హైదరాబాద్, వెలుగు: ఊర్లల్ల తాగునీటి నిర్వహణ బాధ్యతలను గ్రామ పంచాయతీలకు అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. తాగు నీటి నిర్వహణ బాధ్యతలను గ్రామ పంచాయతీలకే అప్పగించాలని ఇటీవల పంచాయతీ రాజ్ శాఖ రివ్యూలో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు ఆర్ డబ్ల్యూఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. తాగు నీటి నిర్వహణపై గ్రామ పంచాయతీలకు పలు గైడ్ లైన్స్ కూడా ఇచ్చారు. గ్రామాల్లోని ఇండ్లకు, సర్కార్ స్కూళ్లు, అంగన్ వాడీలు, ఇతర ప్రభుత్వ సంస్థలకు నీటి సరఫరా చేయాలని పేర్కొన్నారు.
పైప్ లైన్లు, ట్యాప్ లు, రిపేర్ల పనులు మిషన్ భగీరథ ఏఈఈ, ఏఈలకు అప్పగించారు. వీటికి అయ్యే ఖర్చులను కేంద్ర ఆర్థిక సంఘం లేదా స్టేట్ ఫైనాన్స్ కమిషన్ గానీ, గ్రామ పంచాయతీ నిధుల నుంచి గానీ తీసుకోవాలన్నారు. గ్రామాల్లోని వాటర్ఓవర్ హెడ్ ట్యాంకులను ప్రతి 10 రోజులకు ఒకసారి క్లీన్ చేయడంతో పాటు క్లోరినేషన్ చేయాలన్నారు. తాగు నీటి పైప్ లైన్లకు గ్రామ ప్రజలు మోటార్లు పెట్టకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రిజర్వాయర్ల నుంచి గ్రామ పంచాయతీలకు వచ్చే నీటి సరఫరాపై స్పెషల్ ఆఫీసర్లు, పంచాయతీ సెక్రటరీలు లాగ్ షీట్లు మెయింటెయిన్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 3 నెలలకు సరిపడా బ్లీచింగ్ పౌడర్ ను నిల్వ ఉంచుకోవాలని సూచించింది.