా ఫండ్స్ శాంక్షన్ చేశారు. కానీ ఏడేండ్లు దాటినా ఆ ప్రక్రియ ముందుకు మాత్రం కదలడం లేదు. అయితే అసైన్డ్ ల్యాండ్‌ను ప్రభుత్వం తిరిగి తీసుకుంటుందనే ఉద్దేశంతో ఆఫీసర్లు ఆ సర్వే నెంబర్ ను ప్రొహిబిటెడ్ లిస్ట్ లో పెట్టారు. దీంతో అక్కడి రైతులు ఇటు పట్టా పాస్ బుక్కులు రాక.. అటు పరిహారం అందక రెండు రకాలుగా నష్టపోతున్నారు.
జాగ ముచ్చటే ఎత్తుతలేరు..
సైనిక్ స్కూల్ తో పాటే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్(హెచ్‌పీఎస్) సొసైటీకి స్థలం ఇచ్చేందుకు గతంలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సైనిక్ స్కూల్‌కు ప్రపోజల్ పెట్టిన స్థలం పక్కనే అదే సర్వే నెంబర్ లోని మరో 50 ఎకరాలు హెచ్‌పీఎస్‌కు ప్రతిపాదించగా.. సంబంధిత ల్యాండ్ కేటాయిస్తూ రెండేండ్ల కిందట జీవో నెం.93 జారీ అయ్యింది. ఈ మేరకు స్థలాన్ని అప్పగిస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు 2021అక్టోబర్ 18న హైదరాబాద్‌లోని మంత్రుల నివాసంలో హెచ్‌పీఎస్ సొసైటీ సభ్యులకు అంగీకార పత్రం అందించారు. ఆ తర్వాత సంబంధిత రైతులకు ఎకరాకు రూ.8.60 లక్షల చొప్పున మొత్తం 50 ఎకరాల్లోని 56 మంది రైతులకు దాదాపు రూ.4.3కోట్లకుపైగా నిధులు రిలీజ్ కాగా రైతులకు అందజేశారు. కానీ ఒకేసారి తెరమీదకు వచ్చిన రెండు స్కూళ్లలో సైనిక్ స్కూల్ ఊసెత్తకపోవడంతో ఆ విషయం కాస్త మరుగున పడింది. దీంతోనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పలుమార్లు రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం వల్లే సైనిక్ స్కూల్ కు అడుగులు పడడం లేదని చెప్పారు. ఇదే విషయాన్ని ప్రధాని మోడీ టూర్ నేపథ్యంలో ఆదివారం హరిత హోటల్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో కూడా చెప్పారు. అయినా దీనిపై అధికార పార్టీ నేతలు ఎప్పుడూ స్పందించిన దాఖలాలు లేవు.
అదే జాగలో మట్టి దందా
ప్రభుత్వం సైనిక్ స్కూల్ కోసం పరిహారం ఇచ్చి, భూమి తీసుకుంటుందనే ఉద్దేశంతో అక్కడి రైతులు ఆ స్థలాన్ని ఖాళీగానే ఉంచుతున్నారు. ఏండ్లు గడుస్తున్నా పునాది పనులు కూడా స్టార్ట్ కాకపోవడంతో కొందరు అక్రమార్కులు ఆ స్థలంలో మట్టి దందా చేస్తున్నారు. ఎలాంటి పర్మిషన్లు తీసుకోకుండానే రాత్రికి రాత్రి జేసీబీలు, టిప్పర్లతో అక్కడి మట్టి కొల్లగొడుతున్నారు. దీంతో సైనిక్ స్కూల్ కోసం ప్రతిపాదించిన స్థలం ఇప్పుడు బొందల గడ్డగా మారింది. ధర్మసాగర్ మండల కేంద్రానికి కూతవేటు దూరంలోనే ఈ మట్టి దందా సాగుతుండగా.. మైనింగ్, పోలీస్, రెవెన్యూ ఆఫీసర్లు లైట్ తీసుకోవడంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని సైనిక్ స్కూల్‌కు స్థలం అప్పగించడమే కాకుండా అక్కడ జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు.