హైదరాబాద్, వెలుగు: గ్రేటర్‌పరిధిలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూంఇండ్ల కోసం వచ్చిన అప్లికేషన్లను ప్రభుత్వం మరోసారి వెరిఫై చేయిస్తోంది. ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు ఓ దఫా వెరిఫికేషన్ చేసి, మొత్తం 7.10 అప్లికేషన్లలో 3.50 లక్షల అప్లికేషన్లు సరైనవని తేల్చారు. కాగా ఈ అప్లికేషన్లను మరోసారి వెరిఫికేషన్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించడంతో బల్దియా, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనకు సిద్ధమయ్యారు. వెరిఫికేషన్ కోసం సిబ్బందికి శనివారం ప్రత్యేక యాప్ ఇచ్చారు. దీని ద్వారా ప్రతి దరఖాస్తుదారుడి వద్దకు వెళ్లి వారి నియోజకవర్గం, ఓటర్ ఐడీ నంబర్, కులం, మతం, ఫోన్ నంబర్, ప్రస్తుతం ఉంటున్న అడ్రస్ వివరాలు సేకరించనున్నారు. ఇయ్యాలో, రేపో ఆ ప్రాసెస్ మొదలుకానుంది.
అయితే నెలల వ్యవధిలోనే రెండో సారి వెరిఫికేషన్ ఎందుకు చేస్తున్నారన్న దానిపై జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులు క్లారిటీ ఇవ్వడం లేదు. మొదటి దఫాలో అప్లికేషన్లు సగానికి సగం తగ్గాయి. మరోసారి వెరిఫై చేస్తే మరికొన్ని తగ్గొచ్చని భావిస్తున్నట్లు తెలుస్తోంది. వెరిఫికేషన్‌లో 500 మంది బల్దియా, 162 మంది రెవెన్యూ సిబ్బంది పాల్గొననున్నారు. ఈ ప్రాసెస్ చార్మినార్ జోన్లో కాస్త ఆలస్యం కానున్నట్లు తెలిసింది.
కొల్లూరు ఇండ్లపైనే ఆశలు
మొత్తం 117 ఏరియాల్లో జీహెచ్ఎంసీ లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించాలని నిర్ణయించగా, ఇందులో 49 మురికి వాడల్లో 9,828 ఇండ్లు, 68 ఖాళీ స్థలాల్లో 90,172 ఇండ్లు కట్టాలని అనుకుంది. అయితే వివిధ కారణాలతో కొన్ని చోట్ల నిర్మాణాలు ప్రారంభం కాలేదు. 111 చోట్ల 90 వేల ఇండ్ల నిర్మాణాలు ప్రారంభించగా, వీటిలో 65 వేల ఇండ్లు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు 24 ప్రాంతాల్లో పూర్తిచేసిన 4,500 ఇండ్లను అధికారులు లబ్ధిదారులకు అందజేశారు. పంపిణీ చేసినవన్నీ గతంలో ఉన్న మురికి వాడలను తొలగించి కట్టించినవే. ఎన్నో ఏండ్లుగా అద్దె ఇండ్లలో ఉంటున్న నిరుపేదలకు ఇప్పటివరకు డబుల్ బెడ్రూం ఇండ్లు అందలేదు. అయితే 111 సైట్లలో అత్యధికంగా కొల్లూరులోనే 15,660 ఇండ్లు కట్టారు. సొంతిల్లు లేకుండా ఇబ్బందులు పడుతున్న ఎంతో మంది నిరుపేదలకు ఇక్కడ అందుతాయని ప్రతి సమావేశంలో మంత్రులు చెబుతూ వస్తున్నారు. కొల్లూరు సైట్లో గతేడాదే నిర్మాణాలు పూర్తయ్యాయి. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, మేడ్చల్– మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల లబ్ధిదారులకు వీటిని పంపిణీ చేయాల్సిఉంది. కొల్లూరు ఇండ్లను గత గురువారం సీఎం కేసీఆర్ ప్రారంభించారు. దీంతో లక్షల మంది ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఒక్కో ఇంటికి 7 అప్లికేషన్లు
గ్రేటర్ పరిధిలో నిర్మిస్తున్న ఇండ్ల కోసం 2017 నుంచి 2019 వరకు మొత్తం 7,09,718 అప్లికేషన్లు వచ్చాయి. అంటే ఒక్కో ఇంటికి ఏడు గురు అప్లికేషన్ పెట్టుకున్నారు. వెరిఫికేషన్‌లో భాగంగా బల్దియా సిబ్బంది దరఖాస్తుదారుల అడ్రస్‌లకు వెళ్లగా చాలా మంది అందుబాటులో లేరు. అప్లయ్ చేసుకున్న టైంలో అద్దెకున్న ఇండ్ల అడ్రస్‌లు పెట్టిన వారు వేర్వేరు ప్రాంతాలకు షిఫ్ట్అయ్యారు. వేలాది మంది ఫోన్ నంబర్లు కూడా కలవకపోవడంతో 3,54,756 అప్లికేషన్లను జీహెచ్ఎంసీ అధికారులు రిజెక్ట్ చేశారు.
3,54,962 అప్లికేషన్లు సరైనవని గుర్తించారు. అయితే వీరిందరికి ఇచ్చేందుకు ఇప్పుడున్న ఇండ్లు సరిపోవు. ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులు కలిసి మరోసారి వెరిఫికేషన్ చేస్తే మరికొన్ని అప్లికేషన్లు తగ్గుతాయేమోనని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ వెరిఫికేషన్ తర్వాత ఫైనల్ లిస్ట్‌లో ఉన్నవారికి డబుల్ బెడ్రూం ఇండ్లను అప్పగించనున్నారు.