- 3 టీఎంసీలతో సామర్థ్యంతో రెండు బ్యారేజీల నిర్మాణానికి ప్లాన్
- ఇవి పూర్తయితే గత లిఫ్ట్ స్కీములన్నీ వినియోగంలోకి..
జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా పరిధిలో గోదావరిపై బ్యారేజీ నిర్మాణాలకు సర్కార్ ప్లాన్ చేస్తోంది. 3 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రెండు బ్యారేజీలు నిర్మించేందుకు ప్రపోజల్స్ రెడీ చేయాలని ఇప్పటికే ఆఫీసర్లకు ప్రభుత్వం నుంచి ఆదేశాలొచ్చాయి. వీటి నిర్మాణంతో మూలనపడిన లిఫ్ట్‌లను వినియోగంలోకి తీసుకురావొచ్చని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. బీర్పూర్ మండలంలోని చిన్నకొల్వాయి– రేకులపల్లి, సారంగాపూర్ మండలం కమ్మునూరు గ్రామాల్లో ఈ మేరకు ఆఫీసర్లు క్షేత్రస్థాయి సర్వే కూడా చేపట్టారు. ఈ బ్యారేజీలు పూర్తయితే అటు సాగునీటి అవసరాలతోపాటు తాగునీటి సమస్యలు కూడా తీరనున్నాయి.
వినియోగంలోకి లిఫ్ట్ స్కీములు!
మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, రాయికల్, సారంగపూర్, ధర్మపురి పట్టణాలు గోదావరి పక్కనే ఉన్నా గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో సాగునీరు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గోదావరిపై రెండు, మూడు బ్యారేజీల నిర్మాణంతో 3 టీఎంసీల నీరు నిల్వ చేసుకునే చాన్స్ ఉంటుందని ఆఫీసర్లు భావిస్తున్నారు. దీంతో జిల్లాలోని అన్ని ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు అనువైన ప్రాంతాలను గుర్తించే పనిలో ఆఫీసర్లు ఉన్నారు. ఇందుకు బీర్పూర్ మండలం చిన్నకొల్వాయి, రేకులపల్లి మధ్య, సారంగాపూర్ మండలం కమ్మునూర్ గ్రామాల్లో బ్యారేజీలు నిర్మిస్తే ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు ప్రాథమిక నివేదికలు రూపొందించారు. దీంతోపాటు ఎత్తిపోతల పథకాలను వినియోగంలోకి తెచ్చేందుకు రిపేర్లకు ఖర్చులపై అధికారులు అంచనాలు రెడీ చేశారు.
గత బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యం...
జగిత్యాల జిల్లాకు సాగునీరు అందించేందుకు ఇరిగేషన్ నిపుణులు హనుమంతరావు ల్యాడర్ సిస్టం ప్రపోజల్స్‌ను నాటి బీఆర్ఎస్ సర్కార్‌కు నివేదించారు. ఈ ప్రపోజల్స్ ప్రకారం గోదావరిపై బ్యారేజీలు నిర్మించి, వాటిపై లిఫ్ట్‌లు ఏర్పాటు చేసి నీటిని తీసుకోవాలని సూచించారు. ఇలా 3 టీఎంసీల నీటిని సాగుకు వాడుకోవచ్చని ప్రతిపాదించారు. ఇదే అంశాన్ని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి సైతం నాటి సర్కార్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో ఎమ్మెల్సీ చొరవ చూపడంతో ఇరిగేషన్ ఆఫీసర్లు సర్వే చేసి నివేదికలు రూపొందించారు.
బ్యారేజీల నిర్మాణంతో నీటి కొరత ఉండదు
రైతాంగానికి అవసరమైన సాగునీరు అందించేందుకు కాంగ్రెస్ సర్కార్ కట్టబడి ఉంది. ఈ మేరకు గోదావరి పై బ్యారేజీల నిర్మాణం చేపట్టాలనే అంశాన్ని సీఎం రేవంత్ దృష్టికి తీసుకువెళ్లాం. చిన్న కొల్వాయి–రేకులపల్లి, కమ్మునూర్ గ్రామాల్లో బ్యారేజీలు నిర్మించాలని ఆఫీసర్లు నివేదికలు కూడా రూపొందించారు. సుమారు రూ.వెయ్యి కోట్లతో జిల్లా రైతులకు తాగు, సాగునీటి కష్టాలను శాశ్వతంగా పరిష్కరించవచ్చు. ఇదే విషయమై ఇరిగేషన్ నిపుణులు హనుమంతరావు ఇచ్చిన నివేదికలను గత బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యం చేసింది.
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జగిత్యాల