
- ప్రత్యామ్నాయ మార్గాలపై ఆలోచిస్తున్న ప్రభుత్వం
- ప్రాజెక్టు కోసం రూ.79,287 కోట్ల అప్పు తెచ్చిన గత సర్కార్
- ఏటా వడ్డీతో కలిపి కట్టాల్సిన కిస్తీలే సుమారు రూ.15 వేల కోట్లు
- ఇంకా కట్టాల్సిన అసలు ఏకంగా రూ.74 వేల కోట్లు
- 13 ఏండ్లపాటు 1.90 లక్షల కోట్లు చెల్లిస్తేనే రుణవిముక్తి!
- రూ. 25 వేల కోట్ల చొప్పున నాలుగేండ్లలోనే
- కాళేశ్వరం అప్పు నుంచి బయటపడేలా ప్రభుత్వ యోచన
- లేదంటే 10.5% వడ్డీని 5 శాతంలోపు రీస్ట్రక్చర్ చేసుకునే ప్రయత్నం
- రీస్ట్రక్చర్‌కు అనుమతి కోసం ఇప్పటికే కేంద్రానికి విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రం నెత్తిన గత సర్కారు మోపిన కాళేశ్వరం అప్పుల గుదిబండను వీలైనంత త్వరగా దింపుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఏటా వడ్డీలతో కలిపి కిస్తీల కింద చెల్లిస్తున్న భారీ మొత్తాన్ని సాధ్యమైనంత తగ్గించుకునేందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తున్నది. ప్రస్తుతం కాళేశ్వరం కిస్తీల రూపంలో రాష్ట్ర ఖజానా నుంచి ఏటా రూ.15 వేల కోట్ల దాకా ప్రభుత్వం చెల్లిస్తున్నది. కాంగ్రెస్ సర్కారు కడ్తున్న అప్పుల్లో ఇదే అత్యధిక మొత్తం కాగా, రాబోయే 13 ఏండ్ల పాటు మరో రూ.లక్షా 90 వేల కోట్లు రుణ సంస్థలకు చెల్లిస్తే తప్ప కాళేశ్వరం రుణ విముక్తి కలిగే పరిస్థితి లేదు. తీసుకున్న అప్పు కంటే ఇది డబుల్కన్నా ఎక్కువే. ఈ స్థాయి రుణభారం రాష్ట్ర ప్రయోజనాలకు కూడా మంచిది కాదని భావిస్తున్న ప్రభుత్వం.. దీన్ని దించుకునేందుకు తన ముందు ఉన్న రెండు మార్గాలపై దృష్టిపెట్టింది. ఇందులో తక్కువ వడ్డీతో ఎక్కువ కాలం చెల్లించేలా రుణాల రీస్ట్రక్చర్ ఒకటి కాగా.. మూడు, నాలుగేండ్లలో అసలు పూర్తిగా చెల్లించి తర్వాత వన్‌టైం సెటిల్మెంట్తో వడ్డీ కట్టేయడం రెండోది. ఈ క్రమంలో రుణాల రీస్ట్రక్చర్‌కు అనుమతించాలని ఇప్పటికే కేంద్రప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం గత బీఆర్ఎస్ సర్కారు వివిధ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, వాటి ద్వారా మొత్తం రూ.97,449 కోట్లకు లోన్ శాంక్షన్ తీసుకున్నది. ఇందులో రూ.79,287 కోట్ల అప్పును సగటున 10.5 శాతం వడ్డీకి తెచ్చింది. గతేడాది నుంచే కాళేశ్వరం అప్పులకు తిరిగి చెల్లింపులు మొదలయ్యాయి. వాస్తవానికి 2020-–21 నుంచే కాళేశ్వరం అప్పులు చెల్లించాల్సి ఉన్నా నాటి ప్రభుత్వం అదనపు గడువు కోరింది. దీంతో అసలు వడ్డీకి కొసరు వడ్డీ కూడా కలిసి అప్పు మరింత భారంగా మారిందని కాగ్ తన రిపోర్టులోనూ ఎండగట్టింది. మొత్తంమీద ఇప్పటివరకు చెల్లించిన కిస్తీలు పోగా, ఇంకా రూ.74 వేల కోట్ల అసలును వడ్డీతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా పైసా ఆదాయం లేకపోవడంతో సర్కారు గ్యారంటీ ఇచ్చినందున కిస్తీలు చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే పడింది. ప్రస్తుతం బ్యారేజీలు దెబ్బతిని కాళేశ్వరం నిరుపయోగంగా మారింది. ఒకవేళ ఉపయోగంలోకి తెచ్చినా ఆ ప్రాజెక్టు ద్వారా పైసా ఆదాయం వచ్చే పరిస్థితి లేదని నీటిరంగ నిపుణులు చెప్తున్నారు. ఈ అప్పులకు రాబోయే 13 ఏండ్ల పాటు ఏటా సుమారు రూ. 15 వేల కోట్ల చొప్పున చెల్లించాల్సిన పరిస్థితి.
ఏడాదికి రూ. 25 వేల చొప్పున కట్టేందుకు..!
కాళేశ్వరం అప్పును ఏటా రూ. 15 వేల కోట్ల చొప్పున 13 ఏండ్లపాటు రూ. లక్షా 90 వేల కోట్లు కట్టేకంటే రాబోయే మూడేండ్లలో రూ. 25 వేల కోట్ల చొప్పున రూ. 75 వేల కోట్ల అసలు చెల్లించి, తర్వాత వన్‌టైం సెటిల్మెంట్తో వడ్డీ కట్టేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నది. తద్వారా నాలుగేండ్లలో కాళేశ్వరం గుదిబండ నుంచి విముక్తి పొందడంతో పాటు రాబోయే ప్రభుత్వాలపై లక్ష కోట్లకు పైగా భారాన్ని తగ్గించినట్లు అవుతుందని భావిస్తున్నది. ప్రస్తుతం ఏటా రూ. 15 వేల కోట్ల దాకా కిస్తీలు చెల్లించాల్సి వస్తున్నది. రూ. 25 వేల కోట్ల చొప్పున చెల్లించాలంటే అదనంగా మూడు నుంచి నాలుగేండ్లపాటు రూ. 10 వేల కోట్ల మేర కొత్త అప్పు తేవాల్సి ఉంటుంది. తక్కువ వడ్డీకి (5 నుంచి 7శాతం) లోన్లు ఇచ్చే సంస్థల ద్వారా ఈ మొత్తాన్ని సేకరించాలని సర్కారు ఆలోచిస్తున్నదని ఓ ఉన్నతాధికారి చెప్పారు. గత సర్కార్ యూనియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ కన్సార్షియం, బ్యాంక్ ఆఫ్ బరోడా, నాబార్డు, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఇతర సంస్థల నుంచి కాళేశ్వరం కోసం అప్పులు తీసుకుంది. వీటిలో సగటున వడ్డీ రేటు10.5 దాకా ఉంది. నాలుగేండ్లలో చెల్లించడం వీలుకాకుంటే రుణాల రీస్ట్రక్చర్ద్వారా 5 శాతం కన్నా తక్కువ వడ్డీకి లోన్లు ఇచ్చే ఇతర ఫైనాన్స్ సంస్థల సాయంతో కిస్తులు ఎక్కువ కాలం చెల్లించే అవకాశాలపైనా ప్రస్తుత ప్రభుత్వం సీరియస్‌గా ఆలోచిస్తున్నట్లు సదరు అధికారి తెలిపారు.