పాత అప్లికేషన్లకే మైనార్టీ బంధు!.. కొత్తవాటిపై ఇంకా ఖరారు కాని గైడ్ లైన్స్

సూర్యాపేట, వెలుగు: మైనార్టీలకు ఆర్థిక సాయం అందించేందుకు తీసుకొచ్చిన మైనార్టీ బంధుపై ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. స్కీమ్‌కు సంబంధించి ఇంకా గైడ్‌లైన్స్‌ ఖరారు చేయకపోవడంతో గతంలో లోన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఆర్థిక సాయం చేసి.. వాటినే మైనార్టీ బంధుగా చూపిస్తోంది. వేలల్లో అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నా.. వందల మందికే సాయం అందిస్తోంది. మైనార్టీ బంధుకు సంబంధించి బడ్డెట్‌ విడుదల  కాకపోవడం, ఎంపిక ప్రక్రియలో జాప్యం జరుగుతుండడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. 

రెండు విడతల్లో 138 యూనిట్లు

2022–23 పైనాన్షియల్‌ ఇయర్‌‌కు సంబంధించి మైనార్టీలకు సబ్సిడీ రుణాలు ఇంచేందుకు ప్రభుత్వం 2022 డిసెంబర్‌‌లో నోటిఫికేషన్‌ విడుదల చేసింది.  ఇందులో సూర్యాపేట జిల్లాకు 69 యూనిట్ల మంజూరు చేయగా 3,126 మంది ముస్లింలు దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం కొన్నిరోజుల తర్వాత మరో 69 యూనిట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.  ఈ 138 యూనిట్లు గ్రౌండింగ్‌ కాకముందే...  మైనార్టీలైన ముస్లిం, సిక్కులు, పార్శీలు, జైనులు, బౌద్ధులు, క్రైస్తవులకు వందశాతం సబ్సిడీ రుణాలు ఇచ్చేందుకు మైనారిటీ సాయం పేరుతో ఆదేశాలు జారీ చేసింది.   

క్రైస్తవుల నుంచే అప్లికేషన్లు

138 యూనిట్లకు దరఖాస్తులు చేసుకున్న 3,126 మందిని మైనార్టీబంధు కింద పరిగణించడంతో పాటు ముస్లింలు మినహా మిగతా మైనార్టీల నుంచి మాత్రమే అప్లికేషన్లు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.  దీంతో గతంలో అప్లై చేసుకున్న 3,126 మంది ముస్లింలకు తోడు కొత్తగా 306 మంది క్రిస్టియన్లు రూ. లక్ష ఆర్థిక సాయం జాబితాలో చేరారు. మిగతా వర్గాలు జిల్లాలో లేరు.  కానీ, అధికారులు గతంలో మంజూరైన 138 యూనిట్ల లబ్ధిదారులకు మాత్రమే రూ. 1.38 కోట్లు పంపిణీ చేసి.. వీరినే మైనార్టీ బంధు కింద చూపిస్తున్నారు. 

నియోజకవర్గానికి 120 మందికి ఇస్తామని చెప్పినా.. 

ప్రతి నియోజకవర్గానికి 120 మంది చొప్పున మైనార్టీలకు ఆర్థిక సాయం సాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. ఇప్పటి వరకు ఎలాంటి గైడ్ లైన్స్ విడుదల చేయలేదు. అంతేకాకుండా గతంలో మైనార్టీ లోన్ల అప్లికేషన్లను పరిశీలించి రూ.లక్ష సాయం చొప్పున ఇస్తామన్నా.. లబ్ధిదారుల ఎంపిక జరుగలేదు.  నియోజక వర్గానికి 120 చొప్పున లెక్కేస్తే జిల్లాలో 480 మందికి సాయం చేయాల్సి ఉంది.  ఇందుకు అవసరమైన రూ.4.80కోట్లు కూడా విడుదల చేయడం లేదు. 

గైడ్ లైన్స్ ఖరారు కాలేదు 

నియోజకవర్గానికి 120మంది చొప్పున జిల్లాలో 480 మంది మైనార్టీలకు  రూ. లక్ష సాయం అందించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు అందుకు సంబందించిన గైడ్ లైన్స్, బడ్జెట్ రాలేదు. గతంలో మైనారిటీ లోన్ల కోసం అప్లయ్ చేసుకున్న 138 మందికి రూ.1.38కోట్లు అందించాం.  
- జగదీశ్వర్ రెడ్డి, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి

కొందరికే సాయం చేసిన్రు

లోన్ కోసం గత డిసెంబర్‌‌లో అప్లై చేసినవారందికి రూ. లక్ష ఇస్తామని సర్కారు చెప్పింది. కానీ,  కొంతమందికే సాయం చేసిన్రు. మా సంగతేందని ఆఫీసర్లను అడిగితే సప్పుడు జేస్తలేరు.  వెంటనే బడ్జెట్ విడుదల చేసి మాకు సాయం జెయ్యాలె. - షేక్ చాంద్ పాషా, చివ్వెంల